Sunday, May 5, 2024

కరోనా ఉక్కిరిబిక్కిరి నుంచి ఉపశమనం

- Advertisement -
- Advertisement -

Release of prisoners from prisons began

 

జైళ్ల నుంచి ఖైదీల విడుదల ఆరంభం
సుప్రీంకోర్టు చురకలతో కదలిక
జైళ్లలో రద్దీ మధ్య వైరస్ భయాలు

న్యూఢిల్లీ : ఖైదీలతో కిక్కిరిసి ఉండే జైళ్లలో ప్రస్తుత కరోనా వైరస్ తీవ్రసవాలును విసిరింది. ఖైదీల ఆరోగ్య పరిరక్షణపై సుప్రీంకోర్టు స్పందించిన నేపధ్యంలో వివిధ రాష్ట్రాలలో ఖైదీల విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. చట్టపరమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వీరిని విడిచిపెడుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో 7200 మంది ఖైదీలను విడుదల చేశారు. జైళ్లల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు ముందు 60 జైళ్లలో 35000కు పైగా ఖైదీలు ఉన్నారు. వీరిలో విచారణలో ఉన్న ఖైదీలు కూడా ఉండటంతో వీరి ఆరోగ్య పరిస్థితిపై ఇటీవలే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు వెలువరించింది. ఇప్పుడు 7200 మందిని విడుదల చేస్తున్నట్లు, దాదాపు మరో పదివేల మందిని త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఒడిషాలో కూడా 7200 మందిని విడుదల చేశారు. వీరిలో అండర్ ట్రయల్స్ , శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా ఉన్నారని భువనేశ్వర్‌లో ఓ సీనియర్ అధికారితెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో వివిధ జైళ్ల నుంచి 3వేల మంది ఖైదీలను విడుదల చేసినట్లు కోల్‌కతాలో అధికారులు తెలిపారు. మార్చి చివరి వారం నుంచి వరుసగా ఖైదీల విడుదల జరుగుతూ వస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పాతికవేల మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు అండర్‌ట్రయల్స్‌గానే ఉన్నారు. కిక్కిరిసిపోయి ఉన్న అసోం జైళ్ల నుంచి 3550 మంది ఖైదీలను విడుదల చేశారు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వెలువడకముందే రాష్ట్రంలో ఖైదీల విడుదలకు చర్యలు తీసుకుంటూ వచ్చారు.

మహిళా ఖైదీకి కరోనా లక్షణాలు

పంజాబ్‌లోని లూథియానా జిల్లాలో 48 ఏండ్ల మహిళా ఖైదీకి కరోనా వైరస్ సోకింది. డ్రగ్స్ సరఫరా అభియోగాలపై ఈ మహిళను గత నెల 28వ తేదీన సంగ్రూర్ పోలీసులు జైలుకు తీసుకువచ్చారు. ఈ నెల 1వ తేదీన జరిగిన వైద్య పరీక్షల క్రమంలో వైరస్ పాజిటివ్ కన్పించింది. కరోనా తీవ్రత ఎక్కువగానే ఉన్న పంజాబ్‌లో ఇప్పటివరకూ 9773 మంది ఖైదీలను విడుదల చేశారు. మహిళా ఖైదీకి వైరస్ ఉన్నట్లు నిర్థారణ కావడంతో జైళ్లలో కలకలం చెలరేగింది.

యుపి జైళ్లలో కోవిడ్ పరీక్షలు

ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జైళ్లలో కోవిడ్ ర్యాండం టెస్టులు చేపట్టారు. ఆగ్రా సెంట్రల్ జైలులో ఓ ఖైదీ కోవిడ్‌తో మృతి చెందిన తరువాత అధికారులు స్పందించారు. ఖైదీల రక్తనమూనాల సేకరణ తరువాత ర్యాండం పరీక్షలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఆగ్రా జైలులో ఖైదీ వైరస్‌తో మృతి చెందిన తరువాత వెంటనే అక్కడి ఖైదీలను క్వారంటైన్ చేసినట్లు, ఇప్పుడు పూర్తి స్థాయి పరీక్షలు చేపట్టినట్లు జైళ్ల విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆనంద్‌కుమార్ ఆదివారం పిటిఐకి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో 71 జైళ్లలో 94000 మందికిపైగా ఖైదీలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News