Tuesday, April 30, 2024

రాష్ట్రం హక్కులపై గళమెత్తుతాం, కేంద్రాన్ని నిలదీస్తాం

- Advertisement -
- Advertisement -

Nama Nageswara Rao press meet in New Delhi

మన తెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయపరమైన హక్కులపై తీవ్ర స్థాయిలో గళమెత్తుతామని టిఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వర్‌రావు తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన కదలిక వచ్చేంత వరకు ఉభయ సభల్లో తమ నిరసనలు కొనసాగుతాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. రాష్ట్ర విభజన జరిగి సుమారు ఏడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు పలు విభజన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదని ఆయన తీవ్ర అసంతృప్తి, అసహానం వ్యక్తం చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల వైపు దేశం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తోందన్నారు. ఈ నేపథ్యంలో దేశ సమస్యలపై సమగ్రంగా చర్చ జరగాలని తమ పార్టీ పక్షాన స్పీకర్‌ను కోరినట్లు నామ తెలిపారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సమావేశం నిర్వహించారు. ఈ భేటికి టిఆర్‌ఎస్ పార్టీ పక్షాన లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణకు నష్టం చేసే ఏ అంశాన్ని కూడా వదిలి పెట్టబోమన్నారు. రాష్ట్ర హక్కులు, రావాల్సిన నిధుల గురించి సభలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రానికి నష్టం కలిగించే అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.
ప్రధానంగా ఎపి పునర్విభజన చట్టంలో పరిష్కారం కాని అంశాలను త్వరగా పరిష్కరించాలని మరోసారి కేంద్రం దృష్టికి తీసుక రానున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూనే మరోవైపు కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలను కూడా నిలదీయనున్నామ న్నారు. ముఖ్యంగా ఇటీవల క్రమం తప్పుకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరానున్నామని ఆయన వెల్లడించారు. అలాగే దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై కూడా సమావేశాలలో చర్చ జరపాలని పట్టుబట్టనున్నామని తెలిపారు. అయితే ఉభయ సభల్లో మెజార్టీ ఉందన్న కారణంతో కేంద్రం ఒకే రోజున రెండు, మూడు బిల్లులను ఆమోదం చేసుకోవడం సరి కాదన్నారు.

అనేక ప్రజా సమస్యలపై కూలంకషంగా చర్చ జరగాలని కోరామన్నారు. 48 గంటల ముందే బిల్లులకు సంబంధించిన వివరాలు సభకు తెలపాలని కోరినట్లు నామ నాగేశ్వర్‌రావు తెలిపారు. 19 రోజుల్లో 29 బిల్లులు పార్లమెంటు ముందుకు తెస్తున్నారన్నారు. బిల్లులను ఆదరబాదరగా ఆమోదం చేయకుండా వాటిపై సమగ్రంగా చర్చజరగాలని తాము కోరామన్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న అంశాలపై కూడా చర్చ జరగాలని కోరామని నామ తెలిపారు. అలాగే దేశ, విదేశాలను వణికిస్తున్న కోవిడ్ మహమ్మారిపై కూడా లోతుగా చర్చ జరగాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.పోరాడి సాధించిన తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా వివిధ పథకాలతో ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా రైతుబంధు, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రంలో ఏడేళ్ల నుంచి జరుగుతున్న అభివృద్ధిని కేంద్రం ఆపాలని చూస్తే ఊరుకోమని ఈ సందర్భంగా నామ హెచ్చరించారు.

Nama Nageswara Rao press meet in New Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News