Monday, June 17, 2024

అమిత్ షాను వారసుడిగా ప్రకటించనున్న మోడీ

- Advertisement -
- Advertisement -

అధికార బిజెపిలో వారసత్వ పోరు జరుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆరోపించారు. తన వారసుడిగా బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ప్రధాని నరేంద్ర మోడీ బాటలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇండియా టుడే టివికి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వూలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..75 సంవత్సరాలు, అంతకుపైబడిన పార్టీలోని నాయకులందరినీ రిటైర్ చేస్తున్నామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని అమిత్ షా 2019లో తానే స్వయంగా చేసిన ప్రకటనను ఇంటర్‌నెట్‌లో మీరు చూడవచ్చు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిబంధనను తానే అమలు చేశారు. యువతరానికి అవకాశం రావాలని కూడా ఆయన చెప్పారు. 75 ఏళ్లు వచ్చిన తర్వాత పార్టీలో(బిజెపి), ప్రభుత్వంలో ఎవరికీ ఎటువంటి బాధ్యతలు ఇవ్వమని మోడీ చెప్పారు. ఆ నిబంధన ప్రకారమే ఎల్‌కె అద్వానీ రిటైర్ అయ్యారు.

మురళీ మనోహర్ జోషి రిటైర్ అయ్యారు. సుమిత్రా మహాజన్‌ను రాజీనామా చేయించి మరీ రిటైర్ చేశారు. అందువల్ల ఈ నిబంధనను వీళ్లు కూడా పాటించి తీరతారు అని కేజ్రీవాల్ తెలిపారు. బిజెపిలో నీచమైన వారసత్వ పోరు జరుగుతోందని ఆప్ అధినేత ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకులు అందరినీ ఒకరి తర్వాత మరొకరిని తప్పించారని కేజ్రీవాల్ ఆరోపించారు. శివరాజ్ సింగ్ చౌహన్‌ను తప్పించారు. వసుంధర రాజెను తప్పించారు. ఖట్టార్‌ను, రమణ్ సింగ్‌ను తప్పించారు. యోగి ఆదిత్యనాథ్ ఇంకా మిగిలి ఉన్నారు..ఆయనను కూడా తప్పిస్తారన్న వదంతులు వినపడుతున్నాయి అని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ 2025 సెప్టెంబర్ 17న తన 75వ జన్మదినం నాడు తన వారసుడిగా అమిత్ షాను ప్రకటిస్తారని కేజ్రీవాల్ ఆరోపించారు. కాగా..కేజ్రీవాల్ ఆరోపణలను బిజెపి ఖండించింది. తన వారసుడిగా అమిత్ షాను ప్రధాని మోడీ ప్రకటిస్తారన్న కేజ్రీవాల్ ఆరోపణను బిజెపి తోసిపుచ్చింది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఐదేళ్ల పూర్తి కాలం తానే పదవిలో ఉంటారని బిజెపి స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News