Saturday, April 27, 2024

వరుస పెట్రో బాదుడు

- Advertisement -
- Advertisement -

Petrol prices continue to rise

 

ఓట్లేసి సుస్థిర అధికారం అప్పగించిన ప్రజల పట్ల బాధ్యత, వారి దుస్థితిపై మానవీయ ఆందోళన బొత్తిగా లేని ప్రభుత్వాలే ఇటువంటి దుర్మార్గమైన పెట్రో ధరల బాదుడికి తెగబడగలవు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయి మనం దిగుమతి చేసుకుంటున్న బ్రెంట్ రకం క్రూడ్ బ్యారెల్ ధర 18 డాలర్లకు దిగిపోయినప్పుడైనా అనియంత్రిత విధానం ప్రకారం ఆ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోగా అదే పనిగా పెంచుతూ పోతున్న కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ ధోరణిని ఏమనాలో తెలియడం లేదు. రెండున్నర మాసాల పాటు కొనసాగిన కఠోర కరోనా లాక్‌డౌన్ వల్ల ఉపాధులు, ఉద్యోగాలు కోల్పోయి పొట్ట చేతపట్టుకొని దిక్కు తోచని స్థితిలో పడిపోయిన దేశ ప్రజల మీద గత తొమ్మిది రోజుల పాటు వరుసగా పెంచుతూ వచ్చిన పెట్రోల్ ధరల భారం ఎన్ని విధాలుగా, ఎంతగా పడుతుందో ఊహిస్తేనే గుండె చెరువైపోతుంది.

ప్రధాని మోడీ ప్రభుత్వం నుంచి అటువంటి మానవతా స్పందన అణుమాత్రమైనా లేకపోడమే విస్మయం కలిగిస్తున్నది. పెట్రోల్, డీజిల్ ధరల అదనపు వడ్డింపు వల్ల రవాణా చార్జీలు పెరిగిపోయి అన్ని సరకులు మరింత ప్రియమైపోయి ప్రజల జేబులకు మరిన్ని చిల్లులు పడి ద్రవ్యోల్బణం ఇంకా విజృంభిస్తుంది. జనం హాహాకారాలు చేస్తారు. పెట్రో ధరలను కేంద్రం గత తొమ్మిది రోజుల్లో రోజుకి కొన్ని పైసల వంతున పెంచిన తీరులోని అతి తెలివి చెప్పనలవికానిది. ఒకేసారి లీటరు వద్ద 5 రూపాయలు పెంచితే ప్రజలు గగ్గోలు పెట్టి మీడియా విమర్శలు మిన్నంటి తమ నిజ స్వరూపాన్ని బయటపెడతాయనే భయంతో రోజుకి కొన్ని పైసల వంతున బాదుతూ పోయాయి పెట్రోలియం కంపెనీలు. సోమవారం నాడు పెట్రోల్ మీద లీటరు వద్ద 46 పైసలు, డీజిల్‌పై 59 పైసలు పెంచాయి. ఈ పెంపుతో పెట్రోల్ ధర లీటరుకు రూ. 4.98, డీజిల్ ధర రూ. 5.20 పెరిగాయి. ఇందుకు అదనంగా కేంద్ర, రాష్ట్రాలు విధించే పన్నులు, సెస్సులు చేరి ధర తడిసి మోపెడవుతుంది.

పెట్రోల్‌కు, డీజిల్‌కు ప్రజలు చెల్లిస్తున్న ధరలో 70 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు, సెస్సులే ఉంటాయి. వాటిని తీసివేస్తే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వాస్తవ ధర రూ. 18కి మించదు. ప్రస్తుత పెంపుతో అత్యధికంగా ముంబైలో పెట్రోల్ ధర లీటరు రూ. 83.17కి చేరుకున్నది. దీనితో దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 2018 అక్టోబర్ నాటి అత్యధిక స్థాయికి మళ్లీ ఎగబాకాయి. మనం పెట్రోల్ అవసరాలకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులను బట్టి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, తగ్గడం ఉండాలి. గతంలో అంతర్జాతీయ ధరల పెరుగుదల భారం నేరుగా దేశంలోని సామాన్య జనం మీద పడకుండా చూడడం కోసం కేంద్రం కొంత మొత్తాన్ని సబ్సిడీగా భరించేది. దానిని ప్రభుత్వ రంగం పెట్రోలియం కంపెనీలకు తాను చెల్లించేది. ఆ భారం పెరుగుతూపోడం వల్ల ఆ విధానానికి స్వస్తి చెప్పింది.

అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఆ మేరకు దేశంలోని వినియోగదారుల నుంచి యథాతథంగా వసూలు చేయడం, తగ్గితే అదే స్థాయిలో ఇక్కడ తగ్గించడం అనే అనియంత్రిత విధానాన్ని ప్రవేశపెట్టింది. దానిని బట్టి అక్కడ తగ్గితే ఇక్కడ ధర దిగి రావడమనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎప్పుడూ జరగనే లేదు. గత నెల 6వ తేదీన కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్‌పై లీటరు వద్ద రూ. 10, డీజిల్‌పై రూ. 13 పెంచింది. దానితో అంతర్జాతీయ భారీ తగ్గుదల వల్ల పబ్లిక్ రంగ పెట్రోల్ కంపెనీలకు సమకూరిన మిగులును ఈ పెంపు తీసివేసింది. ఇందువల్ల వర్తమాన ఆర్థిక సంవత్సరంలో పెట్రో కంపెనీల నుంచి ప్రభుత్వానికి లక్షా 60 వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుంది. పోనీ, ఈ కారణంగా అక్కడి ధర తగ్గుదల ప్రయోజనాన్ని కంపెనీలు తమకు బదలాయించలేకపోయాయని ప్రజలు సరిపెట్టుకున్నారు.

అంతటితో వారి జోలికి రాకుండా ఆగివుండవలసిన కంపెనీలు అందుకు విరుద్ధంగా అలవాటైన ప్రజలను కాల్చుకుని తినే పనికి ఈ నెల 7 నుంచి మళ్లీ తలపడ్డాయి. కరోనా లాక్‌డౌన్ లేకుండా ఉంటే ఈ బాదుడును ఇంకా ముందుగానే మొదలుపెట్టి ఉండేవి. ఒకవైపు ఆకస్మిక లాక్‌డౌన్ కారణంగా ఉన్న చోట పనులు కోల్పోయి సొంత ఊళ్లకు చేరుకునే దారి కానక చావు బతుకుల మధ్య నానా కష్టాలు ఎదుర్కొన్న వలస కార్మికులకు, ఇతరత్రా ఉద్యోగ, ఉపాధులు నష్టపోయి, జీతాలు భారీ కోతకు గురైన జనానికి నేరుగా గణనీయమైన స్థాయిలో నగదు సహాయం చేయకపోగా అదనంగా పెట్రో మార్గంలో వారి జేబులు కొల్లగొట్టడం ప్రజా ప్రభుత్వాలు చేయదగిన పని ఎంత మాత్రం కాదు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కాకులను కొట్టి గద్దలకు వేసేదిగానే నిరూపించుకుంటున్నది. ఇప్పటికైనా అది తన వైఖరిని మార్చుకొని ప్రజాహిత పంథాకు మళ్లాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News