Sunday, April 28, 2024

ప్రశాంత్ కిషోర్‌తో రాహుల్‌గాంధీ భేటీ

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi meets Prashant Kishor

పంజాబ్ రాజకీయాలపై చర్చ..

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. కిషోర్‌తో భేటీ అయిన వారిలో ప్రియాంకాగాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పంజాబ్ ఇంచార్జ్ హరీష్‌రావత్, కెసి వేణుగోపాల్ ఉన్నారు. గంటసేపు సాగిన వీరి చర్చలో పంజాబ్‌లో పార్టీ పరిస్థితి, తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రశాంత్‌కిషోర్ నుంచి సలహాలు కోరినట్టు తెలుస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్, పార్టీ మరో ముఖ్యనేత నవజోత్‌సింగ్‌సిద్ధూ మధ్య విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ఇద్దరి మధ్యా సఖ్యత కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోడంతో పార్టీకి నష్టం జరగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానానికి సవాల్‌గా మారింది.

వీరి మధ్య సయోధ్య కోసం పార్టీ సీనియర్ నేత మల్లికార్జునఖర్గే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ఎఐసిసి కమిటీని సోనియాగాంధీ నియమించారు. ఇద్దరు నేతలతోనూ చర్చించిన అనంతరం కమిటీ తన నివేదికను సోనియాకు ఇప్పటికే సమర్పించింది. సోనియా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఆమోదమేనని అమరీందర్‌సింగ్ ప్రకటించారు. అయితే, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సిద్ధూ కోరుతుండగా, సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, ఈలోగా పార్టీలో అంతర్గత కలహాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అధిష్ఠానం భావిస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో పార్టీని పునర్ వ్యవస్థీకరించే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది.

 

Rahul Gandhi meets Prashant Kishor

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News