Friday, May 10, 2024

గుప్టిల్ మెరుపులు

- Advertisement -
- Advertisement -

New Zealand won match by 16 runs against Scotland

కివీస్‌కు రెండో గెలుపు

దుబాయి: టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బుధవారం గ్రూప్2లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 16 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది.

ఈ టోర్నీలో స్కాట్లాండ్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ ఆరంభంలో బాగానే ఆడింది. ఓపెనర్ కైల్ కొయెట్జర్ 11 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే తర్వాత వచ్చిన వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్‌తో కలిసి మరో ఓపెనర్ జార్జ్ మున్సె స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. మున్సె రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 22 పరుగులు చేశాడు. ఇక క్రాస్ ఐదు బౌండరీలతో 27 పరుగులు సాధించాడు. చివర్లో మైఖేల్ లీస్క్ దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచినా ఫలితం లేకుండా పోయింది. ధాటిగా ఆడిన లీస్క్ మూడు సిక్సర్లు, మరో 3 బౌండరీలతో అజేయంగా 42 పరుగులు చేశాడు.

గుప్టిల్ విధ్వంసం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ను ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ ఆదుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌ను కనబరిచిన గుప్టిల్ 56 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో ఆరు బౌండరీలతో 93 పరుగులు చేశాడు. ఫిలిప్స్ (33) అతనికి అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. దీంతో కివీస్ మెరుగైన స్కోరును సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News