Monday, December 2, 2024

హిందీ మహావిద్యాలయ గుర్తింపు రద్దు

- Advertisement -
- Advertisement -

పాస్ అయిన వారు ఫెయిలైనట్లు, ఫెయిల్ అయిన
వారు పాసైనట్లు జాబితా గుర్తించిన ఉస్మానియా
విశ్వవిద్యాలయం కమిటీ మహా విద్యాలయ
అనుబంధ గుర్తింపును రద్దు చేస్తూ వర్శిటీ సంచలన
నిర్ణయం వచ్చే సంవత్సరం నుంచి నో యుజి
అడ్మిషన్స్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని
యుజిసికి సిఫారసు యూనివర్శిటీ, యుజి
నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేన్న
ఒయు వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల విద్యా ధృవీకర ణ పత్రాలను పోర్జరీ చేసిన ఓ కళాశాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం కఠిన చర్యలకు దిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తీర్ణులైన విద్యార్థులను ఫెయిలైనట్లుగా, ఫెయిలైన విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తప్పుడు సమాచారాన్ని అందించిన హిం దీ మహావిద్యాలయ అనుబంధ గుర్తింపును రద్దు చేస్తూ ఒయు సంచలన నిర్ణయం తీ సుకుంది. 2019 -2022వ విద్యాసంవత్సరానికి సంబంధించి యుజి ఆరో సెమిస్ట ర్ పరీక్షల్లో ఫెయిలైన 49 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లుగా, ఉత్తీర్ణులైన ఐదుగురు విద్యార్థులు ఫెయిలైనట్లుగా తారుమారు చేసిన జాబితాను ఒయు పరీక్షల నియంత్రణ కార్యాలయానికి హిందీ మహావిద్యాలయ సమర్పించింది. సదరు విద్యాసంస్థ టిఆర్(ట్యాబులేషన్ రికార్డ్) రికార్డులపై అనుమానం రావటంతో…ఒయు అధికార యంత్రాంగం సమగ్ర విచారణకు ఆదేశించింది. మూడు దఫాలుగా హిందీ మహావిద్యాలయ విద్యాసంస్థను సందర్శించిన కమిటీ విస్తుపోయే అంశాలను గుర్తించింది.

మార్కుల జాబితాలన్నీ ఫోర్జరీ చేసినట్లుగా కమిటీ గుర్తింపు
స్వయంప్రతిపత్తి కలిగిన హిందీ మాహావిద్యాలయ స్వయంగా పరీక్షల నిర్వహణ, జవాబుపత్రాల మూల్యాంకనం తమ అధ్యాపకులతోనే నిర్వహిస్తోంది. ఇదే అదనుగా అక్రమాలకు పాల్పడ్డట్టు కమిటీ గుర్తించింది. కమిటీ విచారణలో కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు కామర్స్ సమాధాన పత్రాలను దిద్దినట్లుట్లుగా తేలింది. విద్యార్థుల మార్కుల జాబితాలన్నీ ఫోర్జరీ చేసినట్లుగా కమిటీ గుర్తించింది. పరీక్ష పత్రాలు, మూల్యాంకనం, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కళాశాల యాజమాన్యం కమిటీకి సమర్పించకపోవటం గమనార్హం. యూనివర్సిటీ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కిన కళాశాల నిర్లక్ష్యంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిందిగా కమిటీ అభిప్రాయపడింది. మరో దఫా కళాశాలను సందర్శించిన ఒయు విచారణ కమిటీ యుజి 2023 24 బ్యాచ్ టీఆర్ రికార్డుల్లో ప్రిన్సిపల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకాలు, స్టాంపులు లేనట్లు గుర్తించింది. దీంతో… యూనివర్సిటీ తుది నిర్ణయం తీసుకునేంత వరకు కళాశాల స్వయం ప్రతిపత్తిని అబయన్స్‌లో పెట్టాలని కమిటీ సిఫార్సు చేసింది.

తుది నిర్ణయం కోసం వేసిన మరో కమిటీ సైతం అక్టోబర్ 4న సమగ్ర విచారణ చేపట్టింది. యూనివర్సిటీకి సమర్పించిన 2022 యుజి 6వ సెమిస్టర్ ఫలితాలు తప్పు అని, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని తేల్చారు. హీందీ మాహా విద్యాలయ యాజమాన్యం.. 13 మంది బి.కాం, 27 మంది బిఎస్‌సి, 9 మంది బిబిఎ విద్యార్థులు పాసైనట్లుగా యూనివర్సిటీకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లు తేలింది. నలుగురు బి.కాం, ఒక బిబిఎ విద్యార్థి ఉత్తీర్ణులైనప్పటికీ ఫెయిలైనట్లుగా రికార్డులు తారుమారు చేశారు. ఈ విషయమై వివరణ ఇచ్చిన కళాశాల యాజమాన్యం తమ పరీక్షల విభాగం రికార్టుల్లో పొరపాట్లు జరిగినట్లు స్వయంగా ఒప్పుకుంది. అయినప్పటికీ తప్పు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం ఈ విషయమై పదే పదే హెచ్చరించినప్పటికీ హిందీ మహావిద్యాలయా పెద్దగా స్పందించలేదు. దీంతో విచారణ కమిటీల నివేదికలను యూనివర్శిటీ స్థాయి సంఘానికి నివేదించింది. ఈ విషయమై తీవ్రంగా స్పందించిన ఒయు స్టాండింగ్ కమిటీ సంబంధిత రికార్డులను సత్వరమే సీజ్ చేయాల్సిందిగా ఒయు పరీక్షల నియంత్రణాధికారి, డీన్ సీడీసీలను అదేశించింది. ఒయు అదనపు పరీక్షల నియంత్రణాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు గాను క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది.

స్వయం ప్రతిపత్తి రద్దు చేయాల్సిందిగా యుజిసికి సిఫార్సు
కళాశాల స్వయంప్రతిపత్తిని రద్దు చేయాల్సిందిగా యుజిసి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులను కోరాలని సిఫార్సు ఒయు స్టాండింగ్ కమిటీ చేసింది. ఒయు పరిధిలో మరెక్కడా హిందీ మీడియం కళాశాలలు లేనందున… విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు మినహాయింపు నిచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం 2025 -2026 నుంచి ఎలాంటి యుజి అడ్మిషన్లు చేపట్టవద్దని స్పష్టం చేసింది. సాధారణంగా పిజి తరగతులు నాన్ అటానమస్ స్టేటస్‌తో కొనసాగించుకోవచ్చని తెలిపింది. తుది సెమిస్టర్ పరీక్షలను స్వయంగా యూనివర్సిటీ నిర్వహించనున్నది. స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఫలితంగా ఎలాంటి అక్రమాలను సహించే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చింది. అనుబంధ, స్వయంప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థలు… యూనివర్సిటీ, యుజిసి నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఈ సందర్భంగా ఒయు వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం అన్నారు. విద్యా ప్రమాణాలు, పారదర్శకత, నిబంధనల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News