Sunday, April 28, 2024

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi launches Ayushman Bharat Digital Mission

ఓ క్లిక్‌తో ఆరోగ్య డాటా
డిజిటల్ మిషన్ అందుబాటులోకి
ఆరంభించిన ప్రధాని మోడీ
చికిత్స ప్రక్రియలో కీలకం
పౌరులకు పనికొచ్చే చిట్టా

న్యూఢిల్లీ : దేశంలో ఆరోగ్య చికిత్స సమాచార ప్రక్రియలో డిజిటల్ శకం ఆరంభం అయింది. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ వ్యవస్థ పరిధిలో వ్యక్తులకు ఆరోగ్యపరమైన సమాచారపు గుర్తింపు కార్డు (ఐడి) సమకూరుస్తారు. ఇందులో వారి ఆరోగ్యపరమైన అంశాల రికార్డు పొందుపర్చి ఉంటుంది. పౌరుల ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థలో ఈ డిజిటల్ మిషన్ ప్రక్రియ విప్లవాత్మక పరిణామం అని ప్రధాని మోడీ దీనిని ఆవిష్కరించిన నేపథ్యంలో ప్రసంగిస్తూ తెలిపారు. ఆరోగ్యపరిరక్షణ అత్యంత కీలకమైనది. కాలానుగుణంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ జరిగే కీలక మార్పులకు ఈ ప్రక్రియ అద్దం పడుతుందని ప్రధాని దేశ ప్రజలకు తెలిపారు. దేశంలో గత ఏడు సంవత్సరాలలో ఆరోగ్య సౌకర్యాల విస్తృతికి పాటుపడుతున్నామని, ఈ పరిణామంలో ఇప్పటి ఘట్టం సరికొత్త అధ్యాయం అవుతుందని చెప్పారు. గత ఏడాది ఎర్రకోట నుంచి స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలోనే ఈ డిజిటల్ మిషన్ నమూనాత్మక ఆచరణ గురించి ప్రధాని ప్రకటించారు.

దీని మేరకు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం) ప్రయోగాత్మకంగా ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలు అవుతోంది. ఇప్పుడు దీనిని దేశవ్యాప్తం చేసే దిశలో రంగం సిద్ధం అయింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబి పిఎం జెఎవై) తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ పథకానికి డిజిటల్ హంగులు సమకూర్చే దిశలో ఇప్పుడు దీని డిజిటల్ మిషన్ విస్తరణకు దిగారు. పౌరులకు తమ ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉండటం ద్వారా ఎప్పటికప్పుడు తగు విధంగా ఆరోగ్య పరిరక్షణకు తమను తాము సిద్ధం చేసుకోవడం తేలిక అవుతుందని ప్రధాని తమ ప్రసంగంలో తెలిపారు.

ఆధార్, మొబైల్‌వాలాలు, జన్‌ధన్‌ఖాతాలతో లింక్

దేశవ్యాప్తంగా ఇప్పుడు దాదాపుగా 130 కోట్ల ఆధార్ వినియోగదార్లు ఉన్నారు. 118 కోట్ల మొబైల్ వాడకందార్లు, 43 కోట్ల మంది జన్‌ధన్ ఖాతాదార్లు ఉన్నారని ప్రధాని తెలిపారు. ఈ విధంగా దేశం అనుసంధాన సంపన్నం అయిందని, ఈ దశలో ఇప్పటి హెల్త్ డిజిటల్ ప్రక్రియకు మరింత వెసులుబాటు లభిస్తుందని తెలిపారు. ఎబిడిఎంతో విశ్వసనీయ ఆరోగ్య సమాచారం అందుబాటులోకి వస్తుంది. దీనితో మెరుగైన చికిత్సకు, సకాలంలో రోగుల ప్రాణరక్షణకు వీలేర్పడుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మిషన్ పరిధిలో ఇకపై పౌరులు అంతా కూడా డిజిటల్ హెల్త్ ఐడిలు పొందుతారని, తమ ఆరోగ్యం గురించి తాము సమగ్రంగా ఫోన్ల ద్వారా తెలుసుకునే వీలేర్పడుతుందన్నారు.

పేదలు మధ్యతరగతికి మరింత మేలు

ప్రతి పౌరుడి హెల్త్ రికార్డులను డిజిటల్‌గా పరిరక్షించడం జరుగుతుంది. ఈ పదిల ప్రక్రియతో పేదలు, మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు మేలు జరుగుతుందని ప్రధాని తమ భాషణలో వివరించారు. దేనికైనా సాంకేతికత ముఖ్యం, దీనిని సరైన విధంగా అందుబాటులోకి తెచ్చుకోవడం మరింత అవసరం. కేంద్రం ప్రవేశపెట్టిన ఆరోగ్యసేతు యాప్‌తో కరోనా దశలో దేశానికి ఎంతో మేలు జరిగిందని, ఎక్కడికక్కడ వైరస్ వ్యాప్తి నివారణకు మార్గం ఏర్పడిందని తెలిపారు. వైరస్‌గ్రస్తులను సకాలంలో గుర్తించడం , సామూహిక వ్యాప్తి నిరోధక చర్యలు ముమ్మరం చేయడానికి ఆరోగ్యసేతు కీలకం అయిందన్నారు.

కొవిన్ ప్రక్రియతో 90 కోట్ల మందికి టీకా

ఇక వ్యాక్సినేషన్ల ప్రక్రియలో భారతదేశం సాధించిన ఘనవిజయానికి కొవిన్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. దీని ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం మీద 90 కోట్ల కొవిడ్ టీకాలు వేశారని తెలిపారు. సాంకేతికతను సరిగ్గా వినియోగించుకుంటే అది మానవాళికి విస్తారితంగా పనికి వస్తుందనే విషయం ఇప్పటి పలు రకాల కీలక యాప్‌లు, డిజిటల్ ఏర్పాట్లతో స్పష్టం అయిందని, ఇప్పటి ఆరోగ్య డిజిటల్ కార్డుల ప్రక్రియ ఇందులో మరింత ప్రధాన ఘట్టం అని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ఈ డిజిటల్ విధానంతో పౌరులు ఆరోగ్యపరిరక్షణను సమగ్రరీతిలో దక్కించుకోవడం అనేది కేవలం ఓ బటన్ నొక్కడంతో సాధ్యం అవుతుందని ప్రధాని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News