Thursday, May 2, 2024

సానుకూల జాతీయవాదం

- Advertisement -
- Advertisement -

Positive Nationalism

 

దేశభక్తి అంటే ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతం పట్ల గౌరవం, అభిమానం, సాటి పౌరుల పట్ల మా సహచరులే అన్న అభిమానంతో కూడిన స్పృహను కలిగి ఉండటం. అందుకు విరుద్ధంగా జాతీయవాదం విస్తృతమైన, ఎల్లలు లేని పదం. జాతీయవాదం, దేశభక్తి ఒకే నాణానికి రెండు పార్శ్వాలు. కాని ఈ రెండు ఒకదానికొకటి పర్యాయ పదాలు ఎంతమాత్రం కావు. ఎల్లలు లేనిది జాతీయవాదం, సరిహద్దుల మధ్య ప్రదర్శించేది దేశభక్తి. వివిధ దేశాలలో రాజకీయంగా, శాస్త్ర సాంకేతిక రంగాలలో, క్రీడల్లో ఉన్నత స్థితిలో ఉన్న భారతీయులను చూసి మా జాతీయుడని మనం గర్వంగా చెప్పుకోవచ్చు, వారు కూడా మేము భారత జాతీయులమని సగర్వంగా ప్రకటించవచ్చు. కాని సాంకేతికంగా వారిలో చాలామంది భారతీయ పౌరులు కారన్నది నిర్వివాదాంశం. రేపటి భవిష్యత్తులో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయా దేశాలతో ఘర్షణ వాతావరణం ఏర్పడినా, ఇతరత్రా పోటీ ఏర్పడినా ఆయా భారత జాతీయులు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది వారి దేశభక్తిని నిర్ణయిస్తుంది.

దేశభక్తునికి జాతీయవాదికి మధ్య ఉన్న పలుచని గీత అనుభవంలోకి వస్తేనేగాని ఎవరికైనా కనిపించదు. దాస్య శృంఖలాలు తెంచి జాతికి స్వేచ్ఛను ప్రసాదించడానికి నాటి పోరాట యోధులు వాడిన పదునైన ఆయుధం భారత జాతీయవాదం. దేశ ద్రోహులుగా నాటి బ్రిటిష్ ప్రభుత్వం చిత్రీకరించినా కరాచీ నుండి కన్యాకుమారి వరకు మేమంతా భారత జాతీయులం అన్న నినాదం ఆసేతు హిమాచలాన్ని కదిలించింది అన్నది అక్షరసత్యం. ఒక వందేమాతరం, ఒక జనగణమన, ఒక మూడు రంగుల జండా, ఒక స్వదేశీ నినాదం, మహాత్ముని అమ్ముల పొదిలోని ఇలాంటి ఎన్నో ఆయుధాలు జాతీయ వాదమనే విల్లు ద్వారా సంధించబడ్డాయి. ఆసేతు హిమాచలాన్ని ఏకం చేసిన జాతీయవాదం నేడు కొత్త రంగును పులుముకుంటున్నది. వందల సంవత్సరాల దాస్య శృంఖలాలను ఛేదించుకొని నిర్మించుకున్న ప్రజాస్వామ్యం కలకాలం నిలబడాలంటే, అంబేడ్కర్, జయప్రకాష్ నారాయణ లాంటి మహనీయులు కలలుగన్న సమ సమాజం సాక్షాత్కరించాలంటే మానవ హక్కులతో కూడిన జాతీయ భావం ఎంతో అవసరం.

