Thursday, May 2, 2024

వ్యాపించలేదు

- Advertisement -
- Advertisement -

తెలంగాణాలో కరోనా లేదు, ప్రజలెవ్వరూ భయపడోద్దు
అతిగా స్పందించకండి, అట్లాగని మేము రిలాక్స్‌గా లేము
ఇటలీ నుంచి వచ్చిన టెక్కికి, అపోలో శానిటేషన్ వర్కర్‌కు నెగటివ్ రిపోర్టు
రాష్ట్రంలో చేపడుతున్న నియంత్రణ చర్యలుపై కేంద్రం ప్రశంస
అధిక ధరలకు మాస్కులు అమ్మితే దుకాణాలు సీజ్ చేస్తాం
-మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ 19 (కరోనా వైరస్) తెలంగాణలో వ్యాప్తి చెందలేదని, ఇప్పటి వరకు కేవలం ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదైందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆ వ్యక్తికి కూడా గాంధీ ఐసొలేషన్ వార్డులో ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చిన వాళ్లల్లోనే అనుమానిత లక్షణాలు వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కోఠి డిఎంఈ(డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్) కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడిందని, పెండింగ్‌లో ఉన్న రెండు రిపోర్టులు కూడా నెగటివ్ వచ్చాయని ఆయన తెలిపారు. ఇటలీ నుంచి తిరిగి వచ్చిన ఐటి ఉద్యోగి, అపోలో శానిటేషన్ వర్కర్ కు కరోనా సోకలేదని పూణే ల్యాబ్ నిర్థారించిందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి తల్లికే కరోనా రాలేదంటే, ఇతరులకు వచ్చే అవకాశం చాలా తక్కువని మంత్రి అభిప్రాయపడ్డారు. గత వారం రోజులుగా వైద్యాధికారులు, ప్రసార మాధ్యామాలు తదితరులు ప్రజలను అవగాహన చేయడం, సలహాలు ఇవ్వడంలో ఎంతో కృషి చేశారని మంత్రి అభినందించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా లేదని, రాబోయే రోజుల్లో కూడా రాకూడదని కోరుకుంటున్నానని మంత్రి అన్నారు. రాష్ట్రంలో కరోనాపై చేపడుతున్న నియంత్రణ చర్యలు, అవగాహన కార్యక్రమాలుపై కేంద్రం ప్రశంసించిందని మంత్రి తెలిపారు.
అతిగా స్పందించకండి..
రాష్ట్రంలో కరోనాపై వస్తున్న అపోహలకు పట్టించుకోవద్దని, ఈ వైరస్‌పై పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల ప్రజలను కోరారు. ప్రజలంతా జిమ్మెదారుగా, బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. ఇప్పటికే అన్ని శాఖల ఆధ్వర్యంలో కరోనా నియంత్రణపై నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఎప్పటి కప్పుడు అన్ని వివరాలు సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు. థియేటర్లు, హోటళ్లకు వెళ్తున్న ప్రజల సంఖ్యను గమనిస్తున్నామని, చాలా మంది వదంతులు నమ్మి గందరగోళానికి గురవుతున్నారని మంత్రి అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నివసించే ఇంటి కిటికీలు తీస్తే, ఆ చుట్టు పక్కల వారు గందరగోళానికి గురవుతున్నారని, ఇది మంచి పద్దతి కాదని తెలిపారు. ఎలాంటి ఇబ్బంది లేదని స్వయంగా వైద్య మంత్రిగా ప్రకటిస్తున్నప్పుడు భయాందోళనలు ఎందుకని? ఆయన ప్రజలకు వివరించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి దూరంగా ఉండవచ్చని మంత్రి చెప్పారు.
మేము రిలాక్స్‌గా లేము…
