Sunday, April 28, 2024

చారిత్రక విజయంలో వారిదే కీలక పాత్ర: రహానె

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో యువ ఆటగాళ్లు అసాధారణ ఆటతో చెలరేగడం టీమిండియాకు శుభసూచకమని భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానె పేర్కొన్నాడు. అడిలైడ్ టెస్టు మ్యాచ్‌లో 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం పాలైన భారత జట్టు ఆ తర్వాత సిరీస్ సాధించిందంటే దానికి యువ క్రికెటర్ల పాత్ర చాలా కీలకమన్నాడు. ఇక ఈ జట్టుకు తాను సారథ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు రహానె స్పష్టం చేశాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాలు వెల్లడించాడు. తొలి మ్యాచ్‌లో ఓటమి అనంతరం బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ తనకు ఫోన్ చేశాడన్నాడు. 36 పరుగులకే కుప్పకూలినా దాని గురించి పట్టించుకోకుండా తర్వాతి టెస్టులకు సిద్ధం కావాలని సూచించాడు. క్రికెట్‌లో ఏ జట్టుకైన ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడం సహాజమేనని, దాని గురించి ఆలోచించకుండా మిగతా మ్యాచుల్లో ఎలా ఆడాలనే దానిపైనే దృష్టి పెట్టాలని చెప్పాడన్నాడు. విరాట్ కోహ్లి సేవలు అందుబాటులో లేని సమయంలో జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యతపై ఉందని, ధైర్యంతో ముందుకు వెళితే మంచి ఫలితాలు రావడం ఖాయమని గంగూలీ తనలో ధైర్యం నింపాడన్నాడు. ఇక గంగూలీ సూచనలు తనలో ధైర్యాన్ని నింపాయని, అంతేగాక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేందుకు సహకరించాయని రహానె పేర్కొన్నాడు. ఇక సిరీస్‌లో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, శార్దూల్, సైని, సుందర్, సిరాజ్ వంటి యువ ఆటగాళ్లు అసాధారణ రీతిలో రాణించడం తనను ఎంతో ఆనందానికి గురి చేసిందన్నాడు.

చివరి టెస్టులో బుమ్రా, అశ్విన్, జడేజా, షమి, ఉమేశ్ వంటి సీనియర్ బౌలర్లు అందుబాటులో లేకున్నా రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయడం వల్ల తమ సత్తా ఏంటో యువ బౌలర్లు చాటారని ప్రశంసించాడు. ఇక ఐపిఎల్‌తో పాటు జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో యువ క్రికెటర్లు ఎంతో రాటుదేలారన్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు బలోపేతంగా మారిందంటే దానిలో ద్రవిడ్ పాత్ర చాలా కీలకమన్నాడు. యువ ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తించి వారిని మంచి క్రికెటర్లుగా తీర్చిదిద్దడంలో ద్రవిడ్ ముఖ్య భూమిక పోషించాడని ప్రశంసించాడు. ఇక సీనియర్ ఆటగాడు చటేశ్వర్ పుజారా కూడా యువ బ్యాట్స్‌మెన్‌లకు అండగా నిలిచాడని, ఒత్తిడిలోనూ అతను పుజారా నిలకడగా రాణించాడని రహానె పేర్కొన్నాడు. జట్టు విజయంలో పుజారా పాత్ర కూడా ఎంతో కీలకమన్నాడు. ఇక సీనియర్ బౌలర్లు బుమ్రా, అశ్విన్, జడేజాలు కూడా తమవంతు పాత్ర పోషించారన్నాడు. ఇలా ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించడం వల్లే ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయం లభించిందని రహానె స్పష్టం చేశాడు.

Priority was to make Players believe in themselves: Rahane

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News