Sunday, April 28, 2024

విచ్ఛిన్నశక్తుల నుంచి సేవ్ హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

Telangana GHMC Elections 2020

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంలో సేవ్ హైదరాబాద్ నినాదం మరొక్క సారి రంగం మీద కు వచ్చింది. హైదరాబాద్ అభివృద్ధే ఎజెండాగా ప్రచా రం జరగవలసిన ఈ ఎన్నికల్లో హైదరాబాద్ నగరాన్ని విచ్ఛిన్నకర శక్తుల నుంచి రక్షించుకోవడమే ప్రధాన ఎజెండాగా ముందుకు రావడం ఒక విషాదం. 2016లో రాష్ట్ర విభజనకు తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నగరాన్ని తెలంగాణకు దక్కకుండా వలసవాదులు చేసిన కుట్రలను తిప్పికొట్టి హైదరాబాద్ నగరాన్ని వలసవాదుల, వారి దళారుల చేతుల్లో చిక్కకుండా కాపాడుకోవడం ప్రధాన ఎజెండాగా ఉండింది. హైదరాబాద్ నగరాన్ని తామే అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టామని, తాము అభివృద్ధి చేసిన హైదరాబాద్ నగరంపై అధికారం చెలాయించే హక్కు తమదే అని ప్రచారం చేస్తూ ఎన్నికల బరిలోకి దిగారు వలసవాదులు.

రెండు కండ్ల సిద్ధాంతాన్ని భుజాన మోసుకొని హైదరాబాద్ నగరంలో అడ్డా బైఠాయించాలని అందుకు గ్రేటర్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని వారు తీవ్రంగా తాపత్రయపడినారు. విభజన సమయంలో కూడా హైదరాబాద్ నగరాన్ని మనకు దక్కకుండా చేయడానికి వారు చేసిన కుట్రలు, లేవనెత్తిన కిరికిరిలు మనకు తెలువనివి కావు. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని లేదా రెండు రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేయాలని, హైదరాబాద్ నగర ఆదాయంలో తమకు వాటా ఇవ్వాలని ఇట్లా రకరకాల వాదనలను ముందుకు తెచ్చి హైదరాబాద్‌ను తెలంగాణకు దక్కకుండా చేయాలన్న కుట్రలు పన్నారు. ఆనాడు తెలంగాణ సమాజం ఏకమై వారి కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొని హైదరాబాద్‌ని దక్కించుకున్నాం.

అయితే 60 ఎండ్లుగా వలసవాదులకు ఆర్థిక, రాజకీయ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరం 2016 నాటికి ఇంకా సంపూర్ణంగా విముక్తం కాలేదు. అందుకే 2016 గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ ను కాపాడుకోవడం తెలంగాణ ఉద్యమ శక్తుల ముందు ప్రధాన కర్తవ్యంగా ఉండింది. హైదరాబాద్ అంటే వలసవాదులకు ఒక వనరు. హైదరాబాద్ అంటే వారికి కోట్లకు పడగలెత్తించే భూమి, ఉద్యోగాలు కల్పించే ఒక ఆఫీసు, వ్యాపారం చేసుకోవడానికి పనికి వచ్చే ఒక అంగడి. తెలంగాణ వారికి హైదరాబాద్ అంటే అత్మ గౌరవం, గుండె చప్పుడు, వారసత్వ సంపద, 500 ఏండ్ల పేగు బంధం, సాంసృతిక, మేధో వికాస కేంద్రం. హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఉద్యమ సమయంలో ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ పెద్ద బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద్ధం కావాలని ఉద్యమ శ్రేణులు 2016 గ్రేటర్ యుద్ధ బరిలోకి దిగినాయి.

ఆనాటి మన నినాదం హైదరాబాద్ కోసం మనం మన కోసం హైదరాబాద్. 2016లో వలసవాదుల కుట్రలను ఛేదించి హైదరాబాద్ నగరాన్ని వలసవాదుల పాలబడకుండా కాపాడుకున్నాం. ఈ రోజు మరొక్కసారి హైదరాబాద్ నగరాన్ని మతతత్వ శక్తుల నుంచి, విచ్ఛిన్నకర శక్తుల నుంచి కాపాడుకోవాల్సిన సందర్భం నగర ప్రజల ముందుకు వచ్చి పడింది. గడచిన ఐదేండ్లలో హైదరాబాద్‌ను వలసవాదుల కబంధ హస్తాల నుంచి విముక్తం చెసుకోగలిగినాము. విభజన చట్టం ప్రకారం పదేండ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి. అయితే వారు అంతవరకు ఆగకుండా ముందే అమరావతికి తరలిపోయారు. హైకోర్టు వేరు పడింది. అదొక విజయం.

