Sunday, April 28, 2024

మాస్కోలోని భారత ఎంబసీలో పాక్ గూఢచారి

- Advertisement -
- Advertisement -

లక్నో : మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో నియుక్తుడైన పాకిస్తానీ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్‌ఐ) గూఢచారి సత్యేంద్ర సివాల్‌ను ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) అరెస్టు చేసింది. సత్యేంద్ర సివాల్ 2021 నుంచి రాయబార కార్యాలయంలో పని చేస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ స్వస్థలమైన సత్యేంద్ర సివాల్ విదేశాంగ మంత్రిత్వశాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటిఎస్)గా పని చేస్తున్నాడు. మాస్కోలో భారత రాయబార కార్యాలయంలో ఒక వేగు పని చేస్తున్నాడని తమ వర్గాల నుంచి ఎటిఎస్‌కు ఒక సమాచారం అందినట్లు అధికార ప్రకటన వెల్లడించింది. ఆ సమాచారం ఆధారంగా యుపి ఎటిఎస్ సత్యేంద్రను ప్రశ్నించింది. కానీ అతని సమాధానాలు సంతృప్తికరంగా లేవు.

అయితే, ఆ తరువాత తన గూఢచర్యం సాగిస్తున్నట్లు అంగీకరించాడు. అతనిని మీరట్‌లో అరెస్టు చేశారు. భారత సైన్యం గురించి, దాని దైనందిన కార్యకలాపాల గురించి సమాచారం రాబట్టేందుకు భారత ప్రభుత్వ అధికారులకు డబ్బు ఎర వేసినట్లు సత్యేంద్ర విచారణ సమయంలో వెల్లడించాడు. భారత రాయబార కార్యాలయం, రక్షణ మంత్రిత్వశాఖ, విదేశాంగ మంత్రిత్వశాఖ గురించిన కీలకమైన, రహస్య సమాచారాన్ని ఐఎస్‌ఐ అధికారులకు అతను అందజేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. సత్యేంద్ర అరెస్టు గురించి విదేశాంగ మంత్రిత్వశాఖకు తెలుసునని, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న అధికారులతో కలసి మంత్రిత్వశాఖ ముందుకు సాగుతున్నదని అధికార వర్గాలు చెప్పాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News