Saturday, April 27, 2024

మహిళ రిజర్వేషన్ పోరాటానికి సన్నద్ధం కావాలి: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

మహిళ రిజర్వేషన్ పోరాటానికి సన్నద్ధం కావాలి
ఆడపిల్లలు స్మార్ట్ గా, స్మార్ట్ ఫోన్‌లా ఉండాలి
మహిళా లోకానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు
హైదరాబాద్: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పనకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలన్న పోరాటానికి సన్నద్ధం కావాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మంగళవారం మల్లారెడ్డి విద్యాసంస్థల్లో మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ మహిళగా మనం సహచర మహిళలకు ఏం చేస్తున్నామన్నది ముఖ్యమని, సాటి మహిళలకు ఏదైనా చేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలని ఆమె సూచించారు. తనకన్నా ముందున్నతరంలో మహిళలు స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారని, తన తరంలో మహిళలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఆ తర్వాత ఇప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం పోరాటానికి సన్నద్ధం కావాలని కవిత పిలుపునిచ్చారు.

మహిళా రిజర్వేషన్ పోరాటాన్ని తన ముందుకు తీసుకెళ్తున్నానని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్ మహిళా తరానికి మీరు ఏమీ చేస్తున్నారో ఆలోచించాలని ఆమె సూచించారు. లింగ సమానత్వం, మహిళలకు పురుషులకు సమానమైన వేతనాలు పనిగంటలు ఉండాలన్న ఉద్ధేశ్యంతోనే మహిళా దినోత్సవం వచ్చిందని, కానీ మనదేశంలో ఇంకా అసమానతలు అలానే ఉన్నాయని, సమానత్వం ఇంకా రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమానమైన వేతనాల కోసం ఆడపిల్లలు డిమాండ్ చేయాలని కవిత పిలుపునిచ్చారు.

పురుషులకు ఇచ్చే జీతాలతో సమానంగా మహిళలకు ఇవ్వాలి
మహిళా విద్యార్థులు ఆయా కంపెనీలు వచ్చే జీతాలను అధ్యయనం చేయాలని, పురుషులకు ఇచ్చే జీతాలతో సమానంగా తమకు ఇవ్వాలని డిమాండ్ చేయాలన్నారు. మార్పు ఇక్కడి నుంచి మొదలు కావాలని కవిత సూచించారు. చదువుకోవడం ఉద్యోగం చేయడం అన్న పద్ధతి కొంచెం పాతగా అయిందని, ఉద్యోగం చేసి అనుభవం గడించి మనమే ఒక పెద్ద పరిశ్రమ స్థాపించి వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించాలన్న పద్ధతి రావాలని కవిత అభిప్రాయపడ్డారు. బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం చేద్దామన్న ఆలోచన కాకుండా మనమే ఒక బహుళ జాతి సంస్థను ఎందుకు పెట్టకూడదన్న ఆలోచన చేయాలని ఆమె దిశానిర్దేశం చేశారు. ఈరోజు ఉన్న సాంకేతికత, అవకాశాల నేపథ్యంలో చిన్న ఐడియా, నిబద్ధత, పట్టుదల ఉంటే చాలనీ, డబ్బులు వాటంతట అవే వస్తాయని ఆమె స్పష్టం చేశారు.

ఐడియాలు ఉంటే సాయం చేయడానికి సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్, తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. ఒక ఐడియాతో వస్తే మార్గ నిర్దేశం చేయడానికి, వనరులు సమకూర్చడానికి, కంపెనీని స్థాపించడానికి టి- వర్క్, టి-హబ్ వంటివి అన్ని రకాల మద్దతు అందిస్తాయని పేర్కొన్నారు. ఆడపిల్లలు స్మార్ట్ గా ఉండడమే కాదు స్మార్ట్ ఫోన్‌లా ఉండాలని కవిత సూచించారు. జీవితంలోకి ఎవరు కావాలో వాళ్లని రానివ్వాలని, నెగటివ్ వ్యక్తులను రానివ్వకూడదని కవిత పేర్కొన్నారు. అందరూ చెప్పినది ఓపికగా వినాలని, కానీ మన మనసు ఏది చెబితే అదే చేయాలని ఆమె అని వ్యాఖ్యానించారు. ఎవరైనా కామెంట్ చేస్తే నవ్వి వాళ్లను విస్మరించాలని విద్యార్థినులకు కవిత సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ఆడపిల్లలను వేధిస్తే ఫిర్యాదు చేయకుండానే వారి ఖాతాలను తొలగించే విధానం రావాలని కవిత ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News