Wednesday, April 24, 2024

బిజెపిపై పోరాటం: ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు మద్దతివ్వాలి

- Advertisement -
- Advertisement -

లక్నో: తమ తమ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీతో పోరాడుతున్న ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడిన అఖిలేశ్ కాంగ్రెస్ పార్టీనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్‌సభనుంచి అనర్హుడిగా ప్రకటించడంపై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ దీనిపై సత్యాగ్రహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తాను అభినందిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ ఆందోళనకు మీ పార్టీ మద్దతు ఇస్తుందా అని అడగ్గా.. రాహుల్ గాంధీ పట్ల సమాజ్‌వాది పార్టీ సానుభూతితో ఉందా అనేది ముఖ్యం కాదని, దేశ ప్రజాసామ్యం, రాజ్యాంగం మనగలుగుతాయా లేదా అనేది ముఖ్యమని ఆయన అన్నారు. ‘మేము ఏ పార్టీ పట్ల సానుభూతితో ఉండలేము’ అని ఆయన అన్నారు.

అంతేకాదు తమతమ రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు సహాయ, సహకారాలు అందించాలని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలు తమకుఏదైనా హాని చేశాయా అనే విషయాన్ని జాతీయ పార్టీలు మరిచిపోవాలి. ప్రాంతీయ పార్టీలకు హాని చేస్తున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలేనని అఖిలేశ్ అన్నారు. ఈరోజు సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఆదాయం పన్ను శాఖ ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తున్నాయి’ అని అన్నారు. ‘నేతాజీ( ములాయం), లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, స్టాలిన్, కెసిఆర్, ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ… ఇలా అందర్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు టార్గెట్ చేశాయి’ అని ఆయన అన్నారు.

విపక్షాల కూటమి గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కూటములను ఏర్పాటు చేయడం తమపని కాదని, కూటములకు సహకరించడం మాత్రమేనని అఖిలేశ్ స్పష్టం చేశారు. మతతత్వం గురించి అడగ్గా ‘ఎవరు మతతత్వ వాది అనేది ఇక్కడ ప్రశ్న కాదు. దేశంలోని విద్యావంతులైన వారు మతతత్వవాదులుగా మారిపోయి అబద్ధాన్ని నిజమని నమ్మడం ప్రారంభించినప్పుడు సమాజానికి అంతకన్నా పెద్ద ప్రమాదం మరేదీ ఉండదు. ఇప్పుడు మనం ఆ స్థితికి చేరుకున్నాం’ అని అఖిలేశ్ చెప్పారు. జూన్ 5 నాటికల్లా సమాజ్‌వాది పార్టీకి యుపిలోని ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక కేడర్ ఉంటుందని, 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపితో పార్టీ గట్టిగా పోరాడుతుందని ఎస్‌పి అధినేత చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News