Sunday, May 5, 2024

70 ఏళ్లలో కూడగట్టిన ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi slams PM Modi

కేంద్రం మానిటైజేషన్ విధానంపై రాహుల్ ధ్వజం
రైల్వేలను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని ప్రశ్న

న్యూఢిల్లీ: కేంద్రం సోమవారం ప్రకటించిన మానిటైజేషన్ విధానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు 70 ఏళ్లుగా అభివృద్ధి చేసిన ప్రతిష్ఠాత్మక ఆస్తులను తెగనమ్ముతోందంటూ బిజెపి సర్కార్‌పై మండిపడ్డారు. ప్రధాని మోడీ తన స్నేహితులైన పారిశ్రమ పెద్దలకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతున్నారంటూ మంగళవారం మీడియా సమావేశంలో మోడీపై రాహుల్ విరుచుకు పడ్డారు. కేవలం ఇద్దరు ముగ్గురు బడా కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే తాజా ప్రణాళికలన్న రాహుల్ గాంధీ కోట్లాది మందికి ఉపయోగకరంగా ఉండే రైల్వేలను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోర్టులు, విమానాశ్రయాలను ఎవరు పొందుతున్నారో గమనించాలంటూ బడా కంపెనీలను గుర్తు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

గత ప్రభుత్వాలు ప్రజాధనంతో నిర్మించిన బంగారం లాంటి ఆస్తులను మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని దుయ్యబట్టారు. జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా మోడీ సర్కార్ తన పారిశ్రామిక మిత్రులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం కానప్పటికీ కీలక పరిశ్రమలను తామెప్పుడూ ప్రైవేటీకరించలేదన్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ ఏం అమ్ముతోందో, ఏ ఆస్తి ఎవరికి చేరుతోందో యువతకు తాను చెప్పాలనుకుంటున్నాని రాహుల్ అన్నారు. ముఖ్యంగా కరోనా గురించి తాను హెచ్చరించినప్పుడు అందరూ నవ్వారని, కానీ చివరికి ఏం జరిగిందో మీరే చూశారని రాహుల్ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ ప్రణాళిక దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. మౌలిక సదుపాయాల రంగాలలో ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యం గుత్తాధిపత్యానికి దారితీస్తుందని, తద్వారా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితికి దారి తీస్తుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా మండిపడ్డారు. 70 ఏళ్ల కాలంలో నిర్మించిన ఆస్తులను విక్రయించడానికి నిధుల సమీకరణ ఒక్కటే లక్షం కాదని ఆయన అన్నారు. ఇంత భారీ మొత్తలో ఆస్తుల విక్రయం చేపట్టేముందు ఉద్యోగులు, కార్మిక సంఘాలు రైతులు సహా దీనికి సంబంధించిన భాగస్వాములందరితో చర్చించాలని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News