Friday, May 3, 2024

సంపాదకీయం: సరికొత్త పాత పాత్రలో నితీశ్

- Advertisement -
- Advertisement -

On the border Pakistani army opened fire on India territory బీహార్‌లో బిజెపి మాట తప్పలేదు. నితీశ్ కుమార్‌నే మళ్లీ ఎన్‌డిఎ ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన వరుసగా నాలుగోసారి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. అయితే ఈసారి ఆయనకు దక్కిన కిరీటం గతంలో ధరించిన వాటికి పూర్తిగా భిన్నమైనది. చిన్న తలకాయకు అతికించిన పెద్ద మకుటం ఇది. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో కేవలం 43 మంది సొంత బలంతో ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించడం మామూలు విషయం కాదు. 74 మంది సభ్యులున్న బిజెపి, చెరి నాలుగు స్థానాలున్న వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి), హిందూస్థానీ అవామీ మోర్చా (సెక్యులర్) (హెచ్‌ఎఎం) పార్టీల అండదండలపై ఆధారపడి పరిపాలన సాగించవలసి వస్తుంది. కూటమిలో అతి పెద్ద పార్టీగా ఉండి ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన నితీశ్ గత పాత్రకు, అందులో రెండవ స్థానంలో ఉండి సిఎం పీఠాన్ని అధిరోహించిన ఇప్పటి పాత్రకు చాలా తేడా ఉంటుంది. బిజెపి జెడి(యు)ల ఎన్‌డిఎ కూటమికి ఆర్‌జెడి నాయకత్వంలోని మహా కూటమి కంటే 15 స్థానాల ఆధిక్యత మాత్రమే లభించింది. అసెంబ్లీలో సాధారణ మెజారిటీ సంఖ్య 122 కంటే కేవలం 3 స్థానాలే ఎక్కువగా లభించాయి.

చిన్న పార్టీలైన విఐపి, హెచ్‌ఎఎంలు మద్దతు ఉపసంహరించుకున్నా మైనారిటీలోకి పడిపోయే ముప్పు నితీశ్ ప్రభుత్వాన్ని నిత్యం వెన్నాడుతుంటుంది. అందుచేత నితీశ్ ప్రభుత్వాన్ని ఈసారి కాపాడగలిగేది కేంద్రంలో అధికార దండం ధరించిన బిజెపి మాత్రమే. అదే సమయంలో ఆయనను కాదని బీహార్‌లో తనకు తానుగా అధికారం కైవసం చేసుకోడం భారతీయ జనతా పార్టీకి కూడా సులభ సాధ్యం కాదు. అందుకే నితీశ్‌ను ముందుంచి తన వ్యూహాన్ని అమలు పరచుకునే మార్గాన్ని బిజెపి ఎంచుకున్నది. అయితే ఈ పాత్రను అది ఎలా పోషిస్తుందనేదాన్ని బట్టి భావి రాజకీయాలు ఉంటాయి. బిజెపి తన మతతత్వ ఎజెండాను ఎటువంటి రాజీకి ఆస్కారమివ్వకుండా బీహార్‌లో అమలు చేయదలిస్తే నితీశ్‌తో కూడా దానికి ఘర్షణ తప్పకపోవచ్చు. ఆయన వెనుక అత్యధిక వెనుకబడిన తరగతుల, మహాదళితుల ఓట్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ వర్గాలకు అసంతృప్తి కలిగించే నిర్ణయాల వైపు తనపై బిజెపి ఒత్తిడి తెస్తే నితీశ్ ఎదురు తిరగొచ్చు. 2015 ఎన్నికల తర్వాత ఆర్‌జెడితో కలిసి మహాకూటమిలో భాగస్వామిగా ఉంటూ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నితీశ్ కుమార్ ఆ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను భరించలేకపోతున్నానని చెప్పి ఎన్‌డిఎలోకి ఫిరాయించారు.

ఇప్పుడు బిజెపితో కుదరకపోతే ఆయన అదే మాదిరిగా మళ్లీ కూటమిని మారుస్తారా? కేంద్రంలో బిజెపి పటిష్ఠంగా వేళ్లూనుకున్నది కాబట్టి అందుకు ఆయన సాహసించకపోవచ్చు. కాని కమలనాథుల వెంట నడిచే డూడూ బసవన్న కావడానికి నితీశ్ ఎంత వరకు సిద్ధపడతారనేది కీలకమైన అంశం. ఈసారి మంత్రి వర్గ నిర్మాణంలో నితీశ్‌కు తగినంత స్వేచ్ఛ లభించలేదనేది సుస్పష్టం. చాలా వరకు బిజెపి అభీష్టం మేరకే జరిగిందని తెలుస్తున్నది. క్లిష్ట సమయాల్లో అసెంబ్లీలో బలాబలాలపై ప్రభావం చూపగల స్పీకర్ పదవిని బిజెపి తన వద్దనే ఉంచుకున్నది. తన పార్టీ వ్యక్తినే ఆ పదవిలో కూర్చోబెట్టింది. గత అసెంబ్లీలో ఈ పదవి జెడి(యు) వద్ద ఉంది. నితీశ్‌కు అత్యంత అనుకూలుడనిపించుకున్న బిజెపికి చెందిన సుశీల్ మోడీని తిరిగి ఉప ముఖ్యమంత్రిని చేయకుండా జాగ్రత్తపడిన తీరులోనే కమలనాథుల పథకం బోధపడుతున్నది. ఈసారి రెండు ఉప ముఖ్యమంత్రి పదవులను సృష్టించి ఆ రెండింటిలోనూ బిజెపి తన వారినే నియమించింది.

వారిలో ఒకరికి ఆర్థిక మంత్రి పదవి లభించింది. బహుశా నితీశ్‌ని మరింత అసంతృప్తికి గురి చేయరాదని భావించి హోం మంత్రి పదవిని ఆయనకు వదిలేసింది. ఉప ముఖ్యమంత్రులిద్దరూ ఆ పదవులకు కొత్త వారు కాబట్టి ఢిల్లీ కనుసన్నల్లోనే పని చేస్తారని భావించవచ్చు. మంత్రి వర్గానికి తలకాయ నితీశ్ కుమారే అయినా తలవాటా బిజెపిదే. మధ్యప్రదేశ్‌లో మాదిరిగా జెడి(యు) నుంచో, ప్రతిపక్షం నుంచో ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా సంపూర్ణాధికారాన్ని చేజిక్కించుకునే దుస్తంత్రానికి బీహార్‌లో బిజెపి సాహసించకపోడానికే అవకాశాలు ఎక్కువ. అక్కడ ఓటు స్పష్టంగా సామాజిక చీలికకు గురై ఉంది. ఆర్‌జెడి నాయకత్వంలోని మహా కూటమి సీట్లపరంగా బలహీనపడి అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయినప్పటికీ అది ఇతర అన్ని పార్టీల కంటే అధిక ఓట్లు సాధించుకున్నది. రెండు కూటములు చెరి 37 శాతం ఓట్లు పొందడం గమనించవలసిన విషయం. అందుచేత నితీశ్ కుమార్ నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్‌డిఎ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరినీ కలుపుకుకొనిపోయే పరిపాలనను అందించవలసి ఉంటుంది. ఏ మాత్రం అశ్రద్ధ వహించి స్వవర్గ పక్షపాతానికి అవతలి వారిపై కక్ష తీర్చుకోడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో నామరూపాల్లేకుండాపోయే ప్రమాదం పెరుగుతుంది. అదే సమయంలో బీహార్ రాష్ట్ర అభివృద్ధి, యువత వికాసమూ దెబ్బతింటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News