Sunday, April 28, 2024

అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదు

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud fires Central government

ఢిల్లీకి ఎవరు రమ్మనారని కేంద్ర మంత్రి మాట్లాడటం
తెలంగాణను అవమానపర్చడమే
ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే
రైతులను తొక్కాలని చూస్తే తెలంగాణ ఆగ్రహానికి గురికాక తప్పదు
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు…
కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మండిపాటు

హైదరాబాద్: జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి పైరవీల కోసం వెళతారని, తాము తెలంగాణ ప్రయోజనాల కోసం వెళతామని.. అడుక్కోవడానికి తాము బిచ్చగాళ్ళం కాదు, తెలంగాణ నేతలను బిజెపి బిచ్చగాళ్లుగా చూస్తోందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ దుయ్యబట్టారు. టిఆర్‌ఎస్ ఎల్పీ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, ఎంఎల్‌సి కేసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంఎల్‌సి పాడి కౌశిక్‌రెడ్డిలతో కలిసి వి.శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రమంత్రులు, నెల రోజులుగా పార్లమెంటు సభ్యులు రైతుల కోసం ఢిల్లీలో పోరాడుతున్నారన్నారు. మంత్రులను ఢిల్లీకి ఎవరు రమ్మనారు.. అని కేంద్ర మంత్రి మాట్లాడటం తెలంగాణను అవమానపరచడమేనని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ పడ్డ కష్టం అందరికి తెలుసని, బిజెపి నేతలు ఢిల్లీలో రైతుల కోసం కాకుండా తమ రాజకీయాల కోసం తమ పెద్దలతో మాట్లాడుతున్నారన్నారు. పార్టీ ప్రయోజనాలే వారికి ముఖ్యమయ్యాయని విరుచుకుపడ్డారు.

ధాన్యం సేకరణ పూర్తిగా కేంద్రం బాధ్యత.. దాన్నుంచి తప్పుకునే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారన్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ చావు నోట్లో తలకాయ పెట్టారని తెలిపారు. తమ మంత్రులను అవమానపరిచి ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్‌లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమ మంత్రులు హైదరాబాద్ రావచ్చు గాక.. పులి రెండు అడుగులు వెనకేసినంత మాత్రాన వెనకబడ్డట్టు కాదన్నారు. మంచి చేస్తే దేశమంతా తిరిగి కేంద్రం మంచి చేసిందని చెబుతాం.. చెడు చేస్తే దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తామని అన్నారు. రైతుల కోసం అన్ని పార్టీలు ఒక్కటైన సందర్భాలనేకమన్నారు. కానీ తెలంగాణలో ప్రతిపక్షాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. తమ మంత్రులు ప్రభుత్వ ప్రతినిధులు ప్రైవేటుగా ఢిల్లీకి వెళ్లలేదన్నారు. యాసంగిలో వరి వేయాలా వద్దా స్పష్టంగా కేంద్రం చెప్పాలని తెలిపారు. అధికార దాహంతో బిజెపి తెలంగాణను ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. తెలంగాణ కన్నా గొప్పగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆగ్రహానికి బిజెపి గురికాక తప్పదని, ఇది ఓ తెలంగాణ సమస్య కాదని, దేశ రైతులు కెసిఆర్ వెంట ఉన్నారని.. కెసిఆర్ పిలుపు కోసం వారు ఎదురు చూస్తున్నారన్నారు.

పంజాబ్ కో విధానం కర్ణాటకో విధానం తెలంగాణకు ఓ విధానమా.. అని ప్రశ్నించారు. రైతులను తొక్కాలని చూస్తే తెలంగాణ ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఇప్పటికైనా తెలంగాణకు క్షమాపణ చెప్పి కేంద్రం రైతులకు న్యాయం చేయాలన్నారు. ధాన్యం సేకరణపై కేంద్ర హామీ లేఖ ఇస్తే ఢిల్లీ ఓడిపోయినట్టు కాదు. తెలంగాణ ఉద్యమంలో మోడీ సహా బిజెపి నేతలు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని మోడీ చెప్పి మాట తప్పారన్నారు. రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఎన్ని తీర్మానాలు పంపినా కేంద్రం తెలంగాణకు న్యాయం చేయడం లేదన్నారు. బిసి గణన, ఎస్‌సి వర్గీకరణ, మహిళ రిజర్వేషన్లపై కేంద్రం తెలంగాణ తీర్మానాలను పక్కన బెట్టిందన్నారు. కెసిఆర్ మరోసారి అధికారంలోకి రాకూడదు ఆయన్ను బద్నాం చేయాలని బిజెపి నేతలు కుట్ర పన్నారన్నారు. వారి కుట్రలను చేధిస్తాం.. బిజెపిని ఎదుర్కోవడానికి తమ వ్యూహం తమకుందన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు.. రైతులతో పెట్టుకోకుండా సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News