హైదరాబాద్: కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వరుసగా వ్యాఖ్యలు చేయడంపై పిసిసి క్రమశిక్షణ కమిటీ సిరీయస్ అయ్యింది. ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉన్నాయని భావించిన కమిటి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డిని కమిటి వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కమిటి ఛైర్మన్ మల్లు రవి, రాజగోపాల్‌రెడ్డితో మాట్లాడనున్నట్లు సమాచారం.
కాగా, సిఎం రేవంత్ రెడ్డి పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఎలా అంటారని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని.. చాలా హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ప్రశ్నిస్తున్నారని.. దీంతో వారికి ఏం సమాధానం చెప్పలేకపోతున్నామని అన్నారు. ఇక, తనకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారన్నారు. పదవి ఇవ్వడం.. ఇవ్వకపోవడం అనేది అధిష్టానం ఇష్టమని చెప్పారు. కానీ, తనకు మంత్రి పదవి వస్తే.. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. మునుగోడు ప్రజల కోసం ఏం చేయడానికికైన తాను సిద్ధమని.. అవసరమైతే రాజీనామాకు కూడా తను వెనకాడనని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నాడు.