Thursday, May 2, 2024

వైరస్‌ను అంటించుకొని వెళ్లిన్రు…!

- Advertisement -
- Advertisement -

ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న వారికి వైరస్ ‘ఫీయర్’
జిల్లాల్లో క్రమంగా పెరుగుతున్న పాజిటివ్‌ల సంఖ్య
7 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అంటున్న అధికారులు

Corona virus fear in GHMC elections

మన తెలంగాణ/హైదరాబాద్ : “జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్బంగా గత ఇరవై రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పంచాయితీ రాజ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు సిటీలో విధులు నిర్వర్తించారు. అయితే వీరిలో రెండ్రోజుల క్రితం 25 మందికి వైరస్ సోకడంతో ఆ శాఖలోని మిగతా ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. అంతేగాక అదే జిల్లాకు చెందిన మరో 7 మంది ఆరోగ్యశాఖ సిబ్బందికి కూడా పాజిటివ్ తేలింది. దీంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 45 మంది లీడర్లు, కార్యకర్తలకూ తాజాగా వైరస్ సోకింది. వీరు గత ఇరవై రోజుల నుంచి హయత్‌నగర్, ఎల్.బినగర్, ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించినట్లు అక్కడి వైద్యాధికారులు తెలిపారు. అంతేగాక జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, ఎంఎల్‌ఏ చిన్నం దుర్గయ్యకు కూడా కరోనా పాజిటివ్ తేలింది. దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ముఖ్య లీడర్ అనుచరుల్లో కూడా సుమారు 10 మందికి వైరస్ తేలింది.

వీరు కూకట్‌పల్లి ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు సిటీలోని వివిధ డివిజన్లకు చెందిన కార్యకర్తలూ కరోనా సింప్టమ్స్‌తో తమ ఆసుపత్రికి వస్తున్నట్లు ఫీవర్ ఆసుపత్రి అధికారులు తెలిపారు. అంతేగాక సోమవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎంఎల్‌ఏ ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి కూడా కరోనా తేలింది. దీంతో పాటు ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఒకేసారి నలుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లకూ కోవిడ్ తేలింది. వీరంతా ఇటీవల ముగిసిన జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో విధులు నిర్వర్తించడం గమనార్హం. దీంతో ఆయా వర్గాల్లో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ విధంగా గత నాలుగు రోజుల ఎన్నికల్లో పాల్గొన్న అనేక మందికి క్రమక్రమంగా వైరస్ లక్షణాలు తేలడం భయాందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి”. అయితే ఇది సెకండ్ వేవ్‌కి దారి తీయకుండా ఉండాలంటే ఎన్నికల్లో పాల్గొన్న వారంతా తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్ ఉండాల్సిందేనని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు సూచిస్తున్నారు. అయితే సెకండ్ వేవ్ అనేది మన చేతుల్లోనే ఉందని, వైద్యశాఖ సూచించిన కరోనా నిబంధనలు పాటిస్తే ఎట్టి పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ రాదని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కావున ప్రజలెవ్వరూ నిర్లక్షం చేయొద్దని ఆయన మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్‌లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ ‘ఫీయర్’ పట్టుకుంది. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి సిటీలో ప్రచారం నిర్వహించిన వారికీ, ఎలక్షన్ డ్యూటీల్లో పాల్గొన్న వివిధ శాఖలకు చెందిన సిబ్బందిలలో కొందరికి పాజిటివ్ తేలడంతో మిగతా వారిలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోని వారు మరింత టెన్షన్ పడుతున్నారు. వాస్తవంగా ఎన్నికల సమయంలో వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని వైద్యశాఖ ముందే హెచ్చరించింది. ఎన్నికల ప్రచారం, రోడ్‌షోలు, బహిరంగ ప్రదేశాల్లోనూ కరోనా నిబంధనలు పాటించాలని వివిధ పార్టీ నేతలకు వైద్యాధికారులు వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వరద ప్రాంతాల్లో నివసించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులు పలుమార్లు సూచించారు. కానీ ఎలక్షన్ సమయంలో సుమారు 45 శాతం మంది ప్రజలు కరోనా వైరస్‌ను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. రోజు వారీగా నమోదైన కేసుల సంఖ్య తగ్గడంతోనే వైరస్ తగ్గుముఖం పట్టిందనే అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. దీంతో కొందరు మాస్కు, భౌతిక దూరం వంటి వ్యాప్తి నియంత్రణ ప్రాథమిక సూత్రాలను కూడా పాటించడం లేదు. దీంతో కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ భావిస్తుంది. ఈ మేరకు ఎన్నికల్లో పాల్గొన్న వారంతా కనీసం 7 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్ కావాల్సిందిగా హెల్త్ డైరెక్టర్ వివిధ పార్టీలకు చెందిన నాయకులను కోరారు.

శీతాకాలం సెకండ్ వేవ్‌కు అనుకూలం….

శీతాకాలంలోని వాతావరణ పరిస్థితులు సెకండ్ వేవ్‌కు దారి తీసే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంటుంది. వాస్తవంగా వైరస్ వ్యాప్తికి శీతాకాలం అనువుగా ఉంటుంది. శీతల వాతావరణ పరిస్థితుల్లో టెంపరేచర్ తక్కువగా ఉండటం వలన కరోనా వ్యాప్తి భారీగా పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ సమయంలో చాలా మంది తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో అసింప్టమాటిక్ వైరస్ క్యారియర్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీంతో ప్రజలతో పాటు అధికారుల్లో కూడా కాస్త ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.

పెళ్లిళ్లు, పంక్షన్లతోనూ కేసులు పెరుగుతున్నాయి…

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెళ్లిళ్లు, పంక్షన్లతోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ గుర్తించింది. ఇటీవల జగిత్యాల జిల్లాల్లో జరిగిన ఓ వివాహ విందు కార్యక్రమంలో ఏకంగా 70 మందికి పాజిటివ్ తేలినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వికారాబాద్ జిల్లాల్లో కూడా ఈ శుభ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సుమారు 30 మందికి వైరస్ సోకినట్లు అక్కడి అధికారులు తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిన పుట్టిన రోజు కార్యక్రమంలో 15 మందికి కరోనా సోకింది. ఇలా మరిన్ని జిల్లాల్లోనూ కేసులు తెలినట్లు అధికారులు అఫ్ ది రికార్డులో చెబుతున్నారు.

అప్రమత్తమైన ఆరోగ్యశాఖ….

కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో కరోనా మందులు, టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచింది. దీంతో పాటు 300 మొబైల్ వెహికల్స్‌తో వివిధ ప్రాంతాల్లో ఆర్‌టిపిసిఆర్ విధానంలో టెస్టులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ మొబైల్ టెస్టింగ్ పాయింట్లను ఓల్డేజ్, హైరిస్క్ గ్రూప్‌లు అధికంగా ఉండే ఏరియాల్లో విస్తృతంగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. అంతేగాక జనసమూహాలు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, ఇతర కమర్షియల్ ప్రాంతాల్లో మొబైల్ టెస్టింగ్‌లతో ప్రజలకు నిర్ణిత కాల వ్యవధిలో విస్తృతంగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. అయితే టెస్టింగ్ విషయంలో ఎలాంటి సందేహాలున్నా 104కి లేదా, 040,24651119కి ఫోన్ చేయాలని అధికారులు చెబుతున్నారు. అంతేగాక కరోనా ట్రీట్మెంట్‌ను అందించే 62 ఆసుపత్రులతో పాటు ప్రతి పిహెచ్‌సి సెంటర్లలోనూ ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేగాక ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వైద్యశాఖ తెలిపింది. కావున సింప్టమ్స్ తేలిన వారు వెంటనే పరీక్ష నిర్వహించుకొని చికిత్స తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

రీ ఇన్‌ఫెక్షన్లూ వస్తున్నాయి…

కరోనా రీ ఇన్‌ఫెక్షన్లూ వస్తున్నాయి. జూన్, జూలై, నెలల్లో వైరస్ సోకిన వారికి రెండోసారి కూడా పాజిటివ్ వస్తున్నట్లు తాజాగా కింగ్‌కోఠి ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. చార్మినార్‌కు చెందిన ఓ ఫ్యామిలీ మర్కజ్ ప్రార్థనల సమయంలో వైరస్ బారిన పడ్డారు. చికిత్స అనంతరం అందరూ కోలుకున్నారు. కానీ తాజాగా ఆ కుటుంబంలోని ఇద్దరి వ్యక్తులకు మళ్లీ పాజిటివ్ తేలినట్లు అధికారులు గుర్తించారు. దీంతో మొదట్లో వైరస్ వచ్చిన వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News