Sunday, April 28, 2024

విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు

- Advertisement -
- Advertisement -

Online lessons

 

హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తమైన పాఠశాలలు ఆన్‌లైన్ పాఠాలను ఎంచుకుని అమలు చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు వాట్సాప్ ద్వారా, మరికొన్ని పాఠశాలలు యూట్యూబ్ ద్వారా ఆన్‌లైన్‌లో పిల్లలకు పాఠాలు బోధిస్తూ విద్యార్థులకు అసైన్‌మెంట్లు కూడా ఇస్తున్నారు. పిల్లలు .. టీచర్లు ఇంట్లోనే ఉంటూ రోజుకో కొంత విజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. టీచర్ ఇంట్లోనే ఉంటారు. వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని అటు పాఠశాల, ఇటు పిల్లల తల్లిదండ్రులతో అనుసంధానం చేసుకుంటున్నారు. ప్రతిరోజూ పిల్లల తల్లిదండ్రుల వాట్సాప్‌కు ఒక వర్క్‌షీట్‌కు పంపిస్తున్నారు. నిర్దిష్ట వ్యవధిలో దీనిని పిల్లలు పరిష్కరించాలి. పిల్లలు రాసిన సమాధాన పత్రాలను తల్లిదండ్రులు ఇమేజ్ రూపంలో తిరిగి టీచర్‌కుగానీ, గ్రూప్‌లోగానీ పంపించాలి. టీచర్లు మూల్యాంకనం చేసి మరలా తల్లిదండ్రులకు పంపిస్తారు.

తరగతిలోని మొత్తం టీచర్లలో ఎవరో ఒక టీచర్ పిల్లలకు ఫోన్‌చేసి మాట్లాడతారు. ఇలా పిల్లలందరితో మాట్లాడతారు. వారు పూర్తిచేసిన వర్క్‌షీట్‌లోని తప్పొప్పులను వారితో చర్చిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజూ పిల్లలకు రీడింగ్ రివిజన్ టార్గెట్స్ నిస్తున్నారు. కేవలం పాఠ్యపుస్తకాల్లోని అంశాలేకాకుండా జనరల్ బుక్స్, స్టోరీ చదివించడం లాంటివి చేస్తున్నారు. అంతేకాకుండా వారు చదివారా లేదా అన్నది సైతం పర్యవేక్షణ జరుపుతున్నారు. వారు చదివిన బుక్, స్టోరీ అంశాన్ని క్లుప్తంగా రాసి పంపమని సూచిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ చేస్తున్నట్లుగా టీచర్లు చెబుతున్నారు. ఉన్నత తరగుతులకు సంబంధించిన పాఠాలను, ఉపాధ్యాయులు వీడియోలుగా చిత్రీకరించి, తల్లిదండ్రులకు పంపించడం, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి లింక్ పంపడం చేస్తున్నారు.

పిల్లలు చెడుమార్గాలు పట్టకుండా జాగ్రత్త
ఇంట్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఉంటే సాధారణంగా పిల్లలు రెండు మూడు రోజులపాటు పాఠశాలకు సెలవులు పెడతారు. ఆ తర్వాత స్కూల్‌కు వెళ్లమంటే మారాం చేస్తూ ఉంటారు. అలాంటిది అనుకోకుండా రోజుల తరబడి సెలవులు వస్తే గందరగోళమే. టివిలు, స్మార్ట్‌ఫోన్లు, వీడియోగేమ్‌లతో ఎంతో ప్రమాదం పొంచి ఉంటుంది. తాజా వరుస సెలవుల నేపథ్యంలో పిల్లలను గాడిన పెట్టడమంటే కత్తిమీద సవాలే. కరోనా ఆకస్మిక సెలవుల నేపథ్యంలో అప్రమత్తమైన పాఠశాలలు పిల్లలు చెడుమార్గాలు పట్టకుండా జాగ్రత్తపడుతున్నాయి. ఆన్‌లైన్ పాఠాలను ఎంచుకుని పిల్లలకు పాఠ్యాంశాలతో పాటు కొత్త విషయాలను కూడా నేర్పిస్తున్నాయి. ఈ సారి ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు చదువు పట్ల ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పాఠశాలలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.

వాట్సాప్ ద్వారా పది విద్యార్థుల సందేహాల నివృత్తి
పదవ తరగతి పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటివరకు జరిపిన ప్రిపరేషన్ వృథా కాకుండా పాఠశాలలు జాగ్రత్త పడుతున్నాయి. పదవ తరగతికి సంబంధించిన పరీక్షల రీ షెడ్యూల్ వెలువడేంత వరకు విద్యార్థులు నిరంతరం ప్రిపరేషన్ కొనసాగేలా విద్యార్థులను సమాయత్తం చేస్తున్నారు. ప్రస్తుత పోటీ నేపథ్యంలో పది పరీక్షల్లో తమ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరచాలని పాఠశాలలు సహజంగా కోరుకుంటాయి. ఈ నేపథ్యంలో సంబంధిత టీచర్లు ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు మార్గనిర్ధేశం చేస్తూ వారి సందేహాలను కూడా వాట్సాప్,ఫోన్ల ద్వారా నివృత్తి చేస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో విద్యార్థులు దృష్టి మరలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యార్థులు, టీచర్లూ ఇంట్లో ఉంటూనే అందుబాటులో ఉన్న టెక్నాలజిని అందిపుచ్చుకుంటూ పరీక్షలకు సంసిద్దమవుతున్నారు.

Online lessons for students
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News