Saturday, April 20, 2024

ఐదు కోట్లకు టికెట్లు అమ్ముకున్న పార్టీ.. దేశాన్ని అమ్ముకోదా..!

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో రూ. 5 కోట్లకు టికెట్లు అమ్ముకుంటుందని, ఆ పార్టీకి అధికారం ఇస్తే రేపు దేశాన్ని అమ్ముకుంటుందని తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల బ్రోకర్ జూటా మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో గురువారం రూ. 183 కోట్లతో నూతనంగా మంజూరైన మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి హరీశ్‌రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లు శంకుస్థాపన చేశారు. అనంతరం నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన బహిరంగ సభకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షత వహించగా సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మూడు ధర్నా.. ఆరు అరెస్టులుగా పాలన సాగిందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతీ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

నర్సంపేటకు మెడికల్ కళాశాల వస్తుందని ఎవరూ ఊహించి ఉండరన్నారు. ఎవరూ ఊహించనిది.. ఊహకు అందనిది ఆచరణలో పెట్టే నాయకుడు సిఎం కెసిఆర్ అన్నారు. గోదావరి జలాలు తెస్తే కాళ్లు కడిగి నీళ్లు చల్లుకుంటామని పలికిన కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. నర్సంపేటలో ఎంజీఎం స్థాయిలో ఆసుపత్రి సేవలు రాబోతున్నాయని 150మంది వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. మెడికల్ కళాశాలలో ఎల్‌కేజీ ఫీజు అంటే కేవలం రూ. 10 వేలతో చదువు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. పక్క రాష్ట్రాల్లో అమలు కాని పింఛన్ పథకం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రూ. 4000 ఇస్తామని చెప్పి మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఆరు పథకాలు కాదు ఆరుగురు ముఖ్యమంత్రులుగా పోటీపడతారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి గురించి చెప్పటం కన్నా గ్రూపు తగాదాలు గురించే మంచిగా చెప్పవచ్చునన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందో ఆలోచించాలన్నారు.

కాంగ్రెస్ మెనిఫెస్టోలోని ఆరు సంక్షేమ పథకాలు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని రోడ్ల పనులకు పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. 200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేటకు మెడికల్ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఆసుపత్రి మంజూరు కావడానికి స్థల దాత దొడ్డా మోహన్‌రావు కారణమని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాస్థాయిలో నర్సంపేటకు అన్ని విధాలా ప్రజా సౌకర్యాలు కల్పించామన్నారు. రూ. 37.5 కోట్లతో సబ్సిడీతో ఫాం మెకానైజేషన్ యంత్రాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 30 వేల మంది రైతులకు 50 శాతం సబ్సిడీతో యంత్రాలు అందిస్తున్నామన్నారు. గృహలక్ష్మి పథకంలో నర్సంపేట నియోజకవర్గానికి ప్రత్యేకంగా మరో 2000 ఇళ్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు తెలిపారు. ఈ సభలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News