Thursday, May 2, 2024

రెండూ ముఖ్యమే

- Advertisement -
- Advertisement -

Modi

 

పిఎం నోట కొత్త నినాదం
జాన్ భీ ఔర్ జహాన్ భీ
(ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి)

లాక్‌డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు
రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం
వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా
13 రాష్ట్రాల సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో
ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా దెబ్బతో ఇప్పుడున్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని ఏకాభిప్రాయం కుదిరింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం దీనికి సంబంధించి13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏకబిగిన నాలుగు గంటల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తం గా లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీవరకూ కొనసాగించేందుకు ప్రధాని సంకేతాలు వెలువరించా రు. వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను కనీసం మరో రెండు వారాలు పెంచాల్సిన అవసరాన్ని ప్రధాని దృష్టికి తెచ్చారు. వచ్చే మంగళవారం ( 14వ తేదీ)తో ప్రస్తుత లాక్‌డౌన్ ముగుస్తుంది. ఈ దశలో ఈ దిగ్బంధం ఉండాలా? ఎత్తివేయాలా? సడలించాలా? అనే నిర్ణయం కీలకంగా మారింది. కట్టడి సుదీర్ఘకాలం ఉండాల్సిందేనని, ఈ క్రమంలో మరో రెండు వారాలు దీనిని పొడిగించాలని ప్రధానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేశారు. కరోనా మాస్క్ ధరించి వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్న ప్రధాని శనివారం కరోనాపై పోరుకు సంఘటితం కావాలని పదేపదే కోరారు.

దేశానికి ప్రజల ప్రాణాలూ, దేశ ఆర్థిక పరిస్థితి రెండూ ముఖ్యమేనని ఈ సందర్భంగా ప్రధాని పిలుపు నిచ్చారు. మూడు వారాల క్రితం దేశంలో లాక్‌డౌన్ ప్రకటన చేసిన సమయంలో ప్రధాని మోడీ జాన్ హైతో జహాన్ హై ( జీవితం ఉంటేనే ప్రపంచ మనుగడ) అనే నినాదానికి దిగారు. అయితే ఇప్పటి సిఎంల కాన్ఫరెన్స్‌లో దీనిని కొద్దిగా సవరిస్తూ జాన్ భీ జహాన్ భీ ( ప్రాణాలూ, ఆర్థిక వ్యవస్థ రెండూ ముఖ్యమే) అని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక స్థితి దెబ్బతినడం, ప్రజల జీవనోపాధికి గండిపడటంతో వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. దేశంలో కొంత మేర ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరణకు వీలుందని సిఎంలకు ఈ సందర్భంగా ప్రధాని సూచనప్రాయంగా తెలిపారు.

లాక్‌డౌన్ ఎత్తివేస్తే కోవిడ్ విజృంభణే
ఇప్పటి గడువు ప్రకారమే లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే కరోనా వైరస్ విజృంభిస్తుందని పలువురు ముఖ్యమంత్రులు ప్రధాని దృష్టికి తెచ్చారు. కొన్ని ప్రాంతాలలో కేంద్రీకృతం అయిన వైరస్ ఇతర చోట్లకు వ్యాపిస్తుంది. అప్పుడు దీనిని తట్టుకునే సాధనసంపత్తి, ఆర్థిక పుష్టి రాష్ట్రాలకు లేదని తెలిపారు. కేంద్రం తగు విధంగా స్పందించాల్సి ఉంటుందని, సాధ్యమైనంత ఎక్కువగా సహాయ ప్యాకేజ్ ప్రకటించాలని కోరారు. నాలుగు గంటల పాటు ప్రధాని ఎక్కువగా సిఎంల అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉన్నారు.

పరిశ్రమలు , నిర్మాణరంగంలో సడలింపు
లాక్‌డౌన్ సాగుతూ ఉండటంతో పరిశ్రమలు మూతపడ టం, ఇళ్ల ఇతరత్రా నిర్మాణాలు నిలిచిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీనితో దీనిపై ఆధారపడి బతికే లక్షలాది కోట్లాది మంది ప్రజలకు ఉద్యోగ ఉపాధి వనరులు పోతున్నాయని, ఈ దశలో ఆయా రంగాలలో దశలవారిగా లాక్‌డౌన్ సడలింపు ఉంటుందని ప్రధాని సూచనప్రాయంగా తెలిపారు. ఇతర ఆంక్షలను కూడా క్రమపద్థతిలో సరళీకృతం చేయడం జరుగుతుందని, రైతాంగానికి మరో ప్యాకేజీ ఉంటుందని ప్రధాని సూత్రప్రాయంగా చెప్పారు. రైతులకు పంటలు వచ్చే సమయం కావడంతో వారు తమ దిగుబడులను విక్రయించుకోవడానికి అవకాశం కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. మార్కెట్లు మూతపడి ఉంటే రైతులు తమ పంటలు, కూరగాయలను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు అనుమతి ఇస్తారు.

