Tuesday, May 7, 2024

బిజెపిలో కొనసాగుతున్న అసమ్మతి రాగాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర అధ్యక్షుడు ప్రాతినిధ్యం
వహిస్తున్న జిల్లాలో సమసని వర్గ విభేదాలు..
గ్రూపులు యధాతధం.. అంతర్గత పోరు కంటిన్యూ…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిజెపి మూడు ముక్కలాట

Political war in BJP in Karimnagar
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా బిజెపి పార్టీలో వర్గ విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు..గతంలో సైతం పలుమార్లు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఓటమికి వర్గ విబేధాలే కారణమవ్వగా.. రాబోవు ఎన్నికల్లో కూడా ఈ గొడవ తప్పదేమో అని కింది స్థాయి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా ఎంపీ గా రాష్ట్ర అధ్యక్షుడే ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో ఉన్నా అప్పుడప్పుడు అసమ్మతి రాగాలు వినబడుతూనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ మూడు ముక్కలాట గా మారింది. కరీంనగర్ జిల్లా బిజెపి పార్టీ కి బలమైన ఓటు బ్యాంకు ఉన్న జిల్లా ఇక్కడ బిజెపి నాయకులు జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పగలరు. అంతటి ప్రాముఖ్యత జిల్లాలో వర్గాల గోల తప్పట్లేదు. గత కొంత కాలంగా జిల్లా బిజెపిలో సీనియర్లు వర్సెస్ బండి సంజయ్ గా నడిచిన పోరు కాస్తా సద్దుమణిగి సయోధ్య కుదిరినా అంతర్గత పోరు మాత్రం అలానే కంటిన్యూ అవుతుందనే చర్చ కొనసాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో ఆశావహులు ఎక్కువ ఉండటంతో బీజేపీలో మరోసారి గొడవలు తప్పవనేలా పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి. జిల్లాలో ఇప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్న పార్టీలో ఆధిపత్య పోరులో సామాన్య కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది పార్టీశ్రేణుల వ్యాఖ్యగా వినవస్తోంది. జిల్లాలో మూడు వర్గాలుగా బిజెపి పార్టీ కార్యక్రమాలు నడుస్తున్నాయంటున్నారు. బండి సంజయ్,ఈటెల రాజేందర్,మాజీ ఎంపీ వివేక్,సీనియర్ నేతల వర్గాలతో పార్టీ క్యాడర్ ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గంలో బిజెపి మూడు గ్రూప్ లుగా మారింది. మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత గుజ్జుల రామకృష్ణా రెడ్డి,బండి సంజయ్ అనుచరుడు ప్రదీప్,మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి వర్గాలుగా విడిపోయాయి. ఏ కార్యక్రమం చేపట్టినా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కార్యక్రమాలు జరుపుకోవడం చర్చకు దారి తీస్తోంది. బండి సంజయ్ సన్నిహితుడిగా ఉన్న ప్రదీప్ కు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి మధ్య టికెట్ పోరు ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదే జిల్లాలోని మరో నియోజకవర్గం రామగుండం. ఇక్కడి బిజెపిలో సైతం మూడు గ్రూపులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ వర్సెస్ మాజీ ఎంపీ వివేక్ వర్గం, బండి సంజయ్ వర్గాలుగా ఉన్నారు..సోమారపు సత్యనారాయణ కు వివేక్ వర్గం నుండి ఇబ్బందులు తలెత్తడంతో ఆయన జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

మరోవైపు మంథని బిజెపిలో పాత కొత్త నాయకులకు సమన్వయం లోపం నెలకొందని పార్టీ శ్రేణుల్లో వినబడుతుంది. సీనియర్ నాయకుడు సనత్ కుమార్ కు కొత్తగా బీజేపీ లో చేరిన సునీల్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు అంతర్గత విభేదాలు పార్టీ కార్యకర్తలకు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. సనత్ కుమార్ బండి సంజయ్ వర్గం కాగా సునీల్ రెడ్డి వివేక్ వర్గంగా ఉన్నారు..రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో సామాన్య కార్యకర్తలకు ఇక్కట్లు తప్పట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో బిజెపి పార్టీలో ముసలం పుట్టింది..ఎవరికి వారే ప్రచారాలు చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో తమదే టికెట్ అని పార్టీ శ్రేణులకి చెబుతున్నారు. వేములవాడ లో బండి సంజయ్ వర్గం గా ఉన్న ప్రతాప రామకృష్ణ, ఈటల రాజేందర్ వర్గంగా ఉన్న తుల ఉమ,మహా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కొడుకు వికాస్‌లు ఎవరికి వారుగా కార్యక్రమాలు విడివిడిగా చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. స్థానికంగా వున్న ఎంఎల్‌ఎపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో ఈసారి బిజెపిలో టికెట్ వస్తే చాలు అన్నట్లు ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు. సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లో వెళ్తున్నా గ్రూప్ లు మధ్య అంతర్గతంగా పోరు తప్పట్లేదని ప్రచారం జరుగుతోంది. మరి బండి సంజయ్ ఈ తలనొప్పుల నుంచి ఎలా బయటపడతారో? చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News