Tuesday, April 30, 2024

పట్టణ పేదలకు ఉపాధి తరహా పథకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రామీణ ఉపాధి హామీ తరహాలో పట్టణ పేదలకూ ఓ పథకం ఉండాలని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూర్తికి విజ్ఞప్తి చేశారు. రాబోయే బడ్జెట్‌లో ఇందుకోసం ఓ పథకాన్ని ప్రకటించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టు అంశాల గురించి కేంద్ర మంత్రులకు వివరించడానికి రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. శనివారం ఇద్దరు కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, పియూష్ గోయల్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున పలు అంశాలు చర్చించారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌ను కలిసిన వారిలో ఎంపిలు రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, హెచ్‌ఎండిఎ కమిషనర్ అరవింద్‌కుమార్, మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పలు అంశాలకు సంబంధించి విజ్ఞప్తులు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురావాలని మంత్రి కెటిఆర్ కేంద్రమంత్రికి ప్రతిపాదన సమర్పించారు. మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణను ఆమోదించండిహైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండవ దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కెటిఆర్ కేంద్రమంత్రిని కోరారు.

లకిడీకపూల్ నుంచి బిహెచ్‌ఇఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్.బి.నగర్ వరకు 5 కిలోమీటర్ల మెట్రో లైన్‌కు ఆమోదం తెలిపి, ఆర్థిక సహాయం చేయాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టిన లింకు రోడ్డుల కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయని అన్నారు. ఇప్పటికే 22 మిస్సింగ్ లింక్ రోడ్లను పూర్తి చేశామని, మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయని వివరించారు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు దాదాపు రూ. 2,400 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 800 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి 15 శాతం నిధులు ఇవ్వండి
హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముఖ్యంగా ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను శుద్ధి చేయడంతో పాటు చెత్తను తరలించేందుకు అవసరమైన వాహనాల ప్రోక్యూర్‌మెంట్ కోసం, ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నిర్మాణం వంటి వివిధ కార్యక్రమాల కోసం స్వచ్ఛ భారత్ మిషన్ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద రూ. 400 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. రూ. 3,050 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి 15 శాతం నిధులను కేంద్రం అందించాలని, ఇందుకోసం రూ.450 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో చేపడుతున్న ఎస్‌టిపిల నిర్మాణ ఖర్చు దాదాపు

రూ. 3,722 కోట్లు అని, ఇందులో కనీసం 20 శాతం రూ. 744 కోట్లను కేంద్ర ప్రభుత్వం అందించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన సిటిజన్ సెంట్రిక్ రిఫార్మ్ కింద బయో మైనింగ్, మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిందని వీటి అన్నింటి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో చేపడుతున్న కార్యక్రమాలకు మొత్తంగా రూ. 3,777 కోట్ల ఖర్చు అవుతుందని ఇందులో రూ. 750 కోట్లను కేంద్రం ఆర్థిక సాయం చేయాలని మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ శానిటేషన్ హబ్‌పై కేంద్ర మంత్రి ప్రశంసల వర్షం
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో కూడిన శానిటేషన్ హబ్ వల్ల పురపాలక అభివృద్ధిలో అనేక సవాళ్లకు సమాధానం దొరుకుతుందన్నారు. ఈ అంశం పైన తెలంగాణ రాష్ట్రం తన నమూనాను, ఆలోచనలను పంచుకోవాలని హర్దీప్ సింగ్ పూరి కోరారు. త్వరలోనే తన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎస్‌ఆర్‌డిపి, లింకు రోడ్లు, పారిశుద్ధ్య రంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌యెంట్,లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ రావాలని కేంద్ర మంత్రిని కెటిఆర్ ఆహ్వానించారు. మంత్రి కెటిఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలకు సంబంధించిన విజ్ఞప్తులను హర్దీప్ సింగ్ పూరికి అందించారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో కెటిఆర్ భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తోనూ మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు. వాణిజ్యం, పరిశ్రమలు,వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ అంశాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో మంత్రి కెటిఆర్ చర్చించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పురోగతిని వివరించడంతోపాటు దాని ప్రాధాన్యతను మంత్రికి వివరించారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరిధాన్యం పండుతోందని, కాబట్టి రాష్ట్రం నుంచి అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను సేకరించాలని కోరారు. 2022- 23 రబీ సీజన్‌లో 20 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు పార్- బాయిల్ రైస్ లక్ష్యం కోసం అనుమతివ్వాలని మంత్రి కెటిఆర్ కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ను కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రికి కెటిఆర్ లేఖను అందజేశారు.

ఈ రబీ సీజన్‌లో రాష్ట్రంలో వరి సాగు 57 లక్షల ఎకరాలు అని, దేశంలో 50 శాతం కంటే ఎక్కువగా ఉందని వివరించారు. ఈ రబీ సీజన్‌లో రాష్ట్రం 66.11 లక్షల మెట్రిక్ టన్నుల వారిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా రబీ సీజన్‌లో పండిన వరి పంటలో ధాన్యం మిల్లింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో ముడి బియ్యం పంపిణీ సాధ్యం కావడం లేదని అన్నారు. మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఎఫ్‌టిఆర్‌ఐ) గత రబీ సీజన్‌లో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో టెస్ట్ మిల్లింగ్ నిర్వహించిందని, 48.20 శాతం విరిగిన శాతంతో నివేదికను అందించిందని చెప్పారు. రాష్ట్రానికి 10.20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్ రైస్ లక్ష్యం అనుమతించి మిగిలిన 51.11 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ధేశించిందని తెలిపారు.

లక్ష మెట్రిక్ టన్నుల ముడి బియ్యాన్ని ఎఫ్‌సిఐకి డెలివరీ చేయడంలో బ్రోకెన్ రైస్ అదనపు శాతం కారణంగా ఆర్థికపరమైన సమస్యలు రూ.42.08 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. మిగిలిన ధాన్యం కోసం రాష్ట్రం ముడి బియ్యం రూపంలో పంపిణీ చేయాల్సి వస్తే మొత్తం ఆర్థిక సమస్యలు రూ. 1441 కోట్ల వరకు చేరుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో 2022 -23 రబీ సీజన్‌లో అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల పార్- బాయిల్ రైస్ లక్ష్యం కోసం అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News