Saturday, December 2, 2023

బలమైన ప్రభుత్వం వల్లే సాధ్యమైంది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇది సాధారణ చట్టం కాదని..నవ భారత నిర్మాణ ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో కూడిన బలమైన ప్రభుత్వం ఉండడం వల్లనే దాదాపు 30 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లు ఆమోదం పొందిందన్నారు. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో శుక్రవారం ‘బిజెపి మహిళా మోర్చా’ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మహిళానేతలకు వినమ్ర పూర్వకంగా నమస్కరించారు. ‘ మహిళలకు రిజర్వేషన్ల ఈ అంశం దాదాపు మూడు దశాబ్దాలుగా నానుతూ వచ్చింది. గత పాలకులకు ఈ విషయంతో చిత్తశుద్ధి కరవైంది. అయితే బిజెపి ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేసింది.

ఈ క్రమంలోనే గత దశాబ్ద కాలంలో మహిళలు బలమైన శక్తిగా ఎదిగారు. అందుకే గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతులను చించేసిన పార్టీలే ఇప్పుడు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది’ అని బీహార్‌కు చెందిన ఆర్‌జెడి, యుపిలకి చెందిన సమాజ్‌వాది పార్టీలాంటి కొన్ని ప్రాంతీయ పార్టీలనుద్దేశించి పరోక్షంగా ప్రధాని మోడీ అన్నారు.ఈ బిల్లుకు ‘నారీ శక్తివందన్’ పేరు పెట్టడాన్నితప్పుబట్టిన పార్లమెంటులోని కొంత మంది ప్రతిపక్ష ఎంపిలను ప్రధాని దుయ్యబడుతూ, ఈ దేశంలోని మహిళలకు వందనం సమర్పించడం, వారి గౌరవాన్ని ఇనుమడింపజేయడం చేయకూడదా? అని ప్రశ్నించారు. పూర్తి మెజారిటీ ఉన్న బలమైన , స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. మహిళల భద్రత, గౌరవం, సంక్షేమం కోసం గత పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టినట్లు ఆయన ప్రకటించారు. కొన్ని నిర్ణయాలకు దేశ భవిష్యత్తును మార్చే శక్తి ఉంటుందని, మహిళా రిజర్వేషన్ బిల్లు అలాంటి వాటిలో ఒకటని ప్రధాని అంటూ, ఈ బిల్లు మహిళల్లో కొత్త విశ్వాసాన్ని పాదుకొల్పి, భారత దేశం ముందుకు సాగడానికి అవసరమైన శక్తిని రెట్టింపు చేస్తుందని అన్నారు.

సెప్టెంబర్ 20, 21 తేదీల్లో కొత్త చరిత్ర లిఖించబడిందన్నారు. ‘అలాంటి అవకాశాన్ని ప్రజలు ఈ ప్రభుత్వానికి ఇవ్వడం మా అదృష్టం’ అని ఆయన అంటూ.. రాబోయే తరాలు దీనిపై చర్చించుకుంటాయన్నారు.‘ కుటుంబంనుంచి పంచాయత్ దాకా, ఆర్థిక రంగం మొదలుకొని విద్యారంగం, పారిశ్రామిక రంగం దాకా ప్రతి రంగంలోను మన మహిళా సోదరీమణులు కనీవినీ ఎరుగని రీతిలో అసాధారణమైన రీతిలో రాణిస్తున్నారు. చంద్రుడి పైకి భారత్‌ను తీసుకెళ్లడంలో మహిళలు గణనీయమైన పాత్ర పోషించారు. స్టార్టప్‌లు, స్వయం సహాయక బృందాలు, సామాజిక ప్రచారం.. ఇలా దేశంలోని ప్రతి రంగంలోను మహిళల భాగస్వామ్యం బలోపేతమవుతోంది’ అని మోడీ అన్నారు. గత ప్రభుత్వాలు బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే చేశాయని, అయితే ట్రిపుల్ తలాఖ్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్ల ఆమోదం లాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మహిళ సాధికారత కోసం కృషి చేసింది మోడీ మాత్రమేనని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీతో పాటుగా బిజెపికి చెందినపలువురు మహిళా ఎంపిలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News