Thursday, May 2, 2024

ఏ రూల్ కిందయినా చర్చకు సిద్ధమే కానీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు చెక్ పెట్టే ఆలోచనలో అటు ప్రభుత్వం, ఇటు విపక్షం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజ్యసభలో విపక్షాలు ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని పట్టుబడుతున్న విషయం తెలిసిందే. అలాగే రూల్ 267 కింద చర్చ జరగాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కారణంగా వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచి కూడా పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ప్రతిష్టంభనకు చెక్ పెట్టే ఉద్దేశంతో గురువారం కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషీలు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కూడా అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. అయితే అరగంటకు పైగా ప్రభుత్వం, ప్రతిపక్షాలమధ్య జరిగిన సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నదీ మాత్రం తెలియరాలేదు. అయితే ఈ విషయంలో ప్రతిపక్షం వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేసినట్లు తెలుస్తోంది.

మణిపూర్ అంశంపై ఏ రూల్ కిందనైనా చర్చించేందుకు ప్రతిపక్షాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే చర్చ అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలన్న డిమాండ్ విషయంలో మాత్రం విపక్షం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. సభ సజావుగా సాగడం కోసం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి విపక్ష కూటమి ‘ఇండియా’ పార్టీలు గైరుహాజరయిన తర్వాత రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీలు ఖర్గేతో సమావేశమయ్యారు. ప్రతిష్టంభనకు ముగింపు పలకడానికి కాల పరిమితి లేకుండా ఈ అంశంపై రాజ్యసభలో చర్చ జరపాలని ఈ సమావేశం సందర్భంగా ‘ఇండియా’కూటమి నేతలు మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో విపక్షంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, కొంత మంది ఎంపీలు ప్రధానమంత్రి సమాధానమిచ్చినా లేక హోంమంత్రి సమాధానమిచ్చినా సరే ఏ మార్గంలోనైనా చర్చ మొదలు కావాలని కోరుకొంటున్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

అయితే ప్రధానమంత్రి ప్రకటన చేయాలన్న తమ డిమాండ్ తిరుగులేనిదని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. మణిపూర్ అంశంపై ఏ రూల్ కింద చర్చ జరగాలనేదానిపై ప్రతిపక్షానికి ఎలాంటి పట్టుదల లేదని, అయితే ఎలాంటి కాలపరిమితి లేకుండా పూర్తిస్థాయి చర్చ జరగాలని మాత్రమే కోరుకుంటున్నాయి’ అని ఓ ప్రతిపక్ష నేత చెప్పారు. రాజ్యసభలో ప్రతిష్టంభనను తొలగించి సభలో మణిపూర్ అంశంపై చర్చ జరిగేలా చూడడానికి ‘ఇండియా’ పార్టీలు ఓ మధ్యేమార్గాన్ని సూచించాయి. ప్రభుత్వం దీనికి అంగీకరిస్తుందని ఆశిస్తున్నాం’ అని సమావేశం అనంతరం రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. రూల్ 267, రూల్ 176లలో దేని కింద కూడా కాకుండా వేరే రూల్ కింద చర్చకు ప్రతిపక్ష పార్లీ ప్రతిపాదించినట్లు సంబంధింత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మణిపూర్‌లో తమ పర్యటన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో దేశ ప్రజలకు తెలియజేయాలని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కోరుకున్నారని మరో ప్రతిపక్ష నేత చెప్పారు.‘

ఇది ఇగోకు సంబంధించిన విషయం కాదు కానీ ప్రధాన మంత్రి మణిపూర్ గురించి మణిపూర్ కూడా భాగమైన దేశ ప్రజల గురించి మాట్లాడి తీరాలి’ అని ఆ నాయకుడు చెప్పారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయడం, సమగ్ర చర్చ జరగాలనే దానిపై రాజీ లేదని రాజ్యసభలో ప్రతిపక్ష కూటమి నేతలు అంటున్నారు. అంతేకాదు ఈ అంశంపై రూల్ 267 కింద చర్చ జరగాలని కూడా విపక్షం పట్టుబడుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చకు అంగీకరించింది. ఈ కారణంగానే గత నెల 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి ప్రతిరోజూ సభలో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News