Tuesday, May 21, 2024

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు

- Advertisement -
- Advertisement -

రూ.752 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఇడి

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రూ.751.90 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వెల్లడించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్ట కింద అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియన్‌ప్రైవేట్ లిమిటెడ్‌కు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చినట్లు ఇడి తెలిపింది.ఇడి అటాచ్ చేసిన ఆస్తులలో ఢిల్లీ , ముంబయిలలోని నేషనల్ హెరాల్డ్ భవనాలు, లక్నోలోని నెహ్రూభవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్)ఢిల్లీ, ముంబయి, లక్నో నగరాల్లో రూ.661.59 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఇడి వెల్లడించింది.

దీంతో పాటుగా ఎజెఎల్‌లో ఈక్విటీషేర్ల రూపంలో యంగ్ ఇండియన్ లిమిటెడ్ రూ.90.21 కోట్లు కలిగి ఉందని తెలిపింది.‘ మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద దర్యాప్తు జరిపిన మనీ లాండరింగ్ కేసులో రూ.751.90 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయడానికి సంబంధించి ఇడి తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది’ అని ఇడి ఎక్స్‌లో ఉంచిన ఓ పోస్టులో తెలిపింది. మరో వైపు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటుగా ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్‌కుమార్ బన్సల్‌లను ఇదివరకే విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వారి స్టేట్‌మెంట్లను కూడా రికార్డు చేసింది.

అయితే మనీ లాండరింగ్ జరిగినట్లు కానీ, మానిటరీ ఎక్స్‌చేంజ్ జరిగినట్లు కానీ ఎలాంటి సాక్షాధారాలు లేవని కాంగ్రెస్ అంటోంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్( ఎజెఎల్) ప్రచురణకర్తగా ఉంది. సోనియా గాంధీ, రాహుల్, పలువురు కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ.యంగ్ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఇడి దర్యాప్తు చేస్తోంది.

కాంగ్రెస్‌కు ఎజెఎల్ బకాయిపడ్డ రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలంరూ.50లక్షలు చెల్లించడం ద్వారా సోనియా, రాహుల్ తదితరులు కుట్రపన్నినట్లు బిజెపి నేత సుబ్రమణ్యస్వామి 2003లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.కాగా ఆస్తుల అటాచ్ కక్ష సాధింపు మాత్రమేనని, ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమనే విషయంనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి జరిగిన విఫల యత్నమని ఇడి చర్య ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వి ఒక ఎక్స్ ట్వీట్‌లో దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News