ముంబై, పుణే ఇతర ప్రాంతాలలో ఇప్పుడు మండీలు మూసివేశారు. నేరుగా ఇటువంటి విక్రయాలకు వీలు కల్పిస్తే దేశంలోని 130 కోట్ల మంది ప్రజలను సరైన పోషణకు వీలేర్పడుతుంది. ద్రవ్యోల్బణ పోకడలు తలెత్తకుండా చేయవచ్చునని తెలిపారు. మండీల నిర్వహణను పర్యవేక్షించే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టాన్ని తగు విధంగా సవరించడం జరుగుతుందని , రైతాంగం ఇప్పుడున్న సరఫరా చక్రాన్ని అధిగమించి నేరుగా ప్రజలకు తమ పంటలను విక్రయించుకునేందుకు వీలేర్పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా ప్రభావంతో ఇప్పటికే పంజాబ్, ఒడిషాలలో లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించారు.

గ్రామీణ ప్రాంతాలలో వద్దు : బీహార్
రైతాంగం, పల్లె ప్రజలు ఉపాధి దెబ్బతింటున్నందున లాక్‌డౌన్‌ను గ్రామీణ ప్రాంతాలలో ఎత్తివేయాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే లాక్‌డౌన్ కొనసాగింపు నిర్ణయానికి తాము వ్యతిరేకమైతే కాదని రాష్ట్రం తెలిపింది. రాష్ట్రంలో వరద సహాయ చర్యలు కొనసాగాల్సి ఉందని, పునర్నిర్మాణ కార్యక్రమాలు అత్యవసరం అని ఈ ప్రభు త్వం ప్రధానికి సూచించింది. కొందరు సీనియర్ అధికారులు సహా ప్రధాని మోడీ సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సిఎం కె చంద్రశేఖర రావు,. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెం గాల్ సిఎం మమత బెనర్జీ, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, బీహార్ సిఎం నితీష్‌కుమార ఇతరులు ప్రధానితో మాట్లాడారు. తమతమ రాష్ట్రాల సాధకబాధకాలను వివరించారు. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఆరంభం అయింది.

సుదీర్ఘ సమావేశం తరువాత లాక్‌డౌన్‌ను కొన్ని మినహాయింపుల మధ్య రెండు వారాలు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధం అయినట్లు, మొత్తం మీద ఈ నెల చివరి వరకూ దిగ్బంధనం సాగితీరుతుందని స్పష్టం అయింది. అయితే శనివారం లాక్‌డౌన్ పొడిగింపుపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.

లాక్‌డౌన్ కొనసాగిపునకు ప్రధాని తీసుకున్న నిర్ణయం సముచితమైనది. అందరి కన్నా ముందు నియంత్రణ చర్యలతో సత్ఫలితాలు సాధించాం. ఇప్పుడు నిలిపివేస్తే ఫలితం ఉండదు. అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సిఎం

వైరస్‌ను తట్టుకునే శక్తి ఉంది. అయితే అమలు ప్రక్రియలో విఫలం అవుతాం. అందుకే లాక్‌డౌన్ కొనసాగింపు సరైన మార్గం. శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ సిఎం

లాక్‌డౌన్ అవసరం, అయితే ఉమ్మడి రబీ పంట విధానం కీలకం. అశోక్ గెహ్లోట్ , రాజస్థాన్ సిఎం

లాక్‌డౌన్‌ను మానవీయ కోణంలో, ఆచరణాత్మకంగా పాటించాలి, బెంగాల్ కరోనాతో బాగా దెబ్బతింది,
మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సిఎం

సోమవారం నుంచి కేంద్ర మంత్రుల ఆఫీసు పనులు
దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే చర్యల రూపకల్పనకు కేంద్ర మంత్రులు ఈ నెల 13వ తేదీ నుంచి తమ కార్యాలయాలకు హాజరవుతారు. తమ అధికారిక పనులను ఆఫీసుల నుంచి పునరుద్ధరిస్తారు. ఈ మేరకు శనివారం నిర్ణయం తీసుకున్నారు. అన్ని మంత్రిత్వశాఖల సంయుక్త కార్యదర్శులు, అంతుకు మించిన ర్యాంక్‌ల అధికారులు తమతమ విభాగాలలో విధులకు హాజరు కావల్సి ఉంటుంది. ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి.

 

Modi said There must be Life and Finances
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News