Friday, May 3, 2024

రాష్ట్రంలో 74శాతం బియ్యం పంపిణి పూర్తి

- Advertisement -
- Advertisement -

63.34 లక్షల కుటుంబాలకు 2 లక్షల 51 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణి
ఒకటి, రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో రూ.1500ల చొప్పున జమ చేస్తాం
10 కోట్ల గన్ని బ్యాగులను సమకూర్చుకున్నాం
పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

ration

 

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 74 శాతం మంది లబ్దిదారులకు బియ్యం పంపిణీ పూర్తి అయిందని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో ఆకలితో పస్తులు ఎవరూ ఉండకూడదన్న లక్షంతో సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1500, ప్రతి ఒక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యాన్ని అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల ఒకటవ తేదీ నుంచి ప్రారంభించిన బియ్యం పంపిణీలో కేవలం 8 రోజుల్లో 2 కోట్ల మందికి రేషన్ అందించామన్నారు. దీంతో ఉచిత రేషన్ బియ్యాన్ని 63.34 లక్షల కుటుంబాలకు 2 లక్షల 51 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణి చేశామని తెలిపారు. బుధవారం మన తెలంగాణ ప్రతినిధితో మారెడ్డి మాట్లాడుతూ, లాక్ డౌన్‌లో పేద ప్రజలు తమకు అవసరమైన సరుకులు కొనుక్కోవడానికి ప్రతి లబ్ధిదారుడికి రూ. 1500 నగదు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 1314 కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. ఈ నగదును తక్షణమే లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఒకటి రెండు రోజుల్లో వారి ఖాతాల్లో జమ అయ్యేలా ప్రక్రియను మరింత వేగవంతం చేశామని తెలిపారు. 8వ తేదీ వరకు రికార్డు స్థాయిలో 2 కోట్ల మందికి ఉచితంగా 12 కిలోల బియ్యం పంపిణి చేయడం జరిగిందని వివరించారు. కేవలం ఎనిమిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో 74% బియ్యం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి రోజు సగటున 8 లక్షల మంది కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ నెల 4వ తేదీన ఏకంగా 12 లక్షల మంది కార్డుదారులు బియ్యం తీసుకున్నారని వివరించారు. సాధారణ రోజుల్లో 2 నుంచి 3 లక్షల మంది కార్డుదారులు రేషన్ తీసుకునేవారన్నారు. . ప్రారంభంలో ఒకటి రెండు రోజులు సర్వర్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా వెంటనే వాటిని పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రస్తుతం రేషన్ పంపిణీ ప్రక్రియ సాఫీగా సాగుతోందన్నారు. కాగా పోర్టబిలిటీ ద్వారా రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చుఅని, అలాంటి వారు బయో మెట్రిక్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇలాగే రైతులకు ఇబ్బంది లేకుండా గన్ని బ్యాగ్‌లను కూడా సమకూర్చుతున్నామన్నారు. గన్ని సంచుల కొరతను అధిగమించేందుకు పౌరసరఫరాల సంస్థ చర్యలను మరింత ముమ్మరం చేసిందన్నారు. కలకత్తా నుంచి కొత్త గన్ని సంచులకు సంబంధించిన తాజా పరిస్థితి, పాత గన్నీ సంచులు ఎంత మేరకు సమకూర్చుకోవచ్చు? ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? వంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి కావడం ఇదే మొదటి సారన్నారు. కాని ఇదే సమయంలో లాక్ డౌన్‌తో గన్నీ సంచుల కొరత ఏర్పడిందని, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులను అధిగమించడానికి ప్రధానంగా రైస్ మిల్లర్లు, రేషన్ డీలర్లు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మొత్తం 17,200 రేషన్ షాపులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో రేషన్ డీలర్లు గన్ని బ్యాగులను ఇవ్వాలని కోరాన్నారు. 60 నుంచి 70 లక్షల గన్ని బ్యాగులు రేషన్ దుకాణాలే నుంచి సమకూర్చుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్టానికి 20 కోట్ల గన్ని బ్యాగులు అవసరం అవుతాయని అంచానా వేశామన్నారు. ఇందులో 10 కోట్ల బ్యాగులు ఇప్పటి వరకు సమకూర్చుకున్నామన్నారు. కాగా గన్ని బ్యాగ్‌ల కొరతను ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి ఇప్పటికే సిఎం కెసిఆర్ తీసుకెళ్ళారన్నారు.

Ration rice distribution in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News