Monday, May 6, 2024

రాష్ట్రవ్యాప్తంగా వడగండ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

- Advertisement -
- Advertisement -

Rain

 

పలుచోట్ల నేలకొరిగిన చెట్లు
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం వడగండ్లు, ఉరుములు, మెరుపులు కూడిన వర్షం కురిసింది. నగర శివార్లలో ఈదుర గాలులతో కూడిన వాన కురిసింది. ఉదయం నుంచి మండుటెండలతో జనం ఇళ్లల్లో ఉక్కిరిబిక్కిరి అయిపోగా, సాయంత్ర వేళలో వరుణుడు ప్రజలకు ఎండ వేడిమి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించాడు. నగర శివార్లలోని ఈసిఐఎల్, జవహర్ నగర్, దమ్మాయిగూడ, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు శామీర్‌పేటతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల చెట్లు నేలకొరగడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో ఈదురుగాలులు
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో (గంటకు 30 నుంచి 40 kmph) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కోమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురువారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాగల మూడురోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 41 నుంచి 43 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

1.5 కి.మీల నుంచి 2.1 కి.మీల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం
దక్షిణ చత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీల నుంచి 2.1 కి.మీల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు పశ్చిమ విదర్భ, ఉత్తర మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కి.మీల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మలాకా జలసంధి, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 km నుంచి 5.8 కి.మీల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో సుమారుగా ఏప్రిల్ 30 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి 48 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రారంభంలో ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి ఉత్తర ఈశాన్య దిశగా అండమాన్ నికోబార్ దీవుల తీరం వెంబడి ఏప్రిల్ 30 వ తేదీ నుంచి మే 3 వ తేదీల మధ్య సమయంలో మయన్మార్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 

Rain across the state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News