Sunday, April 28, 2024

లీటరు డీజిల్‌పై రూ.25 పెంపు

- Advertisement -
- Advertisement -

Price of diesel sold to bulk users gone up by Rs 25 per liter

బల్క్ యూజర్లకు మాత్రమే వర్తింపు

న్యూఢిల్లీ: అంతర్జాతీయమార్కెట్లో చమురు ధరలు 40 శాతం పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ‘ పెద్ద వినియోగదారుల’( బల్క్ యూజర్స్)కు విక్రయించే డీజిల్ ధర లీటరుకు రూ.25 పెరిగింది. అయితే పెట్రోలు పంపుల వద్ద కొనే సామాన్య వినియోగదారులకు మాత్రం ఈ రేట్లు వర్తించదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. సాధారణంగా బల్క్ వినియోగదారులకు వర్తించే ధరలు రిటైల్ ధరలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి.ఈ అధిక ధరలను తప్పించుకోవడానికి వారంతా పెట్రోలు పంపుల వైపు మళ్లారు. మరో వైపు త్వరలో పెట్రోలు, డీజిలు ధరలు పెరగనున్నాయనే ప్రచారం భారీ ఎత్తున సాగింది. దీంతో సామాన్యులు సైతం కొనుగోళ్లను పెంచారు. ఫలితంగా ఈ నెల పెట్రోలు పంపుల వద్ద విక్రయాలు దాదాపు ఐదో వంతు పెరిగాయి. ఇది రిటైల్ విక్రయ సంస్థల నష్టాల పెరుగుదలకు దారి తీసింది. ముఖ్యంగా నయారా ఎనర్జీ, జియోబిపి,షెల్ వంటి ప్రైవేట్ రిటైల్ విక్రయ సంస్థలు భారీ నష్టాలు ఎదుర్కోవలసి వస్తోంది.

గత 136 రోజులుగా ధరలు స్థిరంగా ఉండడంతో రాయితీ ధరకు చమురు పొందే ప్రభుత్వ రంగ సంస్థలతో ఇవి పోటీ పడలేక పోతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పంపులను మూసి వేయడం తప్ప మరో మార్గం ఉండదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 2018లో ప్రభుత్వ రంగ సంస్థలనుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశవ్యాప్తంగా ఉన్న 1,432 పెట్రోలు పంపులను మూసివేసిందని పరిశ్రమ వర్గాలు గుర్తు చేశాయి. ఇప్పుడుకూడా అలాంటి పరిస్థితులే నెలకొన్నాయని తెలిపాయి. ఈ నేపథ్యంలో పెద్ద వినియోగదారులు పెట్రోలు పంపులవద్దకు వెళ్లకుండా నియంత్రించేందుకు ప్రత్యేకంగా వీరికి మాత్రమే ప్రభుత్వ రిటైల్ సంస్థలు ధరలను పెంచాయి. దీంతో ముంబయిలో బల్క్ వినియోగదారులకు లీటరు డీజిలు ధర రూ.122.05కు చేరింది.

అదే సామాన్యులకు మాత్రం ఈ ధర రూ.94.14గానేకొనసాగుతోంది. ఢిల్లీలో ఈ ధరలు వరసగా రూ.115,రూ.86.67గా ఉన్నాయి. గత ఏడాది నవంబర్ 4 తర్వాత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలు, డీజిలు రిటైల్ ధరలను పెంచలేదు. మరో వైపు ఈ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నెల 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ధరల్ని పెంచుతారని భావించినప్పటికీ అలా జరగలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలనుంచి పోటీని తట్టుకొనేందుకు ప్రైవేటు రిటైలర్లూ ధరలు పెంచలేదు. దీంతో నష్టాలు పెరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News