Monday, April 29, 2024

జీవవైవిధ్యానికి రక్ష హరితహారం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచాలని సిఎం కెసిఆర్ హరితహారం పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు పచ్చగా ఉండేందుకు, ఆహ్లాదకర వాతావరణం అంతటా విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. గత పాలకుల హయాంలో మోడు వారిన ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నేడు ఊరూరా మొక్కలు నాటుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందులో భాగంగా వృక్షసంపదను పెంచేందుకు గ్రామాల నుంచి మొదలుకొని పట్టణాలు, నగరాలు సైతం పచ్చగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. వర్షాకాల సీజన్‌లో కోట్లాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని సామూహికంగా ఒక మహాయజ్ఞంలా ప్రభుత్వ, అధికార యంత్రాంగాలు చేపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ఆయా ప్రాంతాల్లోని రైతులు వారి పొలాల వద్ద మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. గడచిన ఈ తొమ్మిదేండ్లలో హరితహారం ఫలితాలు అబ్బురపరిచేలా ఉన్నాయి. ఈ హరిత హరంలో 2015 నుంచి 2023 వరకు జరిగిన కృషి అసాధారణమైనది.

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సరికొత్త ఆలోచనతో ప్రారంభించిన ‘హరితహారం’ కార్యక్రమం ఎటు చూసినా పచ్చదనానికి, ఆహ్లాదకర వాతావరణానికి జీవం పోస్తోంది. జీవవైవిధ్యానికి బలమైన పునాదులు వేసిన ప్రభుత్వం ప్రపంచ రికార్డు వైపు దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఎనిమిది విడతలుగా ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్న ప్రభుత్వం 9వ విడత కార్యక్రమానికి సిద్ధమవుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శనివారం రంగారెడ్డిలోని మంచిరేవులు టెక్ ఫారెస్ట్ పార్క్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2015లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ శాఖలే కాకుండా ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇప్పటి వరకు రూ. 11,095 కోట్ల వ్యయంతో, రాష్ట్రం 288 కోట్ల మొక్కలను నాటింది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి మానవ జాతి చేసిన మూడవ అతిపెద్ద పర్యావరణ పరిరక్షణ ప్రయత్నంగా ప్రపంచ వ్యాప్తంగా హరితహారం గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి.

రాష్ట్రంలో గ్రీన్ కవరేజ్ 7.7% పెరిగిందని కేంద్ర ప్రభుత్వం కూడా తెలిపింది. ప్రాంతీయ, వాతావరణ వైవిధ్యాలను, అలాగే వివిధ రకాల మొక్కల డిమాండ్‌ను తీర్చడానికి, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,864 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 19.29 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా 30.29 కోట్ల మొక్కలు పెంచారు, తద్వారా అడవుల పెంపకం ప్రక్రియ విజయవంతమైంది. 2.03 లక్షల ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్లు, 13.44 లక్షల ఎకరాల్లో పునరుజ్జీవింపబడిన అడవులు ఉన్నాయి. మిడతల బెడదను ఎదుర్కోవడానికి 55 కోట్ల మొక్కలకు రూట్సాక్ట్ చికిత్స జరిగింది. అటవీ ప్రాంతాల్లోని చెట్లను అడవి మంటల ప్రమాదాల నుండి రక్షించడానికి, 21,452 అటవీ అగ్ని రేఖలను ఏర్పాటు చేశారు. భూసార పరిరక్షణతో పాటు నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచేందుకు చెక్ డ్యాంలు, ట్యాంకుల నిర్మాణం వంటి చర్యలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు, పట్టణ ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున తోటలను చూశాయి. ముఖ్యంగా ఎత్తైన చెట్లు, పట్టణ ప్రదేశాలను ఆక్రమించకుండా పట్టణ సౌందర్యాన్ని పెంపొందించడం ప్రారంభించింది. హరితహారం తరువాత, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం, హైదరాబాద్ 147 శాతం గ్రీన్ కవర్ లో పెరిగిందని గొప్పగా చెప్పుకుంటూ ప్రపంచ గుర్తింపు పొందిన గ్రీన్ సిటీగా రూపాంతరం చెందింది. హైదరాబాద్‌లోనే 456 కొత్త పార్కుల ఏర్పాటుకు ఈ కార్యక్రమం దోహదపడింది.

తెలంగాణకు హరితహారం వల్ల గొప్ప ఫలితాలు వచ్చాయి. హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నాటిన మొక్కలు : 288.48 కోట్లు, రహదారులకు ఇరువైపులా అడవులు (అవెన్యూ ప్లాంటేషన్): 1, 00,691 కిమీ, బహుళ రహదారి అడవులు (మల్టీ లెవెల్) ; 20,828 కి.మీ, అర్బన్ ఫారెస్ట్ పార్కులు: 109 (ఇప్పటికే 73 పార్కులు పూర్తయ్యాయి, ప్రజలకు అందుబాటులో ఉంచబడ్డాయి. హెచ్‌ఎండిఎ క్రింద ఫారెస్ట్ బ్లాక్‌లు: మొత్తం 129 ప్రాంతాలలో 188.. (మొత్తం వైశాల్యం: 1, 60,661 ఎకరాలు), మొత్తం 59 పార్కులు, అర్బన్ ఫారెస్ట్ హెచ్‌ఎండిఎ పరిధిలో 70 ఫారెస్ట్ కన్జర్వేషన్ బ్లాక్‌లను ఏర్పాటు చేశారు. 2023 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నర్సరీలు: 14,864, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రకృతి అడవులు: 19,472, బృహత్ పల్లె ప్రకృతి వనాలు: 2,077, ఈ ఏడాది మొత్తం 3 నర్సరీలు, 2024 లో ప్లాంటేషన్ లక్ష్యం: 20.02 కోట్లుగా పెట్టుకుని పని చేస్తున్నారు. 2023లో ప్రస్తుత సీజన్ ప్లాంటేషన్ లక్ష్యం: 19.29 కోట్లుగా ఉంది.

బ్రెజిల్‌లో అమెజాన్ అడవుల పునరుద్ధరణ కోసం 7.3 కోట్ల మొక్కలను ఆరేండ్లలో నాటేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నారు, 75 వేల ఎకరాల్లో ఇది సాగుతున్నది. వీటి సరసన నేడు తెలంగాణ హరితహారం చేరింది. మన హరితహారం ప్రపంచంలో మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా కీర్తించబడుతున్నది. తెలంగాణను హరితబాటలో నడిపి, ముఖ్యమంత్రి నేడు తెలంగాణ దేశంలోనే హరితహారంలో మొదటి గొప్ప స్ధానంలో ఉండేలా కృషి చేశారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. హరిత తెలంగాణగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన కృషి కూడా అభినందనీయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News