Friday, May 3, 2024

టీకా ఎప్పుడు?

- Advertisement -
- Advertisement -

Question is when will corona vaccine come 2020 కరోనా సంవత్సరంగా చరిత్రలో అత్యంత హేయమైన స్థానాన్ని పొందనుంది. పరమ భయానక ముఖ చిత్రంతో నమోదు కానుంది. తలచుకుంటేనే భయపెట్టే మహమ్మారిగా చిరస్థాయిని గడిస్తుంది. అను దినం, అనుక్షణం పలువురు ప్రముఖులు సహా లెక్కలేనంత మంది కరోనా వాతబడి చనిపోతున్నారు. సోమవారం (నవంబర్ 30) నాటికి ప్రపంచ వ్యాప్తంగా 14 లక్షల 67 వేల 390 మంది మృతి చెందారు. భారత దేశంలో మృతుల సంఖ్య లక్షా 33 వేలు దాటింది. వ్యాధి అడుగడుగునా అణువణువునా పొంచి ఉండి ఎంత బీభత్సాన్ని సృష్టిస్తున్నప్పటికీ విస్తృత ప్రచారం కారణంగా ప్రభుత్వాలు, ప్రజలు తీసుకుంటున్న అసాధారణ జాగ్రత్తల వల్ల దాని ఉధృతి తగ్గుముఖం పడుతూ ఉండడం హర్షించవలసిన పరిణామమే. అయితే పూర్వం మాదిరిగా స్వేచ్ఛగా తిరిగే వాతావరణం ఎప్పుడు కలుగుతుందనే దానికి సమాధానం కరవు. నిర్భయంగా జీవన కార్యకలాపాలలో పాల్గొనే పరిస్థితి ఇప్పటికీ లేదు.

యూరప్, అమెరికాలో కరోనా రెండవ అధ్యాయం విరుచుకుపడిందనే వార్తలు మరింత భయపెడుతున్నాయి. చలికాలం దాని విజృంభణకు అనువైనది కాబట్టి మన దగ్గర తిరిగి విరుచుకుపడే ప్రమాదం లేకపోలేదు. అదే సమయంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటే విని తట్టుకోలేని పరిస్థితి. నెలల తరబడి సాగిన మొదటి లాక్‌డౌన్ మిగిల్చిన చేదు అనుభవం ఉద్యోగాలు, ఉపాధులను హరించి బతుకు భయాన్ని పెంచింది. ఆ రోజులు తలచుకుంటేనే గుండె గుభేల్ మంటుంది. లండన్‌లో లాక్‌డౌన్ వ్యతిరేక ఆందోళన మొన్న శనివారం నాడు పరాకాష్ఠకు చేరుకుంది. సేవ్ అవర్ రైట్స్ ( మా హక్కులను కాపాడండి) ఉద్యమకారులు తలపెట్టిన ప్రదర్శనను అడ్డుకోడానికి పోలీసులు భారీ ఎత్తు అరెస్టులకు పాల్పడ్డారు. బ్రిటన్‌లో ఇటీవల రెండోసారి విధించిన లాక్‌డౌన్ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి దుర్భర వాతావరణం, వీధిలోకి వెళితే కరోనా, ఇంట్లో కూర్చుంచే ఉపాధి కరవు.

చిన్న, చితక ఆదాయాల అల్ప జీవుల పరిస్థితి గురించి చెప్పనక్కర లేదు. ఈ నేపథ్యంలో అందరినీ వేధిస్తున్న ప్రశ్న కరోనా టీకా ఎప్పుడు వస్తుంది, దాని తయారీ ఏ దశలో ఉంది అనేదే. ఒకవేళ వస్తే అందరికీ ఎప్పుడు అందుతుంది అనేది మరో ప్రశ్న. కోవాగ్జిన్ అనే దేశీయ టీకా గత ఆగస్టు 15 నాటికే వస్తుందని కలిగించిన ఆశ నిరాశ అయింది. భారత్ బయోటెక్ కంపెనీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), జాతీయ అంటువ్యాధుల సంస్థ కలిసి రూపొందిస్తోన్న టీకా అంతిమ దశలో ఉందని స్వాతంత్య్ర దినోత్సవం నాటికి సిద్ధమవుతుందని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. కాని అది నిజం కాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ గత శనివారం నాడు అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె నగరాల్లో జరిపిన టీకా పర్యటన, అది తయారవుతున్న ప్రయోగ శాలల సందర్శన మళ్లీ ఆశలు రేకెత్తించింది. టీకాపై ఇప్పటి వరకు జరిగిన క్లినికల్ పరీక్షల్లో ప్రగతి సాధ్యమైందని దానిని త్వరగా తీసుకు వచ్చేందుకు కృషి జరుగుతున్నదని ప్రధాని ట్విట్టర్ సందేశంలో తెలియజేశారు.

ఇతర దేశాలకు కూడా మనమే టీకాను అందించగలమని ఆయన చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. రష్యా టీకా జనవరి నాటికి వస్తుందన్న సమాచారమూ ఆశలు కలిగిస్తోంది. టీకాపై ఆశలు దీపాల్లా ఇలా వెలుగుతున్న దశలోనే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకా వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యానంటూ చెన్నైకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి చేసిన ఫిర్యాదు గమనించదగినది. రూ. 5 కోట్లు పరిహారం కోరుతూ తన న్యాయవాది ద్వారా ఆయన ఆయా తయారీ సంస్థలకు ఇచ్చిన నోటీసు సంచలనం సృష్టించింది. దీనిపై పరీక్షలు చేస్తున్న సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ ఆరోపణను ఖండించింది. చివరి దశ మానవ పరీక్షలలో భాగంగా ఆక్స్‌ఫర్డ్ టీకాను ప్రయోగించిన చెన్నై వ్యక్తికి ఇతర శారీరక సమస్యలున్నాయని అవి టీకా వల్ల వచ్చినవి కాదని ఈ సంస్థ వివరించింది. అయినా జరగవలసిన నష్టం జరిగిపోయింది. టీకా అంటే భయపడే పరిస్థితి ఆ వ్యక్తి ఫిర్యాదు సమాచారం వల్ల నెలకొన్నది. టీకా ఆలస్యమయ్యే కొద్దీ ఇటువంటి భయాలు పెరిగే ప్రమాదముంది. కనీసం అది ఖచ్చితంగా ఎప్పుడు సిద్ధమవుతుందో ప్రపంచానికి తెలియవలసి ఉంది. హెచ్‌ఐవి ఎయిడ్స్ టీకా తయారీకి నాలుగేళ్లు పట్టిందని అంటున్నారు. టీకా తయారు కావడంతో సరిపోదు దానిని నిల్వ ఉంచడానికి ప్రజలందరికీ వేయడానికి అనువుగా భారీ ఎత్తున ముందస్తు ఏర్పాట్లు జరగవలసి ఉంది. మన దేశంలో అటువంటి మౌలిక సదుపాయాల కొరత అసాధారణంగా ఉన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఈ పరిస్థితులలో టీకా తయారీ ఏ దశలో ఉంది ప్రపంచంలో పలు చోట్ల సాగుతున్న కృషి ఎటువంటిది, ఇంచుమించుగా ఎప్పుడు అది పూర్తి అందుబాటులోకి వస్తుంది అనే వాటిపై క్షుణ్ణమైన సమాచారం కోసం ప్రజలు ఆత్రుతగా ఎదురు చూడడం సహజం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News