కరోనా నియంత్రణ కోసం తాము నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని మంత్రి ఈటల స్పష్టం చేశారు. కరోనాపై అన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే కరోనా పై కమిటిలు వేశామని, వాటితో నిత్యం కరోనాపై నిఘా పెడతామని మంత్రి అన్నారు. కరోనా చికిత్స కోసం ఎన్ని బెడ్లను అయినా సరే ఏర్పాటు చేస్తామని దాదాపు ఇప్పటికే 3 వేల బెడ్లల్లో చికిత్స అందించేందుకు ప్రణాళిక ఉందని, ఒకవేళ వైరస్ తీవ్రత మరింత పెరిగితే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులన్నిటిలో చికిత్సను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇప్పటికే గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్‌కోఠి, ఆసుపత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని, వ్యాధి తీవ్రతను బట్టి మరిన్ని ఆసుపత్రుల్లో క్రమంగా ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ వైరస్ గాలితో సోకేది కాదు కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి చుట్టూ నిత్యం ఉండే తల్లికే కరోనా సోకలేదంటే, ఇతరులకు వచ్చే అవకాశం చాలా తక్కువని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈక్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆసుపత్రులు కరోనా కోసం సరిపోతాయని మంత్రి అన్నారు. ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో కరోనా కోసం సిబ్బంది, మందులు, బెడ్లు సిద్దంగా ఉన్నాయన్నారు.
అధిక ధరలకు మాస్కులు అమ్మితే దుకాణాలు సీజ్ చేస్తాం…
కరోనా ప్రభావంతో మార్కెట్లలో మాస్కులు ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ మాస్కులను సైతం ఐదారు రెట్లు అధిక ధరలతో అమ్ముతున్నారు. ఈ క్రమంలో మంత్రి దుకాణదారులపై సీరియస్ అయ్యారు. ఎవరైనా మాస్కులను అధిక ధరలకు విక్రయిస్తే ఆ దుకణాలను సీజ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు. అసలు సాధారణ వ్యక్తులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని, కేవలం కరోనా వచ్చిన వారు మాత్రమే హెచ్ 1 ఎన్ 1 మాస్కులు ధరించాలని ఆయన తెలిపారు. సాధారణ మాస్కుల వలన ఎలాంటి ఉపయోగం ఉండదని, ప్రజలు గందరగోళానికి గురై, ఇబ్బందులకు పడోద్దని మంత్రి సూచించారు.
ఐటి ఉద్యోగులు గందరగోళానికి గురికావద్దు..
కరోనాపై ఐటి ఉద్యోగులు భయబ్రాంతులకు గురికావద్దని మంత్రి ఈటల సూచించారు. చాలా కంపెనీల్లో ఉద్యోగులకు కరోనా టెన్షన్ పట్టుకుందని, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. కరోనాపై తప్పుడు సమాచారాలు షేర్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఇప్పటి వరకు తెలంగాణలో కేవలం ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదైందని, వదంతులు నమ్మి టెన్షన్ కావద్దని మంత్రి సూచించారు. ఇతర ప్రాంతల నుంచి వచ్చినంతా మాత్రానా అందరికి కరోనా రాదని ఆయన తెలిపారు. చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అనుమానిత లక్షణాలు లేకపోయినా, టెస్టులు చేయాలని కోరుతున్నారని, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదని మంత్రి కోరారు. స్పష్టమైన లక్షణాలు ఉంటేనా సరైన శాంపిల్ వస్తుందని, తద్వారా ల్యాబ్‌లో నిర్థారణ తేలుతుందని మంత్రి తెలిపారు. అపోహలు, సందేహాలపై టోల్ ఫ్రీ నంబరు 104కి ఫోన్ చేసి సంప్రదించాలని మంత్రి తెలిపారు. మైండ్ స్పెస్‌లో ఉద్యోగులకు కేవలం ఆందోళన చెంది బ్లాక్‌ను ఖాళీ చేసి వెళ్లారని, ఐటి పరిశ్రమల్లో కరోనా లేదని ఆయన వివరించారు.
కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ కరోనాకు చికిత్స…..ఇప్పటి వరకు ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లోనే కరోనాకు చికిత్స అందిస్తుండగా, తాజాగా కార్పోరేట్ ఆసుప్రతుల్లోనూ కరోనాపై చికిత్స చేయించుకోవచ్చని మంత్రి తెలిపారు. ఐసొలేషన్ వార్డులు ఉన్న కార్పోరేట్ ఆసుప్రతుల్లోనూ చికిత్స చేయవచ్చని ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తుంది. అయితే కరోనా పాజిటివ్ వస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధరలను మాత్రమే ఫీజులుగా తీసుకోవాలని ఆసుపత్రులకు వైద్యాధికారులు సూచించారు.

