Saturday, April 27, 2024

మూడురోజుల పాటు వర్షాలు

- Advertisement -
- Advertisement -

Rains in Telangana For Next Three Days

ఉరుములు, మెరుపులతో తేలికపాటి వానలు
గంటకు 30 నుంచి -40 కి.మీల వేగంతో ఈదురుగాలులు

హైదరాబాద్: సూర్యుడు భగ్గుమంటున్న వేళ హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురును మోసుకొచ్చింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి మధ్యప్రదేశ్ నుంచి కోమరిన్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడడంతో పాటు మధ్య మహరాష్ట్ర, కర్ణాటక, కేరళ మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించిందని అధికారులు తెలిపారు. దీంతో ఆది, సోమ, మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా కురిసే అవకాశముందని, గంటకు 30 నుంచి -40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సముద్రమట్టం నుంచి 900మీటర్ల వరకు

తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, తమిళనాడు నుంచి కర్ణాటక వరకు సముద్రమట్టం నుంచి 900మీటర్ల వరకు ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.

పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా

కొన్ని రోజులుగా భానుడి భగభగల నేపథ్యంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలో వర్షం

ఉపరితల ద్రోణి ప్రభావంతో మంచిర్యాల, జైశంకర్ భూపాల పల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

జోగులాంభ గద్వాల్‌లో కనిష్ట తేమశాతం 18గా నమోదు

గరిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతుండగా గాలిలో సగటు కనిష్ట తేమ శాతం ఆదిలాబాల్‌లో 22శాతం, కుమురంభీం 38, నిర్మల్‌లో 33, నిజామాబాద్‌లో 22,కామారెడ్డిలో 23, సంగారెడ్డిలో 23, మెదక్‌లో 21, జోగులాంభ గద్వాల్‌లో 18, మహబూబ్‌నగర్‌లో 20, వికారాబాద్‌లో 21గా నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది.

ఆదిలాబాద్‌లో 40 డిగ్రీలుగా నమోదు

రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు శనివారం ఈ విధంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 40 డిగ్రీలు, కుమురం భీంలో 39.7, నిజామాబాద్‌లో 39.3, ములుగులో 39, మంచిర్యాలలో 38.8, కామారెడ్డిలో 38.7, వికారాబాద్‌లో 38.7, హైదరాబాద్‌లో 37, మేడ్చల్ మల్కాజిగిరిలో 36.7, రంగారెడ్డిలో 36.2 డిగ్రీలుగా నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News