Tuesday, May 14, 2024

సెంట్రల్ విస్టా శంకుస్థాపనకు సుప్రీం గ్రీన్ సిగ్నల్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనుల శంకుస్థాపనకు కేంద్రానికి సుప్రీంకోర్టు సోమవారం అనుమతిని ఇచ్చింది. ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోవచ్చునని తెలిపింది. ఈ నెల 10వ తేదీన ఈ కార్యక్రమం ఖరారు అయింది. పార్లమెంట్ భవనం, ప్రధాన అధికారిక కార్యాలయాల మార్పులకు సంబంధించిన భారీ స్థాయి సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ ఇచ్చుకుంది. ఈ ప్రాజెక్టుపై దాఖలు అయి విచారణదశలో ఉన్న కేసులను సుప్రీంకోర్టు ముగించే వరకూ ఎటువంటి నిర్మాణ లేదా కూల్చివేతలు చేపట్టబోమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయమూర్తి ఎఎం ఖాన్విల్కర్‌తో కూడిన ధర్మాసనానికి తెలిపారు.

కేవలం పునాది రాయి వేసే కార్యక్రమం ఈ నెల పదవ తేదీన ఉంటుందని, కోర్టు పరంగా అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ దీనిపై ముందుకు పొయ్యేది లేదని వివరణ ఇచ్చుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో సెంట్రల్ విస్టా కార్యక్రమాన్ని కేంద్రం ప్రకటించింది. దీనిలో భాగంగా నూతన త్రికోణాత్మక పార్లమెంట్ భవనం నిర్మాణం వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవం నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించారు. ఈ నెల 10వ తేదీన కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. పర్యావరణ సంబంధిత అంశాలు ఇతరత్రా అనుమతులపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రాజెక్టు నిలిపివేతకు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ దశలో కేంద్రం నుంచి వివరణను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేవలం శంకుస్థాపన జరిగిపోతుందని, తరువాతి ప్రక్రియ తరువాతనే ఉంటుందని తెలిపింది. దీనిని లెక్కలోకి తీసుకున్న సుప్రీంకోర్టు శంకుస్థాపనకు అనుమతిని ఇచ్చింది.

Supreme Court approved for Central Vista Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News