అలవాటు లేకపోయినా దేవున్ని మొక్కినా..
రాష్ట్రంలో మరో రెండు కరోనా శాంపిల్స్ కూడా నెగటివ్ రావడంతో మంత్రి ఈటల రాజేందర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు శుభవార్త, అదృష్టమని మంత్రి అభివర్ణించారు. ఈనెల 1 తేదిన ఒక వ్యక్తికి కొవిడ్ 19 పాజిటివ్ రావడం, మరో 88 మంది ఆయనను కలవడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా భయాందోళనలు కలిగాయని, బయటకు చెప్పలేకపోయినా చాలా బాధపడ్డానని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రెండు రోజుల క్రితం పంపిన 47 శాంపిల్స్‌లో 45 నెగటివ్ వచ్చినా, మరో 2 అనుమానం ఉండటంతో పూణే ల్యాబ్‌కి పంపామన్నారు. ఆ రిపోర్టులు కోసం రెండు రోజుల పాటు రాష్ట్రం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిందని, కానీ ప్రస్తుతం ఆ రిపోర్టులు కూడా నెగటివ్ రావడంతో సర్వంత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు దేవున్ని ప్రార్ధించడం అలవాటు లేకపోయినా, రాష్ట్ర ప్రజలకు ఏం కాకూడదని దేవున్ని మొక్కినా అని మంత్రి తెలిపారు. ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు తమ శాఖ అంతా బాధలో ఉందని వెల్లడించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే తాము సంతోషంగా ఉంటామని, ఇక మీదట కూడా వైరస్ ఎవరికి సోకకుండా ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. ప్రతి రోజూ అప్రమత్తంగా ఉంటామని, ప్రభుత్వం జిమ్మెదారి తనంతో పనిచేస్తుందని తెలిపారు. మనం 21 సెంచరీలో ఉన్నామని, అపోహాలకు గురై ఇబ్బందులకు పడవద్దని మంత్రి ప్రజలను కోరారు. చదువున్న వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని లేదంటే సమాజానికి నష్టమని మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా 88 మందిలో మరో 22 మంది శాంపిల్స్ కూడా నెగటివ్ వచ్చాయని మంత్రి తెలిపారు. సాప్ట్‌వేర్‌లో పనిచేసే అమ్మాయికి వైరస్ సోకిందని వస్తున్న వార్తల్లో నిజం కాదని అన్నారు. ఆ ఆమ్మాయికి కూడా నెగటివ్ రిపొర్టు వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడా పరీక్షలు నిర్వహించమని, కేవలం గాంధీలో మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి అన్నారు. వైరస్ తీవ్రత పెరిగితే రాష్ట్రంలోని ఆసుపత్రుల్లోని బెడ్లుకూడా సరిపోకపోతే నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను వాడుకుంటామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం గాంధీలో అన్నిసౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
జూనియర్ డాక్టర్లపై మంత్రి ఆగ్రహం..
గాంధీలో కరోనా చికిత్సపై జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన అర్థరహితమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని తెలిసిన డాక్టర్లు ఇలా చేయడం సమంజసం కాదని అన్నారు. రోగులకు నయం చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, గాంధీలో కరోనా వార్డును తరలించాలని జూడాలు చెప్పడం మంచి పద్దతి కాదన్నారు. గాంధీలో కరోనా ఇతరులకుసోకకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి స్పష్టం చేశారు.

Minister Etela Rajender press meet on Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News