Monday, May 20, 2024

అవినీతిలో వారిది ఫెవికాల్ బంధం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / సిరిసిల్ల ప్రతినిధి /వేములవాడ : అవినీతిలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ది ఫెవికాల్ బంధమని, ఈ రెండు కుటుంబ పార్టీలు తోడుదొంగలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలో బిజెపి కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపి అభ్యర్థులకు మద్దతుగా బుధవారం నిర్వహించిన జనసభలో ఆయన కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లపై విరుచుకుపడ్డారు. ముందుగా తెలుగులో ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ ప్రసంగం ప్రారంభించిన నరేంద్రమోడి సభికుల హర్షధ్వానాలతో మన్ననలు పొందారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ..గత సంవత్సరం తెలుగులో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా కలెక్షన్లను మించి తెలంగాణలో డబుల్ ఆర్ టాక్స్ కలెక్షన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. త్రిపుల్ ఆర్ కలెక్షన్లు రికార్డు స్థాయిలో రూ.వెయ్యి కోట్లు కాగా ఐదు నెలల్లోనే అంతకుమించి తెలంగాణలో ఒక ఆర్ దోచి.. ఢిల్లీ ఆర్‌కు ఇస్తున్నారని, తెలంగాణను దోచుకుంటున్న డబుల్ ఆర్ ట్యాక్స్ పీడ నుండి విముక్తి కావాల్సి ఉందని అన్నారు. ఎన్నికల ముందువరకు అదానీ, అంబానీలను ప్రతిరోజు తిట్టిన రాహుల్ గాంధీ ఎన్నికల ప్రకటన రాగానే వారిని తిట్టడాన్ని రాత్రికి రాత్రే మానుకున్నారని, అంబానీ ఆదానీల దగ్గర ఎంత బ్లాక్‌మనీ తీసుకున్నారో రాహుల్ ప్రజలకు సమాధానమివ్వాలని అన్నారు.

తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ ఇపుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నోటుకు ఓటు కేసులో దొరికిన ఆ నేతపై విచారణ, కేసు ఎందుకు ముందుకు సాగలేదో అర్థం చేసుకోవాలని అన్నారు. రెండు పార్టీలు ప్రజల ముందు తిట్టుకుంటున్నట్లు నటిస్తూ వెనుక మాత్రం కలిసి పనిచేస్తుంటాయని విమర్శించారు. మంగళవారం జరిగిన మూడో విడత పోలింగ్‌తో కాంగ్రెస్ ఇండియా కూటమి ఫ్యూజులు పోయాయని ఎద్దేవా చేశారు. నాలుగో విడత ఈ నెల 13న జరుగనున్నదని బిజెపి ఎన్‌డిఎ కూటమి స్పష్టమైన మెజార్టీతో ముందుకు దూసుకుపోతున్నదని ప్రధాని అన్నారు. కరీంనగర్‌లో తమ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపు ముందే ఖరారైందని అన్నారు. కాంగ్రెస్ అతి కష్టమ్మీద ఓ అభ్యర్థిని తెచ్చిందని, బిఆర్‌ఎస్ అభ్యర్థి అడ్రస్ గల్లంతైందని అన్నారు. గత పదేళ్లుగా మోడీ పరిపాలనను చూస్తున్నారని, ప్రపంచంలోనే భారతదేశాన్ని ఐదో అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దానని, జమ్మూ కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను తొలగించానని, భారత్‌ను దిగుమతుల దేశ స్థాయి నుండి ఎగుమతుల దేశ స్థాయికి మార్చానని, అయితే ఇదంతా తాను చేయలేదని ఓటర్ల శక్తి వల్ల వారు తనకిచ్చిన ఆశీర్వాదం వల్ల సాధ్యపడిందని అన్నారు.

గుజరాత్‌లో మూడుసార్లు సిఎంగా పనిచేసినా తనకు కూడా సాధ్యంకాని విధంగా ఉదయం పది గంటలకే వేములవాడలో ఇంతపెద్ద జనసమీకరణ సాధ్యపడటం ఆశ్చర్యంగా ఉందని, ఇంకా ప్రజలు వస్తూనే ఉన్నారని ఇదంతా మీ ప్రేమ అన్నారు. ఇలా ఉదయం పూట ఇంత జనసమీకరణ చూడటం ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తోందని అన్నారు. తెలంగాణలో భారత్‌లో కావల్సినంత సమర్థత ఉన్న యువత ఉందని, అయితే బిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ వారి కుటుంబాల అభివృద్ధే చూసుకున్నాయి కానీ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని అన్నారు. వ్యవసాయికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా అణచివేసి సమస్యల నిలయాలుగా మార్చారని ధ్వజమెత్తారు. సమస్యలను సృష్టించడంలో కాంగ్రెస్ కన్నతల్లి వంటిదన్నారు. బిజెపి, ఎన్‌డిఏ గత పదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేశామన్నారు. వ్యవసాయాన్ని ఆధునీకరించామని, లాభసాటి పెట్టుబడులు అందించామని, ఫసల్ బీమా, కిసాన్ సమ్మాన్, కౌశల్ వికాస్, టెక్స్‌టైల్ పార్కుల స్థాపన వంటివి ఎన్నో చేపట్టామన్నారు. ప్రతి ఇంటిలో నైపుణ్యాల అభివృద్ధికి తమ పార్టీ మీ వెంట నిలబడిందన్నారు. బిజెపికి దేశమే ముఖ్యమని, కానీ కాంగ్రెస్, బిఆర్‌ఎస్ బై ద ఫామిలీ, ఫర్ ద ఫామిలీ, ఆఫ్ ద ఫామిలీ అంటూ ఉంటాయన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకే తాను ముక్కలని దొందూ దొందే ఎద్దేవా చేశారు.

ఈ రెండు పార్టీలను అవినీతి బాంధవ్యం కలుపుతోందన్నారు. జీరో గవర్నమెంట్ మోడల్స్ కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నుండి తెలంగాణను, దేశాన్ని అందరం కలిసి కాపాడుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో ప్రజలు బిఆర్‌ఎస్ (టిఆర్‌ఎస్) మీద ఎంతో భరోసా పెటుకున్నారని, కానీ ఆ పార్టీ తమ కుటుంబం కోసం ప్రజల కుటుంబాల ఆశలు నాశనం చేసిందని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కాంగ్రెస్‌పై కూడా ప్రజలు అలాగే భరోసా పెట్టుకున్నారని కానీ ఆ పార్టీ ప్రజల ఆశలను వమ్ముచేసిందని అన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు కుటుంబమే ముందు, తరువాతే దేశంగా మారిపోయిందన్నారు. తెలంగాణకు చెందిన మేధావి భారత ప్రధానిగా పని చేసిన పివి నరసింహారావును కాంగ్రెస్ అవమానించిందని, చనిపోయిన తరువాత కూడా ఆయన మృతదేహానికి అవమానమే మిగిల్చారన్నారు. కానీ తమ ప్రభుత్వం పివిని భారతరత్న ఇచ్చి గౌరవించిందన్నారు. పివి కుటుంబానికి చెందిన మూడు తరాల వారిని కలిసే అవకాశం కలిగిందని, వారితో మాట్లాడి పివి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నానన్నారు.

దేశం కోసం ఎంతో పనిచేసిన పివిని కాంగ్రెస్ వారు ఎంతో అవమానించారన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అక్రమ బంధం, సంతుష్టీకరణ పటిష్టం చేసుకోవడానికి హైదరాబాద్ ఎంపి స్థానాన్ని ఎంఐఎంకు లీజుకు ఇచ్చారని, మొదటిసారిగా బిజెపి అభ్యర్థి బలంగా ఎంఐఎంకు పోటీ ఇస్తుండటంతో ఎంఐఎం కన్నా ఎక్కువగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నాయకులు బాధపడుతున్నారని, ఎంఐఎం అభ్యర్థి గెలుపుకోసం పనిచేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ సంతుష్టీకరణ విధానం అవలంభిస్తూ.. డా. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ఇచ్చిన రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఇవ్వాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ బహిరంగంగానే ఈ విషయాన్ని ప్రకటించారని అన్నారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాదిగ సమాజానికి కూడా అన్యాయం చేయాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. అయోధ్యలో ప్రజలందరి కోరిక మేరకు రామమందిరం కట్టామని, తెలంగాణ ప్రాంతం నుండి దర్వాజాలు తెప్పించారని, అవి అయోధ్య ఆలయాన్ని శోభాయమానం చేశాయన్నారు. రామమందిరం కడితే ప్రజలందరూ సంతోషపడితే కాంగ్రెస్ మాత్రం రామమందిరానికి తాళం వేయాలని కోరుకుంటోందన్నారు.

రామమందిర నిర్మాణం వల్ల కాంగ్రెస్ మాత్రం కోపం, దుఃఖంలో ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోర్టుకు వెళ్లి అయోధ్య రామమందిర నిర్మాణ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతామంటోందని అన్నారు. అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా తెలంగాణలో కాంగ్రెస్‌ను సమూలంగా తుడిచిపెట్టాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ చేసిన పాపాలకు ఫలితం అనుభవించాలన్నారు. అందుకోసం మూడు కమలాలను కరీంనగర్‌లో బండి సంజయ్, పెద్దపెల్లిలో గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్‌లో నగేష్‌ను గెలిపించి ఢిల్లీకి పంపాలని కోరారు. బిజెపికి ఓటు వేస్తే మోడీకి వేసినట్టేనని అన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటికీ కార్యకర్తలు వెళ్లి మోడీ వచ్చి ప్రతి ఒక్కరికీ నమస్కారం చెప్పాడని చెప్పాలని, ఇది తన చిన్న కోరిక అని సూచించారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ మోడీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. కరీంనగర్ ఎంపి అభ్యర్థి బండి సంజయ్, పెద్దపల్లి అభ్యర్థి శ్రీనివాస్, ఆదిలాబాద్ అభ్యర్థి నగేష్, పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News