Sunday, April 28, 2024

అమ్మకానికి దేశం

- Advertisement -
- Advertisement -
muzaffarnagar Kisan Mahapanchayat
అడ్డుకునేందుకే రైతు ఉద్యమం : ముజఫర్‌నగర్ కిసాన్ మహా పంచాయత్ ర్యాలీలో రాకేశ్ టికాయత్
యుపి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని రైతులకు పిలుపు వ్యవసాయ చట్టాలు మూడింటినీ ఉపసంహరించేవరకు ఉద్యమం ఆగదని స్పష్టీకరణ 27న భారత్ బంద్‌కు పిలుపు

ముజఫర్‌నగర్: కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా సంయుక్త కిసాన్‌మోర్చా(ఎస్‌కెఎం) ఇచ్చిన పిలుపుతో కిసాన్ మహాపంచాయత్ ర్యాలీలో వేలాదిమంది రైతులు పాల్గొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఆదివారం ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 27న భారత్ బంద్‌కు ఎస్‌కెఎం పిలుపునిచ్చింది. ర్యాలీనుద్దేశిస్తూ భారతీయ కిసాన్ యూనియన్(బికెయు) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్‌టికాయత్ ప్రసంగించారు. దేశాన్ని అమ్ముకోవడమే కేంద్ర ప్రభుత్వ విధానమని టికాయత్ విమర్శించారు. దేశాన్ని అమ్మకానికి పెట్టకుండా అడ్డుకునేందుకే రైతు ఉద్యమమని ఆయన తెలిపారు. తమ ఉద్యమం వల్ల వ్యాపారులు, ఉద్యోగులు, యువతకు రక్షణ ఉంటుందన్నారు. రైతు సంఘాల ర్యాలీ లక్షం అదేనని టికాయత్ తెలిపారు.

2022లో జరిగే ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాల్సిందిగా రైతులకు టికాయత్ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీసహా బిజెపి నేతలను అల్లర్లు సృష్టించేవారిగా టికాయత్ ఆరోపించారు. మోడీ ప్రభుత్వం రైల్వేలు, విమానాశ్రయాలను అమ్మకానికి పెట్టిందని, విద్యుత్‌ను ప్రైవేటీకరిస్తున్నదని, రహదారులనూ అమ్మేస్తున్నదని ఆయన విమర్శించారు. ఎఫ్‌సిసి భూమిని అదానీకి ఇచ్చినట్టే బ్యాంకులనూ అమ్మకానికి పెట్టిందన్నారు. మోడీ ప్రభుత్వం ‘సేల్ ఆఫ్ ఇండియా’ బోర్డులు పెట్టిందన్నారు. కొనుగోలుదారులుగా అదానీ, అంబానీలను టికాయత్ పేర్కొన్నారు. 9 నెలల క్రితం ప్రారంభమైన రైతు ఉద్యమం కేంద్రం తెచ్చిన మూడు చట్టాలను ఉపసంహరించే వరకూ కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో దేశంలోని మరికొన్నిచోట్ల మహాపంచాయత్ ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

తొమ్మిది నెలలుగా తాము పోరాటం చేస్తున్నామని, కేంద్రం మాత్రం తమతో చర్చలు కూడా నిలిపివేసిందని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న సమయంలో వందలాది రైతులు చనిపోయినా కేంద్రం ఓ నిమిషం మౌనం కూడా పాటించలేదని టికాయత్ విమర్శించారు. మహాపంచాయత్ ర్యాలీకి ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటకతోపిటు 15 రాష్ట్రాల నుంచి 300 రైతు సంఘాల కార్యకర్తలు తరలివచ్చారని బికెయు మీడియా ఇంచార్జ్ ధర్మేంద్రమాలిక్ తెలిపారు. ర్యాలీకొచ్చిన రైతులతో ముజఫర్‌నగర్ రహదారులు, ఫ్లై ఓవర్లు కిక్కిరిసిపోయాయి. దాంతో, నగరంలో ట్రాఫిక్ జామైంది. మహిళలు కూడా జెండాలు పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. బస్సులు, కార్లు, ట్రాక్టర్లలో రైతులు తరలివచ్చారు. ర్యాలీలో పాల్గొన్న రైతులు తమ సంఘాలకు చెందిన పలు రంగుల టోపీలను ధరించారు.

అన్ని వర్గాల మద్దతు మాకుంది : ఎస్‌కెఎం

కేంద్రం తెచ్చిన మూడు చట్టాలకు నిరసనగా తామిచ్చిన పిలుపునకు అన్ని కులాలు,మతాలు, చిన్న వ్యాపారులు, సమాజంలోని అన్ని వర్గాలు మద్దతు తెలిపాయని ఎస్‌కెఎం ఓ ప్రకటనలో పేర్కొన్నది. మహాపంచాయత్ ర్యాలీతో యుపిలోని యోగి ప్రభుత్వం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి రైతులు, వ్యవసాయ కార్మికుల శక్తి ఏమిటో అర్థమవుతుందని ఎస్‌కెఎం ఆ ప్రకటనలో తెలిపింది. 9 నెలలుగా కొనసాగుతున్న తమ ఉద్యమంలో ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన మహాపంచాయత్ ఓ మైలురాయిగా నిలుస్తుందని ఎస్‌కెఎం ఆ ప్రకటనలో పేర్కొన్నది. కేంద్రం తెచ్చిన మూడు చట్టాలు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని, కార్పొరేట్ సంస్థలకు లాభాలు పండించేలా చట్టాలను రూపొందించారని రైతు సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. చట్టాలు పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే ఇప్పుడు ఉనికిలో ఉన్న కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) వ్యవస్థ మాయమవుతుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News