Monday, April 29, 2024

30 మంది జాబితా సిద్ధం… మరో 87 మంది జాబితా త్వరలోనే

- Advertisement -
- Advertisement -

మరో దఫా చంద్రబాబును బుధవారం  కలిశాకే అభ్యర్థుల ప్రకటన
టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడి
తమపై వదంతులను నమ్మవద్దని హితవు

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో టి టిడిపి తప్పకుండా పోటీ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. 30 మంది అభ్యర్థుల జాబితా ఇప్పటికే సిద్ధం చేశామని, మరో 87 మంది అభ్యర్థుల వడపోత చేసి ఖరారు చేసుకుంటామని ఆయన తెలిపారు. ఈ జాబితాను బుధవారం అధినేత చంద్రబాబు నాయుడు ఓకే అన్నాకే ప్రకటిస్తామని, అదే రోజు టి టిడిపి మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. కాగా ఇతర పార్టీల వారు టిడిపిలోకి రావాలని చూస్తున్నారని వీరిని ఆపాలనే దురుద్దేశంతో ఆయా పార్టీలు టి టిడిపిపై తప్పుడు వదంతులు సృష్టించి తమ పార్టీని బదనాం చేయాలని చూస్తున్నాయన్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తమకంటే బలంగా ఉందని తాము అనుకోవడమే లేదన్నారు. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును శనివారం రోజు తాను కలిశానని, మరో సారి బుధవారం నాడు కలువమన్నారని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. సోషల్ మీడియాలోనూ, యూ ట్యూబ్ లోను వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు ఆయన సోమవారం ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ పార్టీ కాంగ్రెస్‌కు ఓట్లేస్తుందని వారికి పరోక్షంగా మద్దతిస్తామని, అసలు ఎన్నికల్లో నిలబడమని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా తనతో మాట్లాడి వార్తలు రాయాలన్నారు. అంతే తప్ప వారు చెప్పారు..వీరు చెప్పారంటూ తమ పార్టీని కోడ్ చేసి వార్తలు రాయడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో నిలబడితే వారికి పుట్టగతులు ఉండవని ఈ రకంగా కొన్ని పార్టీలు వదంతులు సృష్టిస్తున్నాయని కాసాని మండిపడ్డారు.
జనసేనతో పొత్తు విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు కాసాని జ్ఞానేశ్వర్ స్పందిస్తూ ఇప్పటికే ఏపిలో ఆ పార్టీతో పొత్తుపై క్లారిటీ వచ్చిందని, తెలంగాణలోనూ ఆ పార్టీతో పొత్తుపై జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుదే తుది నిర్ణయం అన్నారు. ఎవరెన్ని రకాల వదంతులు పుట్టించినా తమ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, గెలుపొందడం కూడా పక్కా అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇతరులకు ధీటుగా మా మేనిఫెస్టో …
కాగా టి టిడిపి మేనిఫెస్టో ఇతర పార్టీలకు ధీటుగా ఉంటుందని టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాల అవసరాలను తీర్చేలా తమ మేనిఫెస్టో రూపుదిద్దుకుంటోందన్నారు. ఇప్పటికే బిసిలకు పెద్ద పీట వేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీకి పేరుందని, దానిని నిలబెట్టుకుంటామని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. బుధవారం నాడు తమ అభ్యర్థుల జాబితాను చంద్రబాబు నాయుడు ముందు ఉంచుతామని, ఆయన ఫైనల్ చేశాక అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామన్నారు. అదే రోజున మేనిఫెస్టోను కూడా చంద్రబాబు ఆదేశంతో విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, ప్రధాన కార్యదర్శి ఆజ్మీరా రాజు నాయక్, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు పి. సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News