Tuesday, May 21, 2024

వ్యాక్సిన్ సన్నద్ధతపై సమీక్ష

- Advertisement -
- Advertisement -

Modi will visit Ahmedabad and Hyderabad today

 

నేడు అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో ప్రధాని సుడిగాలి పర్యటన
పుణె పర్యటన రద్దు

అహ్మదాబాద్/ హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో సుడిగాలి పర్యటన జరపనున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి , తయారీ ప్రక్రియను స్వయంగా సమీక్షించేందుకు ప్రధాని శనివారం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, అహ్మదాబాద్‌లోని జైడన్ బయోటెక్ పార్క్‌లను సందర్శిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రధాని పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా సందర్శిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఆ కార్యక్రమం రద్దయింది.‘ కొవిడ్19పై పోరాటంలోభాగంగా భారత్ నిర్ణయాత్మక దశలోకి అడుగుపెడుతోంది. ఈ తరుణంలో ఆయా కంపెనీలను సందర్శించి , సైంటిస్టులతో ముచ్చటించడం ద్వారా వ్యాక్సిన్ తయారీ, పంపిణీ తదితర అంశాలపై ప్రాథమిక అవగాహన తెచ్చుకునేందుకు ప్రధానికి ఈ పర్యటన తోడ్పడుతుంది. తన పౌరులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్ సిద్ధమైన వేళ .. అందుకు అవసరమైన ఏర్పాట్లు, ఎదురయ్యే సవాళ్లు , రోడ్‌మ్యాప్ వంటి అంశాలపై ప్రధాని చర్చించనున్నారు’ అని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలిపింది.

కాగా ప్రధాని మోడీ శనివారం ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా ప్లాంట్‌ను సందర్శించనున్నట్లు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తెలిపారు. ఉదయం 9.30 గంటలకల్లా ప్రధాని అహ్మదాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని చంగోదార్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఈ ప్లాంట్‌కు ప్రధాని చేరుకుంటారని అధికారులు తెలిపారు. కాగా తాము తయారు చేస్తున్న జైకోవ్‌డి వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్ పూర్తయిందని, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ఆగస్టులో మొదలయ్యాయని జైడన్ క్యాడిలా కంపెనీ ఇదివరకే ప్రకటించింది. అహ్మదాబాద్ పర్యటన అనంతరం ప్రధాని వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్న మరో సంస్థ భారత్ బయోటెక్‌ను సందర్శించేందుకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. తొలుత మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ప్రధాని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దిగుతారని, అక్కడినుంచి 50 కిలోమీటర్లదూరంలోని జినోమ్ వ్యాలీకి వెళ్తారని అధికారులు తెలిపారు. ఇక్కడి భారత్ బయోటెక్ ల్యాబ్‌లో ప్రస్తుతం కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్రధాని మోడీ ఇక్కడ దాదాపు గంటసేపు గడుపుతారని, తర్వాత సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారని అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News