Thursday, May 2, 2024

సిఎం కెసిఆర్ కుమార్తెగా గర్వపడుతున్నా…

- Advertisement -
- Advertisement -

రాజకీయ వారసత్వాలను మేము గౌరవిస్తాం
బిజెపికి లొంగితేనే కుటుంబ పార్టీలు ఆమోదయోగ్యమా?
బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్
తమిళనాడులో వైరల్‌గా మారిన కవిత ప్రసంగం
బిజెపికి గట్టి సమాధానం ఇచ్చారంటూ ప్రశంసల వెల్లువ
కవిత వ్యాఖ్యలకు మద్దతు ప్రకటించిన ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్
పోలవరం తెలంగాణలో ఉందంటూ అన్నమలై చేసిన వ్యాఖ్యలపై వైరల్ అవుతున్న మీమ్స్

మన తెలంగాణ/ హైదరాబాద్: తాను సిఎం కెసిఆర్ కుమార్తెగా గర్వపడుతున్నానని, తాము రాజకీయ వారసత్వాలను గౌరవిస్తామని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. శుక్రవారం ఒక టీవీ ఛానల్ నిర్వహించిన సమ్మిట్ లో తాను చేసిన ప్రసంగపు వీడియోను జతచేస్తూ ఈ మేరకు కవిత ట్విట్టర్లో ట్వీట్ చేశారు. బిజెపితో అంటకాగినప్పుడు పలు పార్టీల్లో వారసత్వ రాజకీయాలు బిజెపికి కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. బిజెపికి లొంగితేనే కుటుంబ పార్టీలు ఆ పార్టీకి ఆమోదయోగ్యమా ? అని కవిత ప్రశ్నించారు.

టీవీ సంస్థ నిర్వహించిన సదస్సులో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఎండగడుతూ కవిత చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు కూడా వైరల్ అవుతున్నాయి. తమిళనాడు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఆమె చేసిన ప్రసంగానికి మంత్రముగ్ధులయ్యారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తుండటమే కాకుండా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వదని, గత 10 సంవత్సరాలలో కేంద్రం రూ. 100 లక్షల కోట్ల అప్పు తెచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఎటువంటి ప్రాజెక్టులు మంజూరు చేయడం లేదని సదస్సులో ధ్వజమెత్తారు.

బిజెపి హిందుత్వ రాజకీయాలను సమర్ధవంతంగా ఎండగట్టడంతో కవిత చేసిన ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ తమిళ ప్రజలు పెద్ద ఎత్తున ట్వీట్లు చేశారు. వాస్తవాలు, గణాంకాలతో తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నమలైకు గట్టిగా సమాధానం ఇచ్చారని ఆ ట్విట్‌లలో పేర్కొన్నారు. కుటుంబ పార్టీలు అంటూ విమర్శించే అర్హత బిజెపికి లేదని స్పష్టం చేశారు. మరొకవైపు, బిజెపి ప్రభుత్వాన్ని ఎండగడుతూ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సమర్ధించారు. ట్విట్టర్ లో కవిత మాట్లాడిన వీడియోను షేర్ చేసిన ఆయన కవిత మంచి క్లాస్ తీసుకున్నారు అంటూ స్పందించారు. పోలవరం తెలంగాణలో ఉందంటూ అన్నమలై చేసిన వ్యాఖ్యలపై వైరల్ అవుతున్న మీమ్స్ చర్చ వేదికలో తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నమలై కనీస పరిజ్ఞానం లేకుండా పోలవరం ప్రాజెక్టు తెలంగాణలో ఉందంటూ వ్యాఖ్యానించి నెటిజన్ల ముందు నవ్వుల పాలయ్యారు. అన్నమలై వ్యాఖ్యల ఆధారంగా నెటిజెన్లు రూపొందించిన మీమ్స్ వైరల్ గా మారాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News