సాధారణంగా కొత్త సిమ్ కార్డు తీసుకుంటే.. మనవాళ్లకు ఫోన్ చేసి ఆ నెంబర్ వివరాలను పంచుకుంటాము. ఆ తర్వాత వాళ్లు ఆ నెంబర్ ద్వారా మనతో టచ్‌లో ఉంటారు. కానీ, కొత్తగా ఓ సిమ్ కార్డు తీసుకుంటే.. ఆ నెంబర్‌కి విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ వంటి వ్యక్తులు ఫోన్ చేస్తే.. అది నిజంగా షాకింగ్‌గా ఉంటుంది. ఛత్తీగఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాలోని మడగావ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 21 ఏళ్ల మనీశ్ బిసి దేవ్‌బోగ్‌లో కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడు. తన స్నేహితుడు ఖెమ్‌రాజ్‌తో కలిసి వాట్సప్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రోఫైల్ ఇమేజ్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ (Rajat Patidar) ఫోటో కనిపించింది.
అయితే ఆ విషయాన్ని వాళ్లు అంతగా పట్టించుకోలేదు. కానీ, ఆ తర్వాత విరాట్, డివిలియర్స్, యశ్ దయాల్ సహా ఆర్‌సిబి ఆటగాళ్ల నుంచి ఫోన్లు రావడం మొదలైంది. ఇలా రెండు వారాలు గడిచాయి. మరోవైపు రజత్ (Rajat Patidar) తన వాట్సాప్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోయాడు. దీంతో అతను మధ్యప్రదేశ్ సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఆ వాట్సాప్ నెంబర్ మనీశ్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. టెలికాం కంపెనీ పునః కేటాయింపు పాలసీ ప్రకారం ఆ సిమ్‌ను మనీశ్‌కు కేటాయించినట్లు తెలిసింది. దీనిపై గరియాబంద్ ఎస్పి నిఖిల్ రఖెచా మాట్లాడుతూ.. ఆరు నెలల పాటు సిమ్‌ను వాడకుంటే ఆ నెంబర్‌ను టెలికాం కంపెనీలు మరోవ్యక్తికి కేటాయిస్తాయి. ఈ కేసులోనూ అదే జరిగింది. ఇప్పుడు రజత్‌కు మళ్లీ ఆ సిమ్‌ను రిటర్న్ చేస్తాం’’ అని వెల్లడించారు. క్రికెట్‌కు వీరాభిమానులైన మనీశ్ ఖెమ్‌రాజ్ తమ అభిమాన క్రికెటర్ల నుంచి ఫోన్లు రావడంతో తెగ సంబరపడుతున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.