Sunday, April 28, 2024

టెక్నాలజీని దాచుకోం.. ప్రపంచంతో పంచుకుంటాం

- Advertisement -
- Advertisement -

టెక్నాలజీని దాచుకోం.. ప్రపంచంతో పంచుకుంటాం
స్ఫుత్నిక్ టీకాల తయారీపై రష్యా నేత పుతిన్
వార్తాసంస్థల ఎడిటర్లతో వీడియో కాన్ఫరెన్స్
వ్యాక్సిన్ సమర్థత దాదాపుగా నూరుశాతం

సెయింట్ పీటర్స్‌బర్గ్(రష్యా): కొవిడ్ వ్యాక్సిన్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా ఇతర ప్రపంచంతో పంచుకుంటుందని దేశాధ్యక్షులు వ్లాడిమిర్ పుతిన్ చెప్పారు. వ్యాక్సిన్ టెక్నాలజీని వినిమయం చేసుకునేందుకు రష్యా ఎప్పుడూ సిద్ధంగా ఉందని, ప్రపంచంలో ఏ దేశమూ ఈ విధంగా ముందుకు రావడం లేదని తెలిపారు. రష్యా తయారీ అయిన స్ఫుత్ని వి వ్యాక్సిన్లను భారతీయ ఔషధ సంస్థలు ఇండియాలో తయారుచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. సంబంధిత పరిజ్ఞానాన్ని అందించేందుకు రష్యా ఔషధ నియంత్రణ సంస్థల నుంచి భారతీయ కంపెనీలకు అనుమతి దక్కింది. ఈ దశలో టెక్నాలజీని ప్రపంచానికి అందివ్వడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని పుతిన్ తెలియచేశారు. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్లను 66 దేశాలలో విక్రయిస్తున్నారని పుతిన్ వెల్లడించారు. స్ఫుత్నిక్ టీకా తయారీకి పుణేలోని సీరం ఇనిస్టూట్ అన్ని విధాలైన అనుమతి పొంది ఉత్పత్తికి రంగం సిద్ధం చేసుకుంది. ఈ టీకాలు భారత్‌లో ఉత్పత్తి అయితే అత్యవసర ప్రాతిపదికన దేశంలో టీకాల కొరత తీర్చేందుకు వీలేర్పడుతుంది.

ఇక ఎప్రిల్‌లో ఈ వ్యాక్సిన్ తయారీకి డాక్టర్ రెడ్డీ లాబ్స్ అనుమతి పొందింది. అదే విధంగా పనసియా బయోటెక్ సంస్థ రష్యా అధీకృత వెల్త్‌ఫండ్ ఆర్‌డిఐఎఫ్ సహకారంతో విరివిగా స్ఫుత్నిక్ టీకాల తయారీకి సిద్ధం అయింది. ఈ దశలో రష్యా అధ్యక్షులు పిటిఐ సహా పలు అంతర్జాతీయ స్థాయి వార్తాసంస్థ సీనియర్ ఎడిటర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు ఎడిటర్ రష్యా వ్యాక్సిన్ సమర్థతపై వెలిబుచ్చిన అనుమానాలపై రష్యా అధ్యక్షులు తీవ్రస్థాయిలో స్పందించారు. తమ వ్యాక్సిన్ సరిగ్గా పనిచేయడం లేదనే వాదనను పుతిన్ తోసిపుచ్చారు. యూరప్ దేశాలలో నెలకొని ఉన్న వాణిజ్యపరమైన ప్రయోజనాలు, కొన్ని దేశాల సంస్థల నుంచి పోటీ తత్వంతో అక్కడ తమ వ్యాక్సిన్లు ముందుగా ప్రవేశించలేకపోయినట్లు అంగీకరించారు.
వైరస్‌లో చైనా పాత్రలో రాజకీయాలు వద్దు
అసలు వైరస్ ఎక్కడి నుంచి తలెత్తింది? చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే ఇది పుట్టిందనే అమెరికా ఇతర దేశాల వాదనపై పుతిన్ స్పందించారు. దీని గురించి ఇప్పటికే చాలా బాగా విశ్లేషించుకుంటూ మాట్లాడుకుంటూ పోతున్నారని, అయితే ఇటువంటి సంక్షోభం సమయంలో రాజకీయ విమర్శలతో అసలు విషయాలపై దృష్టి పోతుందని తెలిపారు. అమెరికా ప్రెసిడెంట్ వైరస్ సృష్టిపై మరింత దర్యాప్తునకు ఆదేశించారు. అప్పట్లో ట్రంప్ తమ హయాంలో చైనా వల్లనే ఇప్పటి దుస్థితి నెలకొందని పేర్కొంటూ ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు, సుంకాలు జరిమానాలకు దిగారు. ఇటువంటివి అనేకం జరిగాయి. అయితే ఇప్పుడు దీనిపై ఎక్కువగా మాట్లాడుకోవడం వల్ల ఫలితం లేదు. కొత్తగా దీని విషయంలో తాను ఏమీ చెప్పేది లేదని తేల్చారు. పుతిన్ నిర్వహించిన పరోక్ష ముఖాముఖిలో అసోసియెటెడ్ ప్రెస్, రాయిటర్స్ వంటి వార్తా సంస్థలు కూడా ఉన్నాయి. తమ దేశ వ్యాక్సిన్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉందని, ఇదే విధంగా వాణిజ్యపరమైన పోటీ ఉందని పుతిన్ తెలిపారు. తమ దేశ వ్యాక్సిన్‌కు అంతర్జాతీయ నిపుణుల గుర్తింపు దక్కిందన్నారు. దీని సమర్థత దాదాపుగా 98 శాతంగా నిర్థారితం అయిందన్నారు. ఏ దేశం ముందుకు వచ్చినా వ్యాక్సిన్ తయారీకి అవసరం అయిన టెక్నాలజీని అందించేందుకు సర్వదాసిద్ధం అని తెలిపారు.

Putin video conference with News Editors

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News