ఇప్పుడు హైదరాబాద్ విశ్వ నగరంగా ఎదుగుతున్న దారిలో పయనిస్తున్నది. అమెజాన్, ఆపిల్, ఫేస్‌బుక్, గూగుల్, ఊబర్, సేల్స్ ఫోర్స్ లాంటి పెద్ద పెద్ద ఐటి కంపనీలుహైదరాబాద్‌లో తమ ఇంటర్నేషనల్ కాంపస్‌లు నిర్మించుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం(TS IPASS) కారణంగా పరిశ్రమలు వెలుస్తున్నాయి. దీని వలన లక్షలాది యువకులకు ఐటి రంగంలో, పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఒక్క ఐటి రంగం అభివృద్ధిని చూసినప్పుడు .. తెలంగాణ ఏర్పడే నాటికి అంటే 2013 -14 నాటికి ఐటి రంగంలో ఎగుమతుల విలువ రూ. 57,258 కోట్లు. కల్పించబడిన ఉద్యోగాల సంఖ్య 3,23,396. అది 2019- 20 నాటికి ఎగుమతుల విలువ రూ. 1,28,807 కోట్లకు పెరిగింది. ఉద్యోగాల సంఖ్య 5,82,129 కోట్లకు పెరిగింది. అంటే నికరంగా సుమారు 2,50,000 ల అదనపు ఉపాధి అవకాశాలు యువతకు సమకూరినాయని చెప్పవచ్చు. గత ఆరు ఏండ్లుగా హైదరాబాద్‌లో నెలకొని ఉన్న ప్రశాంత వాతావరణం, శాంతి భద్రతలు, మౌలిక వసతుల కల్పన, Ease of Doing Business హైదరాబాద్‌లో, తెలంగాణ రాష్ట్రంలో పెరగడం, నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా, పరిశ్రమలకు తగినంత నీటి సరఫరా వలన సాధ్యపడిందని నగర ప్రజలు ముఖ్యంగా యువత గమనించాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరం అప్రతిహతంగా అభివృద్ధి దారిలో పరిగెడుతున్నది.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్ ఎటువంటి మత కల్లోలాలు లేకుండా, శాంతి భద్రతల సమస్య లేకుండా ప్రశాంత వాతావరణం వెల్లివిరుస్తున్నది. 60 ఏండ్ల వలస పాలకుల రాజకీయ కుట్రల కారణంగా హైదరాబాద్ సహ జీవన సంస్కృతికి తూట్లు పడినాయి. ఇప్పుడు నగరం ఆ గాయాలను మాన్పుకుంటూ కుదుటపడి అభివృద్ధి పథంలోముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ముప్పు వలసవాదుల నుంచి కాదు. మతతత్వవాదుల నుంచి. ఇవ్వాళ జరుగుతున్న ఎన్నికలు ఈ అభివృద్ధి ఎజెండాగా జరగవలసింది. అయితే దురదృష్టవశాత్తు ఎన్నికల ఎజెండాను ప్రజల మతపరమైన భావోద్వేగాల వైపు మళ్లించారు మతతత్వ, విచ్ఛిన్నకర శక్తులు.

తరతరాలుగా హైదరాబాద్ నగరంలో వెల్లివిరిసిన సహ జీవన సంస్కృతి మళ్ళీ ప్రమాదంలో పడే పరిస్థితి కనబడుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా అభివృద్ధి ఎజెండాగానే జరుగుతాయి. జరగాలి కూడా. అయితే ఎట్లయినా గెలవాలన్న లక్ష్యంతో ఎన్నికల్లో గెలిస్తే ఏమి చేస్తామో చెప్పకుండా ప్రజల మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ఇది వాంఛనీయం కాదు. నగర ప్రజలు రాజ్యాంగ ధర్మాన్ని కాపాడుకోవాలి. శతాబ్దాల సహజీవన సంస్కృతిని నిలబెట్టుకోవాలి. అన్ని రకాల మాట తత్వ విచ్ఛినకర శక్తులను ఓడించాలి. యువత కోసం, భావితరాల కోసం హైదరాబాద్ అభివృద్ధి క్రమాన్ని అప్రతిహతంగా ముందుకు సాగేందుకు ఆలోచన చేయాలి. 2016 లో వలసవాదుల నుంచి కాపాడుకున్నట్టే ఇప్పుడు మతతత్వవాదుల నుంచి, విచ్ఛిన్నకర శక్తుల నుంచి హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సి ఉన్నది.

శ్రీధర్ రావు-  దేశ పాండే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News