Tuesday, April 30, 2024

దేశానికే తలమానికం !

- Advertisement -
- Advertisement -

నిజాం నిర్మించిన తరహాలో మసీదు నిర్మాణం
ఒకే చోట గుడి, మసీదు, చర్చి నిర్మించుకున్నాం
ఇది చూసి భారతదేశం నేర్చుకుంటుంది
గుడి, మసీదు, చర్చి ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్
గవర్నర్ తమిళిసైకు స్వాగతం పలికిన కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : నిజాం నిర్మించిన తరహాలో మసీదు నిర్మాణం చేపట్టామని, ఒకే చోట గుడి, మసీదు, చర్చి నిర్మించుకున్నామని, ఇది చూసి భారత దేశం నేర్చుకుంటుందని సిఎం కెసిఆర్ అన్నారు. తొలిసారిగా సచివాలయానికి వచ్చిన గవర్నర్‌కు సిఎం కెసిఆర్ స్వాగతం పలికారు. ఈ మూడు నిర్మాణాలు ప్రారంభం కావడంతో తెలంగాణ సచివాలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదుల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నల్లపోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సిఎం కెసిఆర్‌లు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్చి ప్రారంభ వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని వారు కేక్ కట్ చేశారు. అనంతరం మసీదును ప్రారంభించారు. ఈ సందర్భంగా కెసిఆర్ నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్టాపన పూజలో మంత్రి వేముల దంపతులు
ఆలయం ప్రారంభోత్సవంలో భాగంగా శుక్రవారం స్థాపిత పూజ, ప్రతిష్టాపన హోమం, మహాస్నపనం(తిరుమంజనం), వేద పారాయణం, మహాలక్ష్మీ యాగం, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. చండీయాగం, ప్రాణప్రతిష్ఠాపన హోమం, ధ్వజస్తంభ, యంత్ర, విగ్రహాల ప్రతిష్ట, వేదోక్తంగా ప్రాణప్రతిష్ట, మూడు ఆలయాల శిఖర కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సిఎం కెసిఆర్ సూచనలకు అనుగుణంగా ఆలయ పున:ప్రతిష్ట ఏర్పాట్లను, పూజా కార్యక్రమాలను మంత్రి వేముల అందరినీ సమన్వయం చేసుకుంటూ పండుగ వాతావరణంలో నిర్వహించారు. కాగా, మధ్యాహ్నం నిర్వహించిన పూర్ణాహుతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కెసిఆర్‌లు హాజరయ్యారు.
గవర్నర్‌కు తన ఛాంబర్‌ను చూపించిన సిఎం
ఈ కార్యక్రమం అనంతరం గవర్నర్ తమిళిసైను సిఎం కెసిఆర్ కొత్త సచివాలయంలోకి తీసుకెళ్లారు. ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌ను గవర్నర్‌కు చూపించారు.ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, గవర్నర్‌కు మంగళ వాయిద్యాలతో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News