జాతి పేరుతో అడాల్ఫ్ హిట్లర్ జరిపిన నరమేధాన్ని స్మృతిపథం నుండి తుడిపేసి, భవిష్యత్తులో అటువంటి అరాచకం ప్రబలకుండా ఉండే ఆలోచనతో డిసెంబర్ 10, 1948 సంవత్సరం లో అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన చేయడం జరిగింది. 1215 సంవత్సరంలో ప్రకటించిన ‘మేగ్నాకార్టా’ మానవ హక్కులను గుర్తించిన మొదటి శాసనంగా చెప్పుకుంటే, అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటన దాని కొనసాగింపని చెప్పుకోవచ్చు. ఇందుకు అనుగుణంగానే భారత రాజ్యాంగంలో భావప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా ప్రకటించడమే కాదు, స్వయంగా ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టునే ఆ హక్కుల సంరక్షకురాలుగా ప్రకటించడం జరిగింది. భిన్న కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు, భాషలు, వర్గాలు, సాంప్రదాయాలతో విలసిల్లే రంగుల హరివిల్లు లాంటి సంస్కృతి మనది. ఆర్టికల్ 371 ద్వారా అసోం, మేఘాలయా, సిక్కిం లాంటి వివిధ రాష్ట్రాల్లో ఆయా సంస్కృతులు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక రక్షణ కల్పించడం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన కూడా భిన్నత్వంలో ఏకత్వానికి సహకరిస్తున్న ఆయా సంస్కృతులను పరిరక్షించడమే.

దేశభక్తి పేరుతో, జాతీయవాదం ముసుగులో ఈమధ్య కాలంలో ఆయా వెసులుబాట్లను ధిక్కరించే స్వరాలు వినిపించడం దురదృష్టకరం, జాతికి శ్రేయస్కరం ఎంతమాత్రం కాదు. ఈ మధ్యకాలంలో నాయకుల్లో, అధికారుల్లో దేశభక్తి పెరిగిపోయింది, వీధి వీధిలో మైకులు ఏర్పాటు చేసి, ఉదయాన్నే జాతీయ గీతాన్ని వినిపిస్తున్నారు. పనిలో పనిగా అదే మైకులో సదరు నాయకులు, అధికారులు తమ అమూల్య సందేశాలను వినిపిస్తున్నారు. పండుగలు ఉత్సవాల్లో పాటలు పెద్దల సందేశాలు వినిపిస్తున్నారు. సినిమా హాళ్ళలో, గ్రామాల కూడళ్ళలో జాతీయ గీతాలాపన, నిలుచుని అంకిత భావాన్ని ప్రదర్శించడం దేశభక్తికి పరీక్షలుగా మారడం దురదృష్టకరం.

శతాబ్దాల చరిత్రలో తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలి, సింధు, మరాఠా, సిక్కు, మొదలైన ఎన్నో జాతులు భారత ఉపఖండంలో పరిఢవిల్లాయి. పార్శీలు, తురుష్కులు, గ్రీకులు మొదలైన ఎన్నో జాతులు ఈ గడ్డ మీద అడుగుపెట్టినాయి. కాలాంతరంలో అవన్నీ ఒక్కటిగా భారతీయతను సంచరించుకున్నాయి. నాగరికత స్థిరపడాలంటే, అభివృద్ధి ఆగకుండా ముందుకు సాగాలంటే సమాజంలో క్రమశిక్షణ ఎంతో అవసరం. 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్టు, జాతీయ సమగ్రత అనే పదాలను చేర్చడం వెనుక ఉన్న ఆలోచన క్రమశిక్షణ, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలతో కూడిన బలమైన జాతిని నిర్మించడమే.

2003, 2005 సంవత్సరాలలో భారత పౌరసత్వ చట్టానికి మార్పులు చేసి విదేశాలలో ఉన్నవారికి ద్వంద్వ పౌరసత్వాన్ని ఇచ్చే దిశలో ఆలోచన చేయడం వెనుకగల కారణం కూడా సమీకృత భారత జాతిని నిర్మించడమే. భిన్న దేశ భక్తుల మధ్య కూడా ఒకే జాతీయవాదం ఉండవచ్చు. రెండు దేశాలుగా విడిపోయిన జర్మనీని ఏకం చేసింది ఈ జాతీయ భావమే. 600 సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడం వెనుక అంతర్లీనంగా పని చేసిన మంత్రం కూడా భారత జాతీయవాదమనేది నిర్వివాదాంశం. మతాల మధ్య మూడు ముక్కలుగా విడిపోయిన భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు భవిష్యత్తులో ఏకం కావలసి వస్తే, అఖండ భారతం సాక్షాత్కారం కావాలంటే మనమంతా భారతీయులమనే విశాల జాతీయ వాదాన్ని మేల్కొల్పడంతోనే అది సాధ్యపడుతుంది.

దేశభక్తి గురించిన ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో స్ఫురణకు వచ్చే అంశం ‘ దేశద్రోహం’. భారత శిక్షాస్మృతి విభాగం 124-ఎ ప్రకారం ఎవరు తమ రాతల ద్వారా, మాటల ద్వారా లేదా సంజ్ఞల ద్వారా ప్రభుత్వం మీద ద్వేష భావాన్నిగాని లేదా అసంతృప్తినిగాని రగిలిస్తారో వారు దేశద్రోహులుగా పరిగణించబడతారు. 1860లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్య్రోద్యమకారులను అణచివేసే ఉద్దేశంతో తెచ్చిన ప్రకరణ ఇది. ఎమర్జెన్సీ కాలంలో నాటి భారత ప్రభుత్వం నిందితులను వారెంటు లేకుండా అరెస్టు చేసే అవకాశం పోలీసులకు ఇస్తూ చట్టంలో మార్పులు చేసింది. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా ఈ మధ్యకాలంలో దేశద్రోహం గురించి మాట్లాడుతూ ‘ప్రభుత్వాల మీద, వాటి విధి విధానాల మీద తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం, అంతమాత్రాన్నే వారు దేశద్రోహులు కారు అన్నారు.

ఇంకా మాట్లాడుతూ దేశభక్తిని బలవంతంగా అమలు చేయడం సాధ్యం కాదన్నారు. వ్యక్తులను జాతీయ గీతాలాపనలో నిలబెట్టగలమేమో గాని వారి మనసులో గౌరవ భావం ఉన్నదో లేదో కనిపెట్టలేము కదా అన్నారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశద్రోహం ఆరోపణల కింద అరెస్టయిన మహాత్ముని మాటల్లో చెప్పాలంటే అభిమానాన్ని బలవంతంగా పొందలేము. హింసకు దారితీయనంత వరకు, హింసను ప్రేరేపించనంత వరకు ప్రభుత్వాల మీద, వాటి పని తీరు మీద అభిప్రాయాలు చెప్పగలిగే భావప్రకటనా స్వాతంత్య్రం ప్రజల కనీస హక్కు. అతివాదం భారతదేశంలో మాత్రమే ఉన్న సమస్య కాదు, భారతదేశాన్ని మాత్రమే పీడిస్తున్న సమస్య అంతకన్నా కాదు. ప్రపంచ మంతటా ముఖ్యంగా ఆసియా దేశాలలో వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలలో అతివాదం వేళ్లూనుకున్నది. ప్రతి సమాజంలో అతివాదులు, మితవాదులు ఉంటారు. మామూలు పరిస్థితులలో అతివాదులకు, మితవాదులకు మధ్య జరిగే భావ సంఘర్షణ కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. వేయి ఆలోచనలు సంఘర్షించినప్పుడే కొత్త ఉషోదయానికి దారులు ఏర్పడతాయి.

ఎన్నో దండయాత్రలు, దోపిడీలు, వలస పాలనల ప్రభావం వలన మన సంస్కృతిలో ఎన్నో బలహీనతలు కూడా ప్రవేశించాయన్నది వాస్తవం. ఆయా బలహీనతలు తొలగించుకోవడమే బలమైన జాతి నిర్మాణానికి దగ్గరి దారి. ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించడంతోనే అది సాధ్యం. ప్రశ్నించేతత్వం నుండే పదునైన ఆలోచనలు వెలువడతాయి. ప్రశ్నించే గొంతుకను అణచివేయాలనుకోవడం ఆటవిక లక్షణం. దృఢమైన జాతి నిర్మాణం జరగాలంటే సహేతుకమైన కారణాలతో ప్రశ్నించే ప్రతి గొంతుకనూ గౌరవించగలగడం నేర్చుకోవాలి. ప్రశ్నించే తత్వాన్ని భరించలేని అసహనం మొదలైన మరుక్షణం సమాజం ఎదుగుదల నిలిచిపోతుంది. భారతీయ సంస్కృతికి ప్రాణాధారమైన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నిటికీ మూలం ప్రశ్నలు, జవాబులే అన్నది మరువరాదు. భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ కూడా జాతీయ వాదాన్ని ‘ప్రమాదకరమైనది’ గానే అభివర్ణించారు.

అంతమాత్రాన్నే రవీంద్రుడు దేశద్రోహి కాబోడు. ఎక్కడ భయానికి తావు లేదో, ఎక్కడ మనిషి తలెత్తుకుని బతకగలడో, ఎక్కడ విజ్ఞానం గౌరవించబడుతుందో ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి నా తండ్రీ నా దేశాన్ని నడిపించుమని ప్రార్థించిన విశ్వకవి రవీంద్రుని నిబద్ధతను ప్రశ్నించలేము. ఈ మధ్య కాలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలాక్ మోహన్ భగవత్ మాట్లాడుతూ కూడా జాతీయవాదం (నేషనలిజం) అనే పదాన్ని ఉపయోగించవద్దని తమ శ్రేణులకు పిలుపు ఇచ్చారు, ఇది శుభ పరిణామం. ఆర్టికల్ 370, సిఎఎ విషయంలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పినవారిని, పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించిన వారిని, కార్పొరేట్లకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని వ్యతిరేకిస్తున్న వారిని, దేశంలో పెరుగుతున్న అసహనం మీద ప్రశ్నిస్తున్న వారిని, గో రక్షణ పేరుతో జరుగుతున్న మానవ హక్కుల హననం గురించి ప్రశ్నిస్తున్న వారిని, సోషల్ మీడియా వేదికగా ఉద్యమిస్తున్న వారిని అర్బన్ నక్సల్‌గా చిత్రీకరిస్తూ, దేశద్రోహులుగా కేసులుపెట్టడం ఈ మధ్య పరిపాటి అయింది.

సుప్రీంకోర్టు కూడా నిరసనతో కూడిన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ ధిక్కారం కాదు అని ప్రకటించింది. రాజరికం, నిరంకుశ పాలన నుండి ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన సమాజం మనది. దేశభక్తి ముసుగులో వ్యక్తుల భావప్రకటనా స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ మూలసూత్రాలకు విరుద్ధం. దేశమంటే మట్టికాదు, దేశమంటే మనుషులన్న గురజాడ మాటలు ఈ సందర్భంగా మనకు సదా స్మరణీయం.సమాజ గమనంలో, పురోభివృద్ధి ఎన్నో రంగాలు తమదైన ముద్ర వేస్తాయి. ప్రతి రంగం దేనికదే భిన్నమైనది. వ్యక్తులు అభిరుచి ( కోరిక/తృష్ణ) తో ఆయా రంగాలను ఎన్నుకోవాలి. ఆయా రంగాలలో తమ పూర్తి సామర్థ్యం మేరకు తమ ప్రతిభను ప్రదర్శించాలి. అప్పుడే సమాజంలో సామరస్యం, వ్యవస్థీకృత పురోగతి సాధ్యపడుతుంది.

మారుతున్న ప్రపంచం, కూలుతున్న ఆర్ధిక వ్యవస్థలు, పెరుగుతున్న జనాభా, తిరుగులేని యువశక్తి, ఏకమవుతున్న ప్రపంచ సంస్కృతులను దృష్టిలో ఉంచుకొని సానుకూల జాతీయ వాదానికి ఊపిరులూదాల్సిన అవసరం ఉన్నది. 40 కోట్ల యువశక్తితో పరిపుష్టంగా ఉన్న దేశం మనది. యువశక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకో గలిగితే, సరైన మార్కెట్ వారికి చూపగలిగితే రేపటి రోజు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఎదగడానికి అవకాశాలు కోకొల్లలు. భారత జాతీయవాదం, దేశభక్తి జాతి పురోభివృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేయాలే తప్ప ప్రతిబంధకాలు కాకూడదు.

 

Positive Nationalism
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News