Tuesday, April 30, 2024

ఈ ఎన్నికల్లో మోడీ వేవ్ లేదు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్, దాని 5 గ్యారంటీలపై జనం మొగ్గు
కర్నాటక సిఎం సిద్ధరామయ్య

బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ‘మోడీ వేవ్’ లేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్‌కు, దానిఐదు గ్యారంటీలకు అనుకూలంగా ప్రజల్లో ఉత్సాహం కానవస్తున్నదని ఆయన తెలిపారు. బెంగళూరు నగర మంచినీటి సమస్యల పరిష్కారం, మేకేదాతు ప్రాజెక్టు అమలు కోసం బిజెపి అభ్యర్థి, ఎంపి తేజస్వి సూర్యను ఓడించవలసిందిగా బెంగళూరు సౌత్ పార్లమెంటరీ నియోజకవర్గం వోటర్లకు సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. కర్నాటక ప్రతిపాదించిన బహుళార్థ సాధక (మంచినీటి, విద్యుత్) ప్రాజెక్టు మేకేదాతు.

ఈ ప్రాజెక్టు కింద రామనగర జిల్లాలో కనకపుర సమీపాన ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించవలసి ఉంటుంది. కాంగ్రెస్, దాని ఐదు గ్యారంటీ పథకాల పట్ల జనంలో మొగ్గు కనిపిస్తోందని, ప్రధాని నరేంద్ర మోడీకీ అనుకూలంగా గాలి వీచడం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. ‘వారి (బిజెపి) అభ్యర్థులు చాలా మంది తమ మొహం చూపించలేరు. వారు మోడీపై ఆధారపడి ఉన్నారు. మోడీ పేరిట తమకు వోట్లు వస్తాయని వారి భావన. అయితే, ఈ సారి నరేంద్ర మోడీ అంశం పని చేయదు. పది సంవత్సరాల పాటు ప్రధానిగా మోడీ అన్ని రంగాల్లో విఫలం అయ్యారు’ అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మాత్రమే సమాజంలోని అన్ని వర్గాల కోసం పాటుపడగలదని ఆయన చెప్పారు.

బెంగళూరు సౌత్ స్థానంలో మాజీ ఎంఎల్‌ఎ సౌమ్యా రెడ్డికి వోటు వేయవలసిందిగా ప్రజలకు సిద్ధరామయ్య విజ్ఞప్తి చేస్తూ, వోట్లు అడిగేందుకు సూర్యకు, ఇతర బిజెపి ఎంపిలకు నైతిక హక్కు లేదని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ‘అన్యాయాలపై’ వారు ఎన్నడూ మాట్లాడలేదని ఆయన ఆరోపించారు. ‘బెంగళూఉ మంచినీటి కొరత ఎదుర్కొంటున్నది. నగర నీటి అవసరాల్లో 60 శాతం మాత్రమే కావేరి నుంచి తీరుతున్నాయి.

తక్కిన 40 శాతం బోర్‌బావి నుంచి నీళ్లు వస్తున్నాయి. నగర చుట్టుపక్కల గల 110 గ్రామాలకు నీటి సరఫరాకు, శాశ్వత పరిష్కారం సాధనకు మేముకావేరి ఐదవ దశ ప్రాజెక్టును అమలు చేస్తున్నాం.అది అమలైతే పరిస్థితి మెరుగవుతుంది’ అని సిద్ధరామయ్యపేర్కొన్నారు. అయితే, మేకేదాతు ప్రాజెక్టుకు పొరుగున ఉన్న తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. అది అమలైతే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తమిళనాడు భయపడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News