Saturday, May 4, 2024

అందరినీ దోచుకోండి: కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఫైర్

- Advertisement -
- Advertisement -

ప్రాణాలతో ఉన్నవారిని, మృతులను వదలవద్దు
పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ను తూర్పారబట్టిన ప్రధాని మోడీ
వారసత్వ పన్ను పంపిణీపై వ్యాఖ్యానించిన పిట్రోడా

న్యూఢిల్లీ : ‘వోటు బ్యాంక్ వ్యామోహం’ ఉన్న కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా రిజర్వేషన్‌ను అమలు చేయాలనికోరుకుంటున్నదని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్జుజా జిల్లా కేంద్రం అంబికాపూర్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, దేశంలో వారసత్వ పన్ను విధించాలని, వ్యక్తుల పిల్లల హక్కులు కబళించాలని కాంగ్రెస్ వాంఛిస్తున్నదని కూడా ఆరోపించారు.

దేశంలో సంపద పునఃపంపిణీపై ప్రస్తుతం చర్చ సాగుతున్న నేపథ్యంలో యుఎస్ తరహా వారసత్వ పన్ను విధానాన్ని ఆ పార్టీకి చెందిన శామ్ పిట్రోడా సూచించిన తరువాత పార్టీని మోడీ మరింత తీవ్రంగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన పక్షంలో సంపద సర్వే చేయిస్తుందని రాహుల్ గాంధీ చేసిన వాగ్దానంపై ఇప్పటికే రేగిన వివాదాగ్నిపై పిట్రోడా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్లయింది. అధిక పన్నులు విధించడం ద్వారా, ప్రజలు కష్టపడి ఆర్జించిన సంపదను తమ పిల్లలకు బదలీ చేయనివ్వకపోవడం ద్వారా సొంత ఖజానాను నింపుకోవాలని కాంగ్రెస్ కోరుకుంటున్నదని మోడీ ఆరోపించారు.

‘మధ్య తరగతిపై మరిన్ని పన్నులు విధించాలని యువరాజు’, ‘రాచ కుటుంబం’ సలహాదారుడు (శామ్ పిట్రోడా) కొంత కాలం క్రితం సూచించారు’ అని మోడీ చెప్పారు. ‘వారసత్వపన్ను విధిస్తామని, తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన వారసత్వ సంపదపై కూడా పన్ను విధిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. మీరు కష్టపడి సంపాదించిన సంపద మీ పిల్లలు పొందబోరు. కాంగ్రెస్ పంజా దెబ్బతో దానిని మీ దగ్గర నుంచి లాక్కొంటుంది’ అని మోడీ ఆరోపించారు. పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రమాదకర ఉద్దేశాలను బహిర్గతం చేశాయని ప్రధాని అన్నారు. ఎల్‌ఐసి పూర్వపు నినాదం ఆధారంగా మోడీ ఒక వ్యాఖ్య చేస్తూ, ‘కాంగ్రెస్‌కు ఒక మంత్రం ఉంది. ‘జిందగీ కే సాథ్ భీ, జిందగీ కే బాద్ భీ’ (జీవించి ఉన్నప్పుడు, మరణం తరువాత కూడా) అనేదే ఆ మంత్రం’ అని అన్నారు. ప్రధాని మోడీ ఏ పేర్లనూ ప్రస్తావించకుండా గాంధీ కుటుంబాన్ని లక్షం చేసుకుంటూ, ‘మొత్తం కాంగ్రెస్ పార్టీని తమ పూర్వీకుల ఆస్తిగా పరిగణించి, దానిని తమ పిల్లలకు అప్పగించిన వారు భారతీయులు తమ ఆస్తిని తమ పిల్లలకు బదలీ చేయరాదని ఇప్పుడు కోరుకుంటున్నారు’ అని ఆరోపించారు.

దేశంలో కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి ‘బలహీన’ ప్రభుత్వాన్ని కొందరు కోరుకుంటున్నారని, భారత్ ఆత్మనిర్భర్ (స్వావలంబన) సాధిస్తే తమ దుకాణాలు మూతపడతాయన్న వారి భయమే అందుకు కారణమని మోడీ అన్నారు. ‘నేను ఇప్పుడు సుర్గుజాకు వచ్చినప్పుడు కాంగ్రెస్ ముస్లిం లీగ్ ఆలోచన ధోరణిని దేశం ముందు ఉంచాలని అనుకుంటున్నాను. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల అయినప్పుడు దానిలో ముస్లిం లీగ్ ముద్ర ఉందని ఆరోజు చెప్పాను, ఇప్పుడూ చెబుతున్నాను’ అని మోడీ తెలిపారు. రాజ్యాంగం రూపకల్పన జరిగినప్పుడు భారత్‌లో మతం ప్రాతిపదికగా రిజర్వేషన్ ఏదీ ఉండరాదని బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో నిర్ణయించడమైంది అని ఆయన చెప్పారు.

‘రిజర్షేషన్ ఉంటే, అది దళిత సోదరులు, సోదరీమణులు, ఆదివాసీ సోదరులు, సోదరీమణుల కోసం’ అని మోడీ చెప్పారు. ‘కానీ వోటు బ్కాంకు వ్యామోహం ఉన్న కాంగ్రెస్ గొప్ప వ్యక్తుల మాటలను, రాజ్యాంగం పవిత్రతను, బాబాసాహెబ్ అంబేద్కర్ పదాలను ఎన్నడూ పట్టించుకోలేదు. ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్‌లో మతం ఆధారంగా రిజర్వేషన్ అమలుకు ప్రయత్నించింది. ఆతరువాత కాంగ్రెస్ దానిని మొత్తం దేశంలో అమలు చేయాలని పథకం వేసింది’ అని మోడీ ఆరోపించారు. మతం ఆధారంగా 15 శాతం రిజర్వేషన్ అమలు గురించి వారు మాట్లాడుతున్నారని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాల కోటా కుదింపు తరువాత అది జరుగుతుందని వారు చెప్పారని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News