Sunday, April 28, 2024

నిఠారీ వరుస హత్యల కేసు.. మరణశిక్ష పడిన ఆ ఇద్దరూ నిర్దోషులే…!

- Advertisement -
- Advertisement -

అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

ప్రయాగ్‌రాజ్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2005 06 నిఠారీ వరుస హత్యల కేసులో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లో దోషులుగా తేలి మరణశిక్ష ఎదుర్కొంటున్న సురేందర్ కోలీ, మానిందర్ సింగ్ పంధేర్‌ను నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్షాలు లేని కారణంగానే వారిని నిర్దోషులుగా పరిగణిస్తున్నట్టు కోర్టు తెలిపింది. దీంతో ఈ కేసుల్లో వారి మరణశిక్ష రద్దయినట్టయింది.

కేసు పూర్వాపరాలు

నోయిడా లోని నిఠారీ గ్రామంలో 2005 నుంచి 2006 మధ్య ఈ వరుస హత్యలు చోటు చేసుకున్నాయి. 2006 డిసెంబరులో స్థానిక వ్యాపారవేత్త మానిందర్ సింగ్ పంధేర్ ఇంటి సమీపం లోని ఓ మురికి కాలువలో కొన్ని మానవ అవశేషాలు కన్పించాయి. ఆ శరీర భాగాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. అనంతరం దర్యాప్తు చేపట్టగా ఈ వరుస హత్యలు వెలుగు లోకి వచ్చాయి. దర్యాప్తులో పందేర్ ఇంటివెనుక పెరట్లో అనేక మంది చిన్నారులు, యువతుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇవన్నీర ఆ ప్రాంతంలో ఏడాదిగా కనిపించకుండా పోయిన పేద చిన్నారులు, యువతులవేనని పోలీస్‌లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టగా, ఒళ్లుగగుర్పొడిచే విషయాలు వెలుగు లోకి వచ్చాయి. పంధేర్ ఇంట్లో పనిచేసే సురేందర్ కోలీ… చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి పిలిచేవాడని దర్యాప్తులో తేలింది. అనంతరం వారిని హత్య చేసి , మృతదేహాలపై లైంగిక దాడి చేశారని ప్రాథమికంగా నిర్ధారణ అయింది.

ఆ తర్వాత శరీర భాగాలను ఇంటివెనుక భాగంలో విసిరేశారని సిబిఐ ఆరోపించింది. వీరు నరమాంస భక్షకులనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో .. పంధేర్, సురేందర్ కోలీపై మొత్తం 19 కేసులు నమోదు చేశారు. సరైన సాక్షాధారాలు లేని కారణంగా వీటిలో మూడింటిని మూసివేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. వీటిల్లోని కొన్ని కేసుల్లో సురేందర్ కోలీని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. మరోవైపు పంధేర్ కొన్ని కేసుల్లో నిర్దోషిగా బయటపడగా, రెండు కేసుల్లో దోషిగా తేలడంతో అతడికి ఉరిశిక్ష విధించింది.

అయితే , 12 కేసుల్లో తనకు పడిన మరణశిక్షను సవాల్ చేస్తూ కోలీ, రెండు కేసుల్లో తనకు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ పంధేర్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం, సోమవారం తీర్పు వెలువరించింది. ఈ 14 కేసుల్లో వీరిద్దరికీ వ్యతిరేకంగా ప్రత్యక్ష సాక్షులు, సరైన ఆధారాలు లేని కారణంగా వీరిని నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో ఈ కేసుల్లో వారి మరణ శిక్ష రద్దయినట్లైంది. ఇదిలా ఉండగా నిఠారీ హత్యలకు సంబంధించి మరో కేసులో సురేందర్ కోలీ మరణశిక్షను గతంలో అలహాబాద్ హైకోర్టు సమర్ధించింది. ఇంకో కేసులో అతడి ఉరిశిక్షను జీవితఖైదుకు తగ్గించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News