Thursday, May 2, 2024

భరత్‌పూర్ సైబర్ దొంగలు దొరికారు

- Advertisement -
- Advertisement -

Police arrested by Bharatpur cyber thieves found

హైదరాబాద్: ఆర్మీ అధికారులమని చెప్పి ఓఎల్‌ఎక్స్‌లో వేదికగా నేరాలు చేస్తున్న భరత్‌పూర్ సైబర్ నేరస్థులు ఐదుగురిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, 12 ఎటిఎం కార్డులు, 21 సిమ్ కార్డులు, రూ.1,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం, భరత్‌పూర్ జిల్లా, నగర్ తానా, స్టేషన్ రోడ్డుకు చెందిన రుక్మిన్(26) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముర్‌ఫీద్ అలియాస్ ముఫీ, రాజస్థాన్,భరత్‌పూర్, ధనా గ్రామానికి చెందిన సాయికుల్ ఖాన్, షారుఖ్, రఖం ఖాన్ కలిసి ఆర్మీ అధికారుల పేరుతో ఓఎల్‌ఎక్స్ వేదికగా నేరాలు చేస్తున్నారు.

నిందితులపై రాష్ట్రంలో 40 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 కేసులు, హైదరాబాద్‌లో18, 06 కేసులు రాచకొండలో, నిజామాబాద్‌లో ఒక కేసు నమోదయింది. సైబరాబాద్‌కు చెందిన మహిళ కరోనా సమయంలో ఇంటికి వెళ్తుండగా తన వస్తువులు విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో పెట్టారు. వెంటనే స్పందించిన భరత్‌పూర్ సైబర్ నేరస్థులు బాధితురాలికి ఫోన్ చేశారు. తాము ముందుగా రూ.5 క్యూఆర్ కోడ్‌ను పంపిస్తామని, దానిని స్కాన్ చేస్తే మిగతా డబ్బులు పంపిస్తామని చెప్పారు. దానిని నమ్మిన బాధితురాలు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడంతో ఆమె బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ. 23,000ను ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఆందోళన చెందిన బాధితురాలు వెంటనే వారికి ఫోన్ చేసింది. పొరపాటు జరిగిందని ఇప్పడు మళ్లీ క్యూఆర్‌కోడ్ పంపిస్తామని దానిని స్కాన్ చేస్తే డబ్బులు తిరిగి వస్తాయని తెలిపారు. మళ్లీ స్కాన్ చేయగా రూ.42,000 ట్రాన్స్‌ఫర్ అయ్యాయి.

దీంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఈ ముఠా నాయకుడు రుక్మిన్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్‌లో ఆయిల్ మిల్‌లో పనిచేశాడు. గుర్‌గావ్‌లో కూలీ పనిచేశాడు, మిగతా ఆరుగురితో కలిసి మధురాలోని చైన్ స్నాచింగ్ తదితర నేరాలు చేశాడు. తర్వాత తనతో పాఠశాలలో చదువుకున్న స్నేహితుడు ఆసిఫ్ ఓఎల్‌ఎక్స్‌లో నేరాలు చేయడం చూసి తను నేర్చుకున్నాడు. ఎటిఎం ద్వారా డబ్బులు తీసుకువచ్చినందుకు కమీషన్ తీసుకునేవాడు. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇతడే ముఠాను తయారు చేసి నేరాలు చేయడం ప్రారంభించాడు. రుక్మిన్‌పై 24 కేసులు ఉన్నాయి. ముర్‌ఫీడ్ అలియాస్ ముఫీ నాలుగో తరగతి వరకు చదువుకున్నాడు.

ఓఎల్‌ఎక్స్‌లో యాడ్స్ ఇవ్వడం ఇచ్చేవాడు, కొని సార్లు తానే వస్తువులకు యజమానినని తెలిపేవాడు. నకిలీ ఐడి కార్డులు, ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఫోటోలను పంపించి మోసం చేసేవాడు. బాధితులకు క్యూఆర్ కోడ్‌ను పంపిస్తూ మోసం చేసేవాడు, ఎటిఎంల నుంచి డబ్బులు తీసుకుని వచ్చే వాడు.సాయికూల్ ఖాన్ అలియాస్ ఈశ్వర్ రావు అలియాస్ జస్‌పాల్ సింగ్ ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. షారూఖ్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఇతడు ఒకరికి రూ.10వేలు ఇచ్చి వారి బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకుని వచ్చేవాడు. రఖం ఖాన్ ఓఎల్‌ఎక్స్‌లో యాడ్స్ ఇచ్చేవాడు. ఆర్మీ నకిలీ ఐడి కార్డులు తయారు చేసి బాధితులకు పంపించేవాడు. బాధితుల నుంచి డబ్బులు సేకరించేవాడు. క్రైం డిసిపి రోహిణి ప్రియదర్శిని పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఎస్సైలు రాజేంద్ర, విజయవర్ధన్,మల్లికార్జున్, పిసిలు వెంకటేష్, సత్యనారాయణ, రాజ్‌కుమార్, రవి, సూరజ్ సింగ్, కృపాకర్‌రెడ్డి నిందితులను పట్టుకున్నారు. భరత్‌పూర్ దొంగలను పట్టుకున్న పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అభినందించారు.

ఆన్‌లైన్‌లో చూసి మోసపోవద్దుః విసి సజ్జనార్

ఓఎల్‌ఎక్స్‌లో వస్తువులను చూసి కొనేందుకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. తక్కువ ధరకు కార్లు, ఇతర వస్తువులు వస్తున్నాయని ఆశపడి కొనేందుకు మొగ్గుచూపవద్దని అన్నారు. పది లక్షల విలువైన కారును రెండు లక్షలకు ఇస్తామంటే ఎలా నమ్ముతారని అన్నారు. వస్తువులు డెలివరీ అయిన తర్వాతే డబ్బులు పంపించాలని కోరారు. సైబర్ నేరస్థులు మాయమాటలు చెబుతారని వాటిని నమ్మవద్దని అన్నారు. ఆర్మీ, సిఐఎస్‌ఎఫ్ అధికారులమని చెబితే నమ్మవద్దని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News