ప్రతిపక్షాలను తిట్టడం మానుకోవాలి చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలి ఇప్పటికీ
తెలంగాణను దోచుకుంటున్న ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇంకా మూడున్నరేళ్లే రేవంత్ సిఎంగా
ఉండేది అందరమూ కలిసి కృషి చేస్తేనే కాంగ్రెస్‌కు అధికారం కమిషన్లను నియమిస్తూ
కాలయాపన చేస్తున్న రేవంత్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన
వ్యాఖ్యలు డికె శివకుమార్‌తో భేటీ వివరణ కోరుతానన్న క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ రవి
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన భాషను మార్చుకోవాలంటూ తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. ప్రతిపక్షాలను తిట్టడం మానుకోవాలని, రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పాలని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ సూచించారు. 20 మంది సీమా్రంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో లోగడ పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చిందని, అయితే ఈ విషయం తన సోదరుడు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియదని అన్నారు. ఇంకా మూ డున్నర సంవత్సరాలు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత ఎవరనేది చూద్దాం అని ఆయన వ్యాఖ్యానించారు. అందరమూ కలిసి కృ షి చేసిన ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా విషయంలో నది దాటేంత వరకూ ఓడ మల్లన్న, దాటిన తర్వాత బోడ మల్లన్న అన్న చందంగా వ్యవహారించడం భావ్యం కాదన్నారు. ఇదిలాఉండగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పిసిసి క్రమశిక్షణా సంఘం చైర్మన్, ఎంపి మల్లు రవి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలపై వివరణ కోరుతామని చెప్పారు.
బిఆర్‌ఎస్ హయాంలోనే..
తనకు మంత్రి పదవి కావాలనుకుంటే లోగడ బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వచ్చేదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్‌ఎస్ అధికారం కోల్పోయి అసహనంతో ఉందని ఆయన విమర్శించారు. శాసనసభ సమావేశాలకు హాజరుకాని ప్రతిపక్ష నేత, బిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు తొలుత తన ప్రతిపక్ష హోదాకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్లను నియమిస్తూ కాలాయాపన చేస్తున్నారని ఆయన తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద ఉన్న ప్రాజెక్టును మేడిగడ్డ వరకు తీసుకుని వచ్చి లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన బిఆర్‌ఎస్‌ను విమర్శించారు. రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ అనే పార్టీ ఉండదని అన్నారు. మిగులు బడ్టెజ్ ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయించిందని ఆయన కెసిఆర్‌ను విమర్శించారు.
రేవంత్‌కు సలహాలు మాత్రమే..
రాష్ట్ర సంపద లూటీ చేస్తుంటే కాంట్రాక్టర్ల విషయంలోగానీ భూముల విషయంలోగానీ ఇసుక మాఫియా విషయంలోగానీ ఏ విషయంలోనైనా తెలంగాణకు అన్యాయం చేసే పనులు ఎవరు చేసినా తాను బహిరంగంగా మాట్లాడుతానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాను సలహాలు మాత్రమే ఇస్తున్నానని విమర్శించడం లేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పేదల పార్టీ అని ఐదేళ్ళూ అధికారంలో ఉంటుందని ఆయన చెప్పారు.
కోమటిరెడ్డికి కృతజ్ఞతలు
తెలిపిన సోషల్ మీడియా
ఇదిలాఉండగా సోషల్ మీడియా ప్రతినిధులు బుధవారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా తూర్పారపడుతూ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ సోషల్ మీడియాను అగౌరపరచడం భావ్యం కాదన్నారు. రాజగోపాల్ రెడ్డి తమకు మద్దతునిచ్చినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
డికె శివకుమార్‌తో రాజగోపాల్ రెడ్డి భేటీ
కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశమై మంతనాలు జరిపారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శివకుమార్‌తో బుధవారం మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై వరుసగా విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి డికె శివకుమార్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వారివురి చర్చల అంశాలేవీ బయటకు రాలేదు.