Sunday, May 5, 2024

తొలకరి పులకిరింపు

- Advertisement -
- Advertisement -

మత్తడి దుంకిన ఖమ్మం ప్రకాశ్‌నగర్ చెక్ డ్యామ్
నల్లగొండ జిల్లాలో తడిసిన ధాన్యం కుప్పలు, తూకం వేసిన బస్తాలు
పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
మరో మూడురోజులు వర్షాలు : వాతావరణశాఖ

మనతెలంగాణ/హైదరాబాద్: కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, రాగల మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు చోట్ల అతి భారీ వర్షాలు నమోదైనట్లు ఆమె వెల్లడించారు. 24 గంటల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవడంతో పాటు ఒకటి, రెండు చోట్ల అతిభారీ వర్షాలు నమోదైయినట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు తెలిపారు.
పోచంపల్లిలో 13 సెంటీమీటర్‌లు
అత్యధికంగా పోచంపల్లిలో 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.
గురువారం తెల్లవారుజామున పలుచోట్ల…
మహబూబాబాద్‌లో 40 మిల్లీమీటర్లు, ఖమ్మం 25.2, వరంగల్ రూరల్‌లో 25, భద్రాద్రి కొత్తగూడెంలో 23.4, ములుగులో 22, జయశంకర్ భూపాలపల్లి 9.3, సూర్యాపేటలో 7.5, వరంగల్ అర్భన్ 5.8, జనగాం 4.5, నల్లగొండ 4.3, యాదాద్రి భువనగిరి 3.9, పెద్దపల్లి 2.8, నాగర్‌కర్నూల్ 2.3, మంచిర్యాల 1.9, మెదక్‌లో 1.7, రంగారెడ్డిలో 1.2, వికారాబాద్‌లో 1.2, సిద్ధిపేట 0.9, సంగారెడ్డిలో 0.8, రాజన్న సిరిసిల్ల 0.8, జోగులాంభ గద్వాల్ 0.6, వనపర్తి 0.6, కామారెడ్డి 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో..
రాష్ట్రంలో పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లా చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాంపల్లి మండలంలోని శేసిలేటి వాగు, చండూర్ మండలంలోని శిర్దేపల్లి వాగు, బొడంగిపర్తి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చండూర్ పురపాలికలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు జలమ యమయ్యాయి.
తడిసిన తూకం వేసిన బస్తాలు
నల్గొండ జిల్లా నాంపల్లి, చండూర్‌లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. తూకం వేసిన బస్తాలు తడిసి ముద్దయ్యాయి.
ఆలయంలోకి నీరు..
యాదాద్రిలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఆలయంలోకి నీరు చేరింది. బాలాలయంలోకి పెద్దఎత్తున చేరిన నీరు మెట్ల దారి మీదుగా క్యూ లైన్లలోకి ప్రవహించింది. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ కార్యక్రమంలో ఇబ్బందులు తలెత్తాయి. నీళ్లలోనే పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
ఖమ్మంలో ఉదయం గంటపాటు కురుసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని మయూరి కూడలి, ప్రకాశ్ నగర్, మూడో పట్టణ ప్రాంతంలోని రోడ్లపై పెద్దఎత్తున నీరు చేరింది.
నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తెల్లవారు జాము నుంచే చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. హన్మకొండలో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ములుగు జిల్లా వెంకటాపూర్, గోవిందరావుపేట, ములుగు మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జంగాలపల్లి, వెంకటాపూర్, గోవిందరావుపేట, పస్రా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది.

Rains in Telangana for next 3 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News