Sunday, May 12, 2024

నటుడు మురళీమోహన్‌కు ‘సుప్రీం’లో చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

Supreme Court okays Sec 420 on Jayabheri Group

మనతెలంగాణ/హైదరాబాద్: హెచ్‌ఎండిఎ నిబంధనలను అతిక్రమించిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్ అధినేత సినీ నటుడు, టీడీపీ నేత మురళీ మోహన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జయభేరీ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసిన ఫ్లాట్ విషయంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారంటూ ఓ కొనుగోలుదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుడికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మాగంటి మురళీమోహన్, బిజినెస్ ఎంటర్‌ప్రైన్యూర్ మాగంటి రామ్మోహన్, సంస్థ డైరెక్టర్ కిషోర్ దుగ్గిరాలలపై వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేసినందుకు, మోసాలకు పాల్పడినందుకు సెక్షన్ 406,420 కింద చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. 2001 నుంచి 2007 వరకు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొత్తగూడలో జయభేరి సిలికాన్ కౌంటిని నిర్మించారు. జయభేరి ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పేరిట పలువురు ఐటి ప్రొఫెషనల్స్, ఇతరులకు ప్లాట్లను విక్రయించారు. జయభేరికి ముందు ఎంఎం ఫైనాన్సియర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే 2003లో మధుసూదన్ బండ్రెడ్డి అనే వినియోగదారుడు జయభేరి సిలికాన్ బేటా కాంప్లెక్సులో 3010 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ నం.203ను కొనుగోలు చేశాడు. ఈక్రమంలో కారు పార్కింగ్ కూడా ఉన్నట్లు సేల్‌డీడ్‌లో పలు అంశాలను పేర్కొన్నారు. కానీ వాటిని సదరు సంస్థ అమలు చేయలేదు. దీంతో వినియోగదారుడు చట్ట ఉల్లంఘనల కింద ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో 2008 డిసెంబర్ 18న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అప్పట్లోనే ప్రమోషన్ ఆఫ్ కన్స్రక్షన్ అండ్ ఓనర్ షిప్ యాక్ట్ 1987 కింద పోలీసులు దర్యాప్తు చేసి చార్జిషీట్‌దాఖలు చేశారు. కాగా 2009 నుంచి ట్రయల్స్ నడుస్తున్నాయి. ఇదిలావుండగా ట్రయల్స్ కోర్టులో ఇది సివిల్ అంశంగా పరిగణిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో వినియోగదారుడు హైకోర్టును ఆశ్రయించాడు. సివిల్ అంశాలతో పాటు క్రిమినల్ చార్జెస్ ఫ్రేమ్ చేయాల్సిందేనని, వినియోగదారులను మోసగించినట్లుగా తెలుస్తోందని జస్టిస్ దుర్గాప్రసాద్ తీర్పునిచ్చినట్లు హైకోర్టు న్యాయవాది తెలిపారు. దీనిపై జయభేరి సంస్థ ప్రతినిధులు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే సదరు సంస్థ ప్రతినిధులు సమర్పించిన స్పెషల్‌లీవ్ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. సేల్‌డీడ్‌లో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని అమలు చేయాల్సిందేనని ట్రాయల్ కోర్టు స్పష్టం చేసింది. ఈక్రమంలో అనేక ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయ పడటంతో పాటు వినియోగదారునికి ఊరటనిచ్చింది. కాగా సుప్రీంకోర్టు తీర్పును అంగీకరిస్తున్నామని, తమ సంస్థ నుంచి 162 మంది వినియోగదారుల సమూహంలో ఒకరిద్దరు అసంతృప్తికి గురైన మాట వాస్తవమేనని సంస్థ డైరెక్టర్ కిషోర్ దుగ్గిరాల పేర్కొన్నారు.

Supreme Court okays Sec 420 on Jayabheri